బాపట్లటౌన్: చిన్నతనంలోనే గిన్నిస్ వరల్డ్ రికార్ట్స్‌లో స్థానం దక్కించుకున్న ఘనత మర్రిపూడి గ్రామానికి చెందిన అభిషేక్ పాల్‌కు దక్కింది. బాపట్ల మండలం మర్రిపూడి గ్రామానికి చెందిన డాక్టర్ గుమ్మడి సుధాకర్, స్వర్ణలత దంపతుల కుమారుడు అభిషేక్ పాల్ 9వ తరగతి చదువుతున్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరి 2న హైదరాబాద్‌లో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధులు భారీ సంగీత కార్యక్రమం నిర్వహించారు. ప్రపంచ వ్యాప్తంగా 22 దేశాల నుంచి 2000 మంది సంగీత కీబోర్డ్ వాయిద్యకారులు పాల్గొని నిమిషంలో సప్తస్వరాలు, ఒక గంటపాటు కీబోర్డు ఆపకుండా వాయించడంపై పోటీలు నిర్వహించారు. పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనపరిచిన అభిషేక్‌పాల్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం దక్కించుకున్నారు. ఈనెల 9న విజయవాడలోని హల్లెల్ సంగీత పాఠశాలలో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధులు అభిషేక్‌పాల్‌కు సర్టిఫికెట్, మెడల్ అందజేశారు. అభిషేక్‌పాల్‌ను గ్రామస్తులు, సంఘపెద్దలు ప్రత్యేకంగా అభినందించారు.


