వెదుళ్లపల్లి పోలీసులకు ఫిర్యాదు
● అడ్డగించిన గ్రామస్తులు
● రూ.వేలల్లో బిల్లులు
వస్తున్నాయంటూ ఆగ్రహం
● అధికారులు, గ్రామస్తుల మధ్య
రెండుగంటలకు పైగా వాగ్వాదం
● పోలీసుల చొరవతో కొనసాగిన
తనిఖీలు
బాపట్లటౌన్: విద్యుత్ అక్రమ కనెక్షన్ల తనిఖీల్లో భాగంగా ఆదివారం విద్యుత్‌శాఖాధికారులు మండలంలోని వెదుళ్ళపల్లి, బేతపూడి, స్టువార్టుపురం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించారు. బేతపూడి, వెదుళ్లపల్లి గ్రామాల్లో సజావుగా సాగిన తనిఖీలు స్టువార్టుపురం వెళ్లేసరికి బెడిసికొట్టాయి. గ్రామంలో తామంతా గిరిజనులమని, గత ప్రభుత్వంలో తమకు ఎలాంటి విద్యుత్ బిల్లులు రాలేదని, చంద్రబాబు సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత బిల్లులు రూ.వేలల్లో వస్తున్నాయని, ఇదెక్కటి న్యాయం అంటూ గ్రామస్తులు ఒక్కసారిగా విద్యుత్‌శాఖాధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు బిల్లులు లేకుండా చేసిన తర్వాతే తమ గ్రామంలోకి అడుగుపెట్టాలంటూ పట్టుబట్టారు. అధికారుల వాహనాలకు ద్విచక్రవాహనాలు అడ్డుపెట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు గంటలకు పైగా అటు అధికారులు, ఇటు గ్రామస్తుల మధ్య వాగ్వివాదం జరిగింది. ఒక్కో బృందంలో ముగ్గురు విద్యుత్ అధికారుల చొప్పున 30 మంది విద్యుత్ సిబ్బంది 10 బృందాలుగా విడిపోయి తనిఖీలు చేశారు.
ఏపీటీఎస్ చొరవతో తనిఖీలు..
అధికారులను గ్రామస్తులు అడ్డుకున్నారన్న విషయం తెలుసుకున్న యాంటీ పవర్ త్రెఫ్ట్ స్క్వాడ్ (ఏపీటీఎస్) ఎస్‌ఐ రెహ్మాన్ ఆధ్వర్యంలో పోలీసులు గ్రామానికి చేరుకుని గ్రామస్తులకు సర్దిచెప్పారు. గ్రామంలో తనిఖీలు నిర్వహించి మూడు గ్రామాల పరిధిలో విద్యుత్ మీటర్లు లేనివి 47 కేసులు, మీటర్లు పనిచేయకుండా చేసి విద్యుత్ వాడుకుంటున్న కేసులు 19 మొత్తం 66 కేసులు నమెదుచేసి వాటికి గానూ రూ.10.80 లక్షలు అపరాధ రుసుం విధించారు. తనిఖీల్లో విజిలెన్స్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ మన్నెం భాస్కరరావు, విజిలెన్స్ డిప్యూటీ ఈఈ ఆర్.విజయ్ శ్రీనివాస్, ఆపరేషన్ డిప్యూటీ ఇంజినీర్ జి.శ్రీనివాస్, ఏఈలు పాల్గొన్నారు.
విద్యుత్ తనిఖీల్లో భాగంగా స్టువార్టుపురం గ్రామానికి చేరుకున్న తమను గ్రామానికి చెందిన చుక్కా పాల్, రాగాల రాము, అంగడి రత్నకుమార్, మొగిలి మధు, రామారావులతోపాటు మరికొందరు అడ్డుకొని తమ విధులకు ఆటంకం కలిగించారని విద్యుత్‌శాఖ రూరల్ ఏఈ యల్లావుల కోటేశ్వరరావు వెదుళ్లపల్లి పోలీసులకు ఫిర్యాదుచేశారు. ఏఈ ఫిర్యాదుమేరకు వెదుళ్ళపల్లి ఎస్‌ఐ కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


