రాష్ట్రానికి జగన్‌ నాయకత్వం అవసరం | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రానికి జగన్‌ నాయకత్వం అవసరం

May 13 2026 1:08 AM | Updated on May 13 2026 1:08 AM

రాష్ట్రానికి జగన్‌ నాయకత్వం అవసరం వైద్యరంగంలో నర్సుల పాత్ర కీలకం కాంట్రాక్ట్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్లకు టైం స్కేల్‌ అమలు చేయాలి సెలవుల్లో ఉపాధ్యాయులపై ఒత్తిడి తగదు

రేపల్లె: రాష్ట్ర అభివృద్ధికి దూరదృష్టి గల నాయకత్వం అవసరమని, అలాంటి నాయకుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి మాత్రమేనని కాంగ్రెస్‌ పార్టీ మాజీ ఇన్‌చార్జి, వ్యాపారవేత్త మోపిదేవి శ్రీనివాసరావు అన్నారు. ప్రజల మన్ననలు పొందిన నాయకుడిగా వైఎస్‌ జగన్‌ ఇప్పటికే నిరూపించుకున్నారని పేర్కొన్నారు. రేపల్లెలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ... రాష్ట్ర ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చగల సామర్థ్యం వైఎస్‌ జగన్‌కే ఉందన్నారు. గతంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు ప్రజలకు ఎంతో ఉపయోగపడ్డాయని గుర్తుచేశారు. పేదలు, రైతులు, మహిళలు, విద్యార్థులు.. ఇలా అన్ని వర్గాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని వైఎస్‌ జగన్‌ తీసుకున్న నిర్ణయాలు ప్రజల జీవన ప్రమాణాలను మెరుగు పరిచాయని తెలిపారు. తాను రాజకీయంగా ముందుకు సాగేది కూడా వైఎస్‌ జగన్‌తోనేనని స్పష్టం చేశారు. ఈ నెల 14న వైఎస్‌ జగన్‌ సమక్షంలో వైఎస్సార్‌ సీపీలో అధికారికంగా చేరనున్నట్లు ప్రకటించారు. వైఎస్‌ జగన్‌ నాయకత్వంలో రాష్ట్రానికి మళ్లీ మంచి రోజులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని చెప్పారు. ప్రజల సేవలో నిబద్ధతతో పని చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

బాపట్ల: వైద్యరంగంలో వైద్యులతోపాటు నర్సుల పాత్ర కూడా కీలకమని జిల్లా వైద్యాధికారిణి డాక్టర్‌ విజయమ్మ పేర్కొన్నారు. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక పీపీ యూనిట్‌లో నర్సులకు సన్మాన కార్యక్రమం చేపట్టారు. మున్సిపల్‌ కమిషనర్‌ రఘునాథరెడ్డి, రెడ్‌క్రాస్‌ చైర్మన్‌ బి.ఎస్‌.నారాయణభట్టు, నవనీతం, చల్లా లావణ్య, డీఎఫ్‌ఓ యశ్వంత్‌, జాషువా, ప్రసాద్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఏఎన్‌యూ(పెదకాకాని): ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో కాంట్రాక్ట్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్లకు టైం స్కేల్‌ అమలు చేయాలని వీసీ ఆచార్య కె.గంగాధరరావుకు వినతిపత్రం అందజేశారు. ఏఎన్‌యూలో మంగళవారం కాంట్రాక్ట్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్స్‌ యూనియన్‌ అధ్యక్షుడు డాక్టర్‌ సీహెచ్‌ తిరుమలరావు ఆధ్వర్యంలో విన్నవించారు. ఆయన మాట్లాడుతూ ఆల్‌ ఇండియా ఎడ్వరైజ్‌మెంట్‌, యూజీసీ నిబంధనలు ప్రకారం ఏర్పాటు చేసిన ఫైవ్‌మెన్‌ సెలక్షన్‌ కమిటీ ద్వారా మెరిట్‌ ప్రాతిపదికన ఎంపికై 16 సంవత్సరాలుగా సేవలు అందిస్తున్నామన్నారు. ఈ నియామకాలు ఏఎన్‌యూ ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ ద్వారా కూడా ఆమోదించబడ్డాయన్నారు. ప్రస్తుత ప్రభుత్వం జాబ్‌ క్యాలెండర్‌ ద్వారా ప్రకటించబడ్డ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌లకు నూతన నియామకాలు చేపట్టడానికి వర్సిటీ అధికారులు కార్యాచరణ ముమ్మరంగా జరుపుతున్నారన్నారు. కానీ దానికి ముందు జీఓ ఎంఎస్‌ నెంబరు 24 ప్రకారం యూనివర్సిటీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్స్‌కు టైం స్కేల్‌ అమలు చేయడం లేదన్నారు. ప్రస్తుతం పని చేస్తున్న వారికి పోస్టులను వారికి కేటాయించి మిగిలిన ఖాళీలను మాత్రమే రాబోయే రిక్రూట్మెంట్‌ ప్రక్రియలో నోటిఫై చేయాలన్నారు. అనంతరం వీసీ ఆచార్య కె.గంగాధరరావు, రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ జి.సింహాచలంకు యూనియన్‌ నాయకులు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో యూనియన్‌ ఉపాధ్యక్షుడు రవి, కాంట్రాక్ట్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు పాల్గొన్నారు.

యూటీఎఫ్‌ పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి మోహనరావు

నరసరావుపేట / నరసరావుపేట ఈస్ట్‌: వేసవి సెలవులు ప్రారంభం నుంచి రాష్ట్ర ప్రభుత్వం, విద్యాశాఖ అధికారులు ఉపాధ్యాయుల సెలవులు హరిస్తూ వివిధ కారణాలతో ఒత్తిడికి గురిచేస్తున్నారని యూటీఎఫ్‌ పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.మోహనరావు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విద్యా ప్రణాళిక రూపకల్పన, పదవ తరగతి ఫెయిల్‌ అయిన విద్యార్థులకు రెమిడీయల్‌ తరగతుల పేరుతో ఉపాధ్యాయులను ఒత్తిడికి గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న విద్యా సంవత్సరానికి సంబంధించి విద్యా ప్రణాళిక రూపొందించాలని షెడ్యూల్‌ విడుదల చేయటం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈనెల 11 నుంచి 15వ తేదీ వరకు విద్యా ప్రణాళికలు రూపొందించి 16వ తేదీన సమగ్ర శిక్ష కార్యాలయంలో సమర్పించాలని ఆదేశాలు జారీ చేశారని వివరించారు. విద్యాశాఖ వెకేషన్‌ డిపార్ట్‌మెంట్‌ అనే విషయాన్ని విద్యాశాఖ అధికారులు కొంత కాలంగా మరచినట్టు ఉన్నారని విమర్శించారు. గత నవంబర్‌లోనే రూపొందించాల్సిన విద్యా ప్రణాళికను అప్పుడు పట్టించుకోని అధికారులు వేసవి సెలవుల్లో షెడ్యూల్‌ జారీ చేయటం ఉపాధ్యాయులను వేధించటమేనని తెలిపారు. అధికారులు విద్యా ప్రణాళిక వాయిదా వేయాలని, లేకుంటే బహిష్కరిస్తామని స్పష్టం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement