మార్టూరు: రూ.కోట్లాది విలువైన ప్రభుత్వ భూమిని అధికార పార్టీ నాయకులు కాజేస్తున్నా రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని మంగళవారం జిల్లా కలెక్టర్‌కు రాజశేఖర్ అనే వ్యక్తి నుంచి ఫిర్యాదు అందింది. ఆ ఫిర్యాదులోని వివరాల మేరకు.. స్థానిక జాతీయ రహదారికి పశ్చి వైపున పోలీస్ స్టేషన్, కూరగాయల మార్కెట్‌లకు మధ్య గల సర్వే నంబర్ ‘640ఏ’లో సుమారు మూడు ఎకరాల విస్తీర్ణం గల ప్రభుత్వ భూమి ఉంది. రెవెన్యూ రికార్డుల మేరకు.. ఈ భూమి ప్రభుత్వానికి చెందినదే అయినప్పటికీ అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు గతేడాది పంట సాగు చేశాడు. ఈ విషయమై ప్రజా సంఘాలకు చెందిన పలువురు నాయకులు అప్పట్లో మండల తహసీల్దార్ టి.ప్రశాంతికి, బాపట్ల ఆర్డీవో గ్లోరియాకు పలుమార్లు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ ఎలాంటి ఫలితం లేనందున మంగళవారం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్‌కు ఫిర్యాదు చేసినట్లు అర్జీదారు బాపట్ల జిల్లా అంబేడ్కర్ యూత్ ఫోర్స్ జిల్లా కార్యదర్శి చల్లూరి రాజశేఖర్ తెలిపారు. విచారణ తర్వాత తగిన చర్యలు తీసుకుంటానని కలెక్టర్ హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు.


