వ్యక్తి అనుమానాస్పద మృతి | - | Sakshi
Sakshi News home page

వ్యక్తి అనుమానాస్పద మృతి

May 12 2026 5:30 AM | Updated on May 12 2026 5:30 AM

గంజాయి కేసులో నిందితుడికి మూడేళ్ల జైలు హైకోర్టు ఎస్‌పీఎఫ్‌ హెడ్‌కానిస్టేబుల్‌ మృతి తాడేపల్లి రూరల్‌: రోడ్డు ప్రమాదంలో హెడ్‌కానిస్టేబుల్‌ మృతి చెందిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. వివరాలు.. కర్నూలు జిల్లా, గోనిగుంట్ల గ్రామానికి చెందిన కె.శ్రీనివాసరావు(49) హైకోర్టు ఎస్‌పీఎఫ్‌(ప్రత్యేక భద్రత దళం) హెడ్‌ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఉండవల్లిలో కుటుంబంతో నివాసముంటున్నాడు. ఉదయం 7 గంటల సమయంలో స్కూటీపై సీడ్‌ యాక్సెస్‌ రోడ్‌లో నుంచి పెనుమాక మీదుగా హైకోర్టుకు వెళుతున్నాడు. పెనుమాక మంతెన సత్యనారాయణ రాజు ఆశ్రమం రోడ్డులో స్కూటీపై వెళుతున్న శ్రీనివాసరావును బొలేరో వాహనం అతివేగంగా వచ్చి ఢీకొట్టింది. ద్విచక్ర వాహనంపై నుంచి కిందపడిన శ్రీనివాసరావు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న తాడేపల్లి ఎస్‌ఐ ఘటనా స్థలానికి చేరుకుని రోడ్డుపై తీవ్ర రక్తస్రావంతో పడిపోయి ఉన్న శ్రీనివాసరావును వైద్య నిమిత్తం దగ్గరలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఘటనపై హెడ్‌ కానిస్టేబుల్‌ భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ ఖాజావలి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఘంటసాల: మండలంలోని ఘంటసాలపాలెం గ్రామంలో ఓ వ్యక్తి సోమవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఎస్‌ఐ వేమన చందన కథనం మేరకు.. బాపట్ల జిల్లా, అమృతలూరు మండలం ముల్పూరు గ్రామానికి చెందిన ఇంటూరి రమేష్‌ (42) ఘంటసాల మండలం చిట్టూర్పు గ్రామానికి చెందిన ఓ మహిళతో కొన్నేళ్లుగా సహజీవనం చేస్తున్నాడు. వారు ఘంటసాలపాలెంలోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. రెండు రోజుల క్రితం రమేష్‌తో సహజీవనం చేస్తున్న మహిళ అనారోగ్యం బారిన ఊపడి చిట్టూర్పు గ్రామానికి వెళ్లింది. రమేష్‌ ఒక్కడే ఇంటిలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో అతను సోమవారం ఇంటిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. రమేష్‌ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఆత్మహత్య చేసుకునేందుకు గల కారణాలు దర్యాప్తులో తేలాల్సి ఉందని ఎస్‌ఐ చందన తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని పేర్కొన్నారు.

గుంటూరు లీగల్‌: గంజాయి విక్రయిస్తూ పోలీసులకు పట్టుబడిన వ్యక్తికి కోర్టు మూడు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం గుండిమెడ గ్రామానికి చెందిన గుండిమెడ అంథోని గంజాయి విక్రయిస్తున్న సమయంలో మంగళగిరి రూరల్‌ పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చారు. అనంతరం రిమాండ్‌కు తరలించారు. ఈ కేసును విచారించిన గుంటూరు మొదటి అదనపు జిల్లా, సెషన్స్‌ కోర్టు న్యాయమూర్తి వి.ఎ.ఎల్‌.సత్యవతి నిందితుడికి మూడు సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.10 వేలు జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా జైలు శిక్ష అనుభవించాలని ఆదేశించారు. కేసులో ప్రభుత్వం తరఫున అదనపు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ వై.అశోకవాణి వాదనలు వినిపించారు.

Advertisement
 
Advertisement
Advertisement