వేగేశన.. భూదాహం తీరేనా! | - | Sakshi
Sakshi News home page

వేగేశన.. భూదాహం తీరేనా!

May 13 2026 1:08 AM | Updated on May 13 2026 1:08 AM

వేగేశన.. భూదాహం తీరేనా!

క్రైస్తవ, ప్రజా సంఘాలు వ్యతిరేకిస్తున్నప్పటికీ చకాచకా మల్టీకాంప్లెక్స్‌ పనులు కోర్టు ఉత్తర్వులను పట్టించుకోని వైనం మౌనముద్రలో అధికారులు

ఏబీఎం ఆస్తులను బొక్కేసిన ఎమ్మెల్యే వేగేశన

నిబంధనలు ఏం చెబుతున్నాయి..?

అక్రమ కట్టడాలను నిలుపుదల చేయాలి

బాపట్ల: బాపట్ల నడిబొడ్డులో విద్య, వైద్యం, ఆధ్యాత్మికత పెంపుదల కోసం క్రైస్తవ భూములైన ఏబీఎం (అమెరికన్‌ బాపిస్టు మిషన్‌) భూములపై బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ కన్ను పడింది. ఇంకేం అధికారం మనది.. మనల్ని ఆపేదెవరంటూ గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న 2016లో ఏబీఎం స్థలాన్ని ఆక్రమించేశారు. మళ్లీ అధికారం రావటంతో ఆ స్థలంలో మల్టీకాంప్లెక్స్‌ నిర్మాణానికి తెరతీశారు. ఏబీఎం ఆస్తుల జోలికి వస్తే సహించేదిలేదని మొదటి నుంచి ఆందోళనలు వ్యక్తమవుతున్నప్పటికీ అధికారం ఉంది కదా..ఏమైనా చేసుకోవచ్చనే ధోరణిలో ఎమ్మెల్యే వేగేశన ఉన్నారు. జిల్లా కేంద్రంలో నిత్యం కలెక్టర్‌, ఎస్పీ వంటి ఉన్నతాధికారులు తిరిగే ప్రదేశంలోనే అక్రమ కట్టడం జరుగుతున్నప్పటికీ అధికారులు ఆవైపు కన్నెత్తికూడా చూడకపోవటం చూస్తోంటే రెడ్‌బుక్‌ రాజ్యాంగం ఏవిధంగా సాగుతుందో ఇట్టే అర్ధమవుతుంది.

స్థలం పొందింది ఇలా..

ఏబీఎం ఆస్తులకు సంబంధించి బాపట్లలో రూ.కోట్లాది విలువైన స్థలాలు ఉన్నాయి. ఇందులో అమెరికన్‌ బాప్టిస్ట్‌ మిషన్‌కు చెందిన 668/1లో 1.50ఎకరం స్థలాన్ని కాజేసేందుకు వేగేశన నరేంద్రవర్మరాజు 2016లో చక్రం తిప్పాడు. ఈమేరకు మున్సిపాల్టీలో ఖాళీస్థలం పన్ను వేయించుకుని రిజిస్ట్రేషన్‌ చేయించుకునేందుకు సిద్ధమయ్యారు. అయితే అప్పటి రిజిస్ట్రార్‌ రిజిస్టేషన్‌ చేయించేందుకు అవకాశం లేదని చెప్పటంతో కోర్టును ఆశ్రయించారు. కోర్టు వివాదాలు లేకపోతే చట్టం ఏవిధంగా ఉంటే ఆవిధంగా చేయాలని చెప్పింది. ఈనిర్ణయం మేరకు ఎమ్మెల్యే వేగేశన నరేంద్రవర్మ తన తనయుడు పేరుతో రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నాడు. ఆదే ప్రదేశంలో మల్టీకాంప్లెక్స్‌ నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని కోరగా.. మున్సిపల్‌ కౌన్సిల్‌ 2017 ఫిబ్రవరి 23వ తేదీన తీర్మానం నెంబరు 312పేరుతో కాంప్లెక్స్‌ నిర్మాణాన్ని రద్దు చేశారు. అయినప్పటికీ పనులు మొదలుపెట్టారు. దీంతో స్థానిక క్రైస్తవులు జిల్లా కలెక్టర్‌ను ఆశ్రయించటంతో జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి షేక్‌ ఆషిరీని విచారణ అధికారిగా నియమించారు. ఈమేరకు మే 16, 2016 నుంచి మే 19, 2016వరకు విచారణ చేపట్టి ఆర్‌సి నెంబరు 46/2016 పేరుతో అక్కడ ఎటువంటి కట్టడాలు చేయరాదని ఉత్తర్వులు ఇచ్చారు. ఈమేరకు అప్పటి తహసీల్దార్‌ తిరుమలశెట్టి వల్లయ్య సీఆర్‌పీసీ కింద 145 సెక్షన్‌ కింద నోటీసు కూడా జారీ చేశారు.

ఏబీఎం స్థలంలో

నిర్మిస్తున్న కట్టడాలు

అమెరికన్‌ బాప్టిస్ట్‌ ఫారిన్‌ మిషన్‌ కింద ఉన్న భూములు అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకోవాలని క్రైస్తవ పెద్దలు డబ్ల్యూపీ నెంబరు 124/1994లో మద్రాసు హైకోర్టులో దావా వేశారు. ఈమేరకు 2000 సంవత్సరం నుంచి వీటిపై ఎటువంటి రిజిస్ట్రేషన్లు చెల్లవని, వాటిని పరిరక్షించాలని 2024లో మద్రాసు హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు ఉన్నప్పటికీ ఎమ్మెల్యే పెడచెవిన పెట్టి అక్రమ కట్టడానికి పూనుకున్నారు. ప్రజా సంఘాలు ఆందోళన చేసినప్పటికీ పట్టించుకో కుండా ముందుకుపోతున్నారు.

ఎమ్మెల్యే వేగేశన నరేంద్రవర్మరాజు తన కుమారుడు పేరుతో అక్రమంగా పొందిన ఏబీఎం ఆస్తుల్లో అక్రమ కట్టడాలు కట్టడం మానుకోవాలి. పేదల కోసం ఉన్న ఈ భూములను తన సొంతానికి అక్రమదారిలో చేజిక్కించుకోవటం సరి కాదు. ఈవిషయంలో అధికారులు సైతం మౌనంగా ఉండటం సరికాదు. పనులు నిలుపుదల చేసేవిధంగా ఉన్నతాధికారులు జోక్యం చేసుకోవాలి.

– వేమవరపు విజయ్‌కుమార్‌, బాప్టిస్ట్‌ క్రిస్టియన్‌ ప్రాపర్టీస్‌ వెల్పేర్‌ సొసైటీ అధ్యక్షుడు

Advertisement
 
Advertisement
Advertisement