దుగ్గిరాల: దుగ్గిరాల మండలం కంఠంరాజుకొండూరు గ్రామంలో వేంచేసి ఉన్న మహంకాళి అమ్మ వారి ఆలయ వార్షికోత్సవ సంబరాలు ఆదివారం నాలుగో రోజుకు చేరాయి. అమ్మవారు ధనలక్షీదేవీ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అధికసంఖ్యలో అమ్మవారి దర్శనం కోసం పోటెత్తారు. ఆలయ ఆవరణలో చండీ హోమం నిర్వహించారు. భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. కంఠంరాజుకొండూరు గ్రామం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఏర్పాట్లను ఆలయ ఈఓ పర్యవేక్షించారు.
చందోలు(కర్లపాలెం): చందోలు గ్రామంలో కొలువై ఉన్న బగళాముఖి ఆలయంలో ఆదివారం అమ్మవారు అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారి తిరునాళ్ల మహోత్సవం ఇటీవల వైభవంగా జరిగిన నేపఽఽథ్యంలో భక్తుల కోసం ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. జిల్లా నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేశారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి అన్నపూర్ణాదేవి అలంకరణలో ఉన్న బగళాముఖి అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం మొక్కులు తీర్చుకుని ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ ట్రస్ట్ బోర్డు ఆధ్వర్యంలో జరిగిన మహాన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు. అధిక సంఖ్యలో భక్తులు తరలి రావటంతో ఆలయ ప్రాంగణంలో తిరునాళ్ల సందడి నెలకొంది. ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ చక్రధర్‌రెడ్డి, ఈవో నరసింహమూర్తి ఏర్పాట్లను పర్యవేక్షించారు.
పట్నంబజారు: గుంటూరు నగరంలోని నాజ్ సెంటర్లో వేంచేసి ఉన్న ఆంజనేయస్వామి దేవస్థానంలో హనుమత్ జయంతి ఉత్సవాలలో భాగంగా ఆదివారం లక్ష మల్లెల పూజ నిర్వహించారు. ఆలయ అసిస్టెంట్ కమిషనర్, కార్యనిర్వాహణాధికారి టి.సుభద్ర పర్యవేక్షణలో, శ్రీ హనుమాన్ దీక్ష సమాజం గౌరవాధ్యక్షులు తిరువల్లూరి వెంకటసుబ్బారావు ఆధ్వర్యంలో భక్తులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వామివారికి లక్ష మల్లెలతో పూజలు నిర్వహించటంతోపాటు ప్రత్యేక అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం స్వామి వారు సువర్చలా సమేత ఆంజనేయస్వామిగా నగర పురవీధుల్లో ఊరేగింపుగా భక్తులకు దర్శనం ఇచ్చారు. సాయంత్రం 8:30 గంటలకు వందలాది మంది భక్తులు, ఆంజనేయ దీక్షాపరులతో హనుమాన్ చాలీసా పారాయణం 108సార్లు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు అయినవోలు నరసింహచార్యులు ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. కార్యక్రమంలో హనుమాన్ దీక్ష సమాజం సభ్యులు నాగేశ్వరరావు, సిహెచ్ రమేష్, మారుతి, వెంకటరమణ, బాపిరాజు, కిషోర్, పాలక మండల సభ్యులు పాల్గొన్నారు.
విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం ఆదివారం 524.70 అడుగులకు చేరింది. ఇది 157.9860 టీఎంసీలకు సమానం. సాగర్ జలాశయం నుంచి ఎస్‌ఎల్‌బీసీకి 900 క్యూసెక్కులు విడుదలవుతోంది. సాగర్ జలాశయం నుంచి మొత్తం ఔట్‌ఫ్లోగా 900 క్యూసెక్కులు విడుదలవుతోంది. శ్రీశైలం నుంచి సాగర్ జలాశయానికి 900 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది.


