అర్జీలను బాధ్యతతో పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

అర్జీలను బాధ్యతతో పరిష్కరించాలి

May 12 2026 5:30 AM | Updated on May 12 2026 5:30 AM

జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వి.వినోద్‌కుమార్‌ పీజీఆర్‌ఎస్‌లో 138 అర్జీలు స్వీకరణ

బాపట్ల: బాధితుల నుంచి అందే అర్జీలను అధికారులు బాధ్యతతో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వి.వినోద్‌కుమార్‌ అన్నారు. స్థానిక కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమానికి కలెక్టర్‌ అధ్యక్షత వహించారు. తన పరిధిలోని వాటికి ఆయన అక్కడికక్కడే పరిష్కారం చూపగా, కొన్నింటిని పరిశీలన, మరికొన్నింటిని విచారణకు ఆదేశిస్తూ ఆయా శాఖల అధికారులకు పురమాయించారు. పీజీఆర్‌ఎస్‌ లో 138 అర్జీలు నమోదు అయ్యాయి. పీజీఆర్‌ఎస్‌ పరిష్కారంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని చెప్పారు. అర్జీలను క్షేత్రస్థాయిలో నిశితంగా పరిశీలన చేయాలన్నారు. వేగంగా విచారణ జరపాలన్నారు. ఇకనుంచి ప్రతిరోజూ, వారానికి, నెల రోజులకు దశలవారీగా పర్యవేక్షణ, సమీక్ష సమావేశాలు జరుగుతాయన్నారు. మండల స్థాయి అధికారులంతా ప్రతి సోమవారం మండలాలలో జరిగే పీజీఆర్‌ఎస్‌లో హాజరుకావాలని ఆదేశించారు. గైర్హాజరైతే చర్యలు ఉంటాయని హెచ్చరించారు. మండల స్థాయిలో అత్యధికంగా చెరుకుపల్లిలో 11 అర్జీలు పెండింగ్‌లో ఉండడంపై ఆరా తీశారు. దేవదాయ శాఖలో 48 అర్జీలు, జలవనరుల శాఖలో 11 అర్జీలు నమోదు కావడంపై సమీక్షించారు. కర్లపాలెం మండలంలో వచ్చిన అర్జీలను ఆన్‌లైన్‌లో నిక్షిప్తం చేయకపోవడంపై తహసీల్దార్‌ను మందలించారు. పీజీఆర్‌ ఎస్‌ అర్జీల పరిష్కారంపై వ్యక్తిగతంగా ప్రజల అభిప్రాయ సేకరణ చేపడతామన్నారు. ప్రస్తుతం పెండింగ్‌ లో ఉన్న 261 పీజీఆర్‌ఎస్‌ అర్జీలపై ఆడిట్‌ చేయాలని ఆదేశించారు.

జన గణన వెంటనే ప్రారంభించండి

జనగణన ప్రక్రియ నేటికీ మొదలుకాని ప్రాంతాలలో వేగంగా ప్రారంభించాలని సూచించారు. జనగణన ప్రక్రియ సమర్థంగా నిర్వహించాలని అధికారులకు ఆదేశించారు. స్కిల్‌ హబ్‌లు సమర్థంగా నిర్వహించాలని కలెక్టర్‌ చెప్పారు. నైపుణ్యాభివృద్ధి జిల్లా స్థాయి కమిటీ సమావేశం స్థానిక కలెక్టరేట్‌లో జరిగింది. ఈ ఆర్థిక సంవత్సరంలో 5,520 మంది యువతను నైపుణ్య అభివృద్ధి సంస్థలో నమోదు చేయించాలన్నారు. వారందరి నైపుణ్యాలపై విరివిగా శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. ఇప్పటికే ఏర్పాటు చేసిన స్కిల్‌ హబ్‌ల ద్వారా శిక్షణలు ప్రారంభించాలన్నారు. త్రైమాసిక ప్రణాళిక ఆధారంగా శిక్షణలు కొనసాగించాలన్నారు. ఇందులో ఎలాంటి జాప్యం ఉండరాదని పలు సూచనలు చేశారు. జిల్లాలోని యువతీ, యువకుల నైపుణ్యాలపై శిక్షణ ఇవ్వడం, జాబ్‌మేళా నిర్వహించడం కమిటీలోని అధికారులకు లక్ష్యం కావాలన్నారు. ఉపాధి అవకాశాలను మెరుగుపరచడం, ప్రభుత్వ ప్రాధాన్యతను గుర్తించి పనిచేయాలన్నారు. కార్యక్రమంలో డీఆర్వో జి.గంగాధర్‌ గౌడ్‌, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ ఎస్‌.విజయమ్మ, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement