నియామకాలు ఏవీ..?
● ఏడాది పొడవున అదనపు
భారం మోస్తోన్న లస్కర్లు
● నీటి సరఫరా నిర్వహణ అస్తవ్యస్తం
బాపట్ల: టీడీపీ ప్రభుత్వం వేసవిలో కాలువలకు మరమ్మతులు చేయించకపోవడంతో రానున్న ఖరీఫ్‌లో రైతులకు ఇక్కట్లు తప్పేలా లేవు. కాలువల ద్వారా వచ్చేనీరు ఆయకట్టు రైతులకు సరిపోయే అవకాశాలు కనిపించడం లేదు. సాగునీటి కొరత ఏర్పడే అవకాశం ఉండటంతో కాల్వల ద్వారా విడుదలయ్యే నీటిని అత్యంత జాగ్రత్తగా ఉపయోగించాల్సి ఉంటుంది. లేకుంటే సాగు ఇబ్బందులు ఎదురవుతాయి. మరోపక్కన నీటి సరఫరాలో కీలకంగా వ్యవహరించే జలవనరులశాఖను లస్కర్ల కొరత వెంటాడుతుంది.
కాలువల నిర్వహణలో కీలకం..
సాగునీటి కాలువల నిర్వహణ, నీటి విడుదల, సరఫరా విభాగాల్లో లస్కర్లు రేయింబవళ్లు కాల్వలను పర్యవేక్షించే పనిలో కీలకపాత్ర పోషిస్తుంటారు. పొలాల్లో నీటి ఎద్దడి ఎర్పడినప్పుడు పంటలను కాపాడుకునే క్రమంలో కొందరు రైతులు కాలువలకు గండిపెట్టడం వలన పొలాలకు నీటి సరఫరా చేసుకుంటారు. ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో లస్కర్లు వాటిని నిరోధించి క్షేత్రస్థాయిలో అన్ని పొలాలకు సాగునీటిని సక్రమంగా అందిస్తారు. సముద్ర తీరానికి దగ్గరలో ఉన్న ప్రాంతం కావడంతో జిల్లాలోని పలు భూములు కాల్వలకు చివరభూములుగా ఉన్నాయి. నీటి ఎద్దడి వచ్చినా... ముమ్మరంగా నీరు విడుదలైనా ఇక్కడ కష్టమే. ఈసమయంలో లస్కర్ల పాత్ర కీలకంగా ఉంటుంది. ఒక్కోసారి నీటి రీడింగ్ తీయటం కొద్దిగా ఆలస్యమైనా కాలువలు కొట్టుకుపోయే ప్రమాదం ఉంటుంది. వీరి ప్రాధాన్యతను విస్మరించిన చంద్రబాబు ప్రభుత్వం ఖాళీగా ఉన్న లస్కర్ల పోస్టులను భర్తీపై దృష్టి పెట్టడంలేదు. ఉద్యోగ విరమణ చేసిన వారి స్థానాలను తిరిగి భర్తీ చేయటంలేదు.
బాపట్ల జలవనరుల ఉపవిభాగంలో 48మంది లస్కర్ల అవసరం ఉండగా.. 19మందితో కాలం నెట్టుకొస్తున్నారు. చందోలు సాగునీటి సెక్షన్‌లో 30మంది లస్కర్లకు 8 మందే పనిచేస్తున్నారు. రైతులకు నీటి పారుదల శాఖ అధికారులకు అనుసంధానకర్తలుగా వ్యవహరించే లస్కర్ల కొరత ఏర్పడటంతో కాలువ కట్టలపై పర్యవేక్షణ లోపించింది. కాలువ కట్టలకు గండ్లు పడటంతో కొందరు కాలువ కట్టలను పొలాల్లో కలిపేసుకుంటున్నారే ఆరోపణలు ఉన్నాయి. కొన్నిచోట్ల కాలువ కట్టల మట్టిని, ఇసుకను అక్రమంగా తవ్వేసుకుని విక్రయించుకుంటున్నా అడిగేవారే లేకుండాపోయారు. డెల్టాలో అన్ని జలవనరుల విభాగాల్లో 50శాతం మందికి పైగా లస్కర్ల కొరత వెంటాడుతూనే ఉంది. కనీసం నీటి సంఘాలైనా లేకపోవటంతో కాలువ కట్టల నిర్వహణ నానాటికీ తీసికట్టుగా మారింది. ఒకప్పుడు వెడల్పుగా ఉన్నకాలువ కట్టలు బొందిగట్లుగా మారుతున్నాయి. రైతుల తలలో నాలుకగా ఉండే లస్కర్ల నియామకంలో నిర్లక్ష్యం వీడాలని.. వెంటనే లస్కర్ల నియామకం చేపట్టాలని రైతులు కోరుతున్నారు.


