శుభ శకునానికని ఎదురొస్తే ప్రాణాలే పోయాయి | - | Sakshi
Sakshi News home page

శుభ శకునానికని ఎదురొస్తే ప్రాణాలే పోయాయి

May 14 2026 6:15 AM | Updated on May 14 2026 6:15 AM

వెనుక నుంచి దూసుకొచ్చిన కారు ఢీకొని మహిళ దుర్మరణం మృతురాలి కుమారుడికి తీవ్రగాయాలు

కిలేశపురం(ఇబ్రహీంపట్నం): ఇంటికొచ్చిన బంధువులను తిరిగి పంపించేందుకు కారుకు శుభ శకునానికని ఎదురు వచ్చిన మహిళను వెనుక వైపు నుంచి దూసుకొచ్చిన మరోకారు ఢీకొనగా ఆమె మృత్యువాత పడిన ఘటన మండలంలోని కిలేశపురంలో 65వ నంబర్‌ జాతీయ రహదారిపై బుధవారం జరిగింది. ఘటనలో ఆమె కుమారుడికి సైతం తీవ్ర గాయాలయ్యాయి. సేకరించిన వివరాల ప్రకారం... కిలేశపురం గ్రామానికి చెందిన గుంటుపల్లి రమేష్‌, గంగాభవాని(44) దంపతుల కుమార్తెకు ఇటీవల వివాహం జరిగింది. పల్నాడు జిల్లా సత్తెనపల్లి నుంచి కుమార్తెను పుట్టింటికి కారులో తీసుకొచ్చిన బంధువులను తిరుగు ప్రయాణంలో పంపించేందుకు తన కుమారుడు వెంకట జితేంద్రతో కలిసి తల్లి గంగాభవాని శుభశకునం కోసం కారుకు డ్రైవర్‌ వైపు ఎదురు వచ్చింది. కారు ముందుకు సాగిన మరుక్షణం హైదరాబాద్‌ వైపు నుంచి దూసుకొచ్చిన మరో కారు వీరిద్దరినీ ఢీకొట్టింది. గంగాభవాని అక్కడికక్కడే మృత్యువాత పడగా, ఆమె కుమారుడు వెంకట జితేంద్రకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన జితేంద్రను హుటాహుటిన చికిత్స నిమిత్తం విజయవాడ ప్రైవేట్‌ వైద్యశాలకు తరలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement