ఉపవృత్తుల వారికి బాబు మాయమాటలు మగ్గం ఉన్నా ఉచిత విద్యుత్ అర్హుల జాబితాలో నమోదు కాని వైనం 200 యూనిట్లు దాటితే మొత్తం బిల్లు కట్టాల్సిందే కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుగా ఉచిత విద్యుత్ అమలు కరెంటు బిల్లుకు మీటర్ రీడింగ్ నమోదులోనూ జాప్యం అర్హుల జాబితా నుంచి మరికొందరిని తొలగించేందుకు ఎత్తుగడ
మాది ఉపవృత్తి .. మాకు కరెంట్ ఉచితంగా ఇవ్వాలి
చీరాల అర్బన్: గత ఎన్నికల ప్రచారంలో చేనేతలకు టీడీపీ వరాల జల్లు కురిపించింది. నేతన్నలు నమ్మారు. ఓట్లు వేశారు. తరువాత సీఎం చంద్రబాబు, మంత్రులు లోకేష్, సవితలు అసెంబ్లీ సాక్షిగా చెప్పిన మాటలు నీటి మూటలయ్యాయి. నేతన్న నేస్తం అమలు లేదు. మగ్గాలు ఉన్న వారికి 200 యూనిట్లు, మరమగ్గాల వారికి 500 యూనిట్లు ఉచిత విద్యుత్ అమలు రెండేళ్లు అటకెక్కింది. ఈ క్రమంలో ఏరు దాటేదాక ఓడ మల్లన్న, ఏరు దాటాక బోడి మల్లన్న అన్న చందంగా చంద్రబాబు సర్కార్ తమను చూస్తోందని నేతన్నలు పలు రూపాల్లో ఆందోళనలు చేపట్టారు. దీంతో నేతన్నలకు ఉచిత విద్యుత్‌ను ఏప్రిల్ నుంచి అమలు చేస్తామని చెప్పారు. అయితే అర్హుల జాబితా తయారీలో నిబంధనల పేరుతో వడపోత పోశారు. కోతలు పెట్టారు. అంతిమంగా జాబితాలో పేరున్నా పలువురికి ఏప్రిల్ నెల కరంట్ బిల్లులు కట్టాలని చెప్తున్నారు. కొందరుకి 200 యూనిట్లు కన్నా అదనంగా మీటర్ రీడింగ్ వచ్చిందని బిల్లులు చెల్లించమంటున్నారు. సాధారణంగా 2,3 తారీఖులలో తీసే మీటర్ రీడింగ్‌ను కూడా ఆలస్యంగా నమోదు చేశారు. మరి కొందరిని అనర్హులను చేయటమే లక్ష్యం. ఇక ఉపవృత్తుల వారికి మొండి చెయ్యి చూపారు. మాయ మాటలు చెప్పటం చంద్రబాబు నైజం. అతని మాటలు నమ్మి మోసపోవటం మన తప్పని పలువురు చేనేత కార్మికులు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తం మీద కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుగా ఉచిత విద్యుత్ అమలు ఉందని మండిపడుతున్నారు.
జిల్లాలో సుమారు 8వేల మగ్గాలు
జిల్లాలో సుమారు 8వేల మగ్గాలు ఉన్నాయి. రెండేళ్లుగా నేతన్న నేస్తం ఊసే లేదు. నేతన్నల ఆందోళనల నేపథ్యంలో కంటి తుడుపుగా 200 యూనిట్లు ఉచిత విద్యుత్‌ను ఏప్రిల్ నుంచి అమలు చేస్తామని చెప్పారు. అందుకు దరఖాస్తు చేసుకోమన్నారు. ఆదిలోనే హంసపాదు అన్నట్లు దరఖాస్తుల నమోదు ప్రక్రియలోనే బాలారిష్టాలతో పలువురు ఆ పథకానికి దూరమయ్యారు.
నిబంధనల పేరుతో వడపోత...కోతలు
జిల్లాలో 6,275 మంది నేతన్నలు ఉచిత విద్యుత్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అంటే దరఖాస్తు సమయంలోనే సుమారు 2వేల మంది దూరమయ్యారు. పరిశీలనల పేరుతో 6,275 దరఖాస్తులలో 310 దరఖాస్తులను తిరస్కరించారు. మొత్తం మీద చీరాల డివిజన్ పరిధిలోని సింహభాగం ఉన్నాయి. డివిజన్ పరిధిలో మొత్తం దరఖాస్తుదారులు 5,536 మంది కాగా అందులో 4,625 మందిని మాత్రమే అర్హులుగా గుర్తించారు. ఇలా వడపోతలు, కోతలే లక్ష్యంగా అంతిమంగా లబ్ధిదారుల జాబితా తయారైంది.
మీటర్ రీగిండ్ నమోదులోను జాప్యం
సాధారణంగా ప్రతి నెల 2,3 తేదీల్లో మీటర్ రీడింగ్ చూచి, ఎన్ని యూనిట్లు వినియోగించుకుంది నమోదు చేస్తారు. ఏప్రిల్ నెల రీడింగ్ మే 2,3 తేదీల్లో నమోదు చేయాలి. అక్కడ కూడా జాప్యం చేశారు. ఎందుకంటే రెండు, మూడు రోజులు తరువాత రీడింగ్ తీస్తే వినియోగించిన యూనిట్లు కొందరికై నా 200 దాటుతుందని. అంటే అంతిమంగా ఉచిత విద్యుత్ అని గొప్పగా ప్రచారం చేసుకుంటూ, అర్హుల సంఖ్యను గణనీయంగా తగ్గించడమే లక్ష్యంగా ఆద్యంతం అధికారులు కష్టపడ్డారు. అలా పై నుంచి వారికి దిశా నిర్దేశం జరిగిందని ఆ శాఖలకు సంబంధించిన కొందరు చర్చించుకున్నారు.
అసెంబ్లీ సాక్షిగా అబద్దాలు .. ఉపవృత్తుల వారికి మొండిచెయ్యి
అబద్ధాలు చెప్పటం టీడీపీ నేతలకు కొత్తేమీ కాదు. అయితే అసెంబ్లీ సాక్షిగా చెప్పిన మాటలను అమలు చేయకపోతారా అని ఉపవృత్తులు వారు ఒకింత ఆశ పడ్డారు. నేతన్నల దత్తపుత్రునిగా చెప్పుకున్న మంత్రి లోకేష్ చెప్పిన మాటలు, అసెంబ్లీలో చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత మాట్లాడుతూ మగ్గం ఉన్న నేతన్నలకు అమలయ్యే పథకాలన్నీ, చేనేత ఉపవృత్తుల వారికి వర్తించే విధంగా చర్యలు చేపడతామని చెప్పటం. సీఎం చంద్రబాబు చేసిన వాగ్దానాలను మననం చేసుకుని మురిసిపోయిన తమకు మొండిచెయ్యి చూపారని చేనేత ఉపవృత్తుల వారు మండిపడుతున్నారు. మొత్తం మీద చేనేత రంగానికి చెందిన అందరూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
డివిజన్ పరిధిలో 5,536 దరఖాస్తులు అందాయి. అంతిమంగా అందులో 4,625 మందిని అర్హులుగా గుర్తించాం. ప్రస్తుతం రీడింగ్ తీయడం పూర్తయ్యింది. అర్హుల జాబితాలో ఉన్నవారు ఒక వేళ 200 యూనిట్లు కన్నా ఎక్కువ వినియోగించుకుంటే వారు బిల్లు ఎప్పటి మాదిరిగానే చెల్లించాల్సిందే. అలా ఎంత మంది ఉంటారనేది 13వ తేదీ నాటికి తెలుస్తుంది. ప్రభుత్వ గైడ్ లైన్స్ ప్రకారం పని చేస్తున్నాం.
– జాన్ ధామస్, విద్యుత్‌శాఖ ఈఈ,
చీరాల డివిజన్, చీరాల
మాది ఆసుమిషన్ పని. అదే మాకు జీవనాధానం. చేనేత బట్ట తయారు ప్రాథమికంగా చేసే పని మాదే. ఉపవృత్తులకు కూడా మగ్గం ఉన్నవారితో పాటు అన్ని పధకాలకు అర్హత కల్పిస్తామన్నారు. ఇప్పుడు ఆ ఊసే ఎత్తటం లేదు. ఇదేం న్యాయం.
– జానకిరామయ్య, చేనేత ఉపవృత్తిదారుడు,పేరాల


