మండంలోని వలపర్లలో 1950లో స్థాపించిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వజ్రోత్సవాలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి 1960 దశకాలల్లో పాఠశాలలో చదివిన పూర్వ విద్యార్థులతో పాటు ఇటీవల కాలంలో చదివిన విద్యార్థులు వేలాది మందిగా హాజరై పరస్పర పలకరింపులు, ఆలింగనాలతో అధ్యంతం పాఠశాల కళకళలాడింది. నాటి విద్యార్థులే నేటి తాతయ్యలు, అమ్మమ్మలుగా పాఠశాలకు రావటం తమ తమ బ్యాచ్‌ల వారీగా గ్రూప్ ఫొటోలు తీసుకోవడం సహపంక్తి భోజనాలతో ఒక్కసారిగా అలనాటి ఆ పాత స్మృతులను పూర్వ విద్యార్థులు నెమరు వేసుకున్నారు. ఉదయం 9 గంటలకు పాఠశాల విద్యార్థుల ర్యాలీతో ప్రారంభమైన కార్యక్రమం అనంతరం పాఠశాల పూర్వ విద్యార్థి ప్రస్తుత శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు, ఎమ్మెల్సీ పంచుమర్తి అనూరాధ పాఠశాల ఆవరణలో గల సరస్వతి దేవి విగ్రహం వద్ద పూజలు నిర్వహించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రస్తుత, పూర్వ విద్యార్థులు, వారి వారసులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. 1950లో పాఠశాల స్థాపించిన దాతలను స్మరించుకోవడం, తమకు విద్యాబుద్ధులు నేర్పి తమ ఉన్నతికి కారణమైన ఉపాధ్యాయులను సత్కరించి సన్మానించుకోవడం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాలే లక్ష్యంగా పాఠశాల వజ్రోత్సవ వేడుకలు కమిటీ సభ్యులు ఘనంగా నిర్వహించారు. వేలాదిమంది పూర్వ విద్యార్థులు హాజరైన వేడుకల కార్యక్రమానికి పాఠశాల దాతలను, ఉపాధ్యాయులను అతిథులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వలపర్ల మాజీ సర్పంచ్, పాఠశాల పూర్వ విద్యార్థి అయిన కార్యంపూడి వెంకటేశ్వర్లు జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు పాఠశాల అభివృద్ధి కోసం రూ.10 లక్షలు విరాళాన్ని ప్రకటించారు. మరో పాఠశాల పూర్వ విద్యార్థిని జీ విజయలక్ష్మి పాఠశాలకు అవసరమైన రోబోటిక్ ల్యాబ్ నిర్వహణకు అవసరమైన మొత్తాన్ని విరాళంగా ప్రకటించారు. కార్యక్రమంలో పాఠశాల అభివృద్ధి కమిటీ సభ్యులు,పూ ర్వ విద్యార్థులు కొమ్మి మహేష్, వేణు మాస్టర్, సయ్యద్ కరీముల్లా, కార్యంపూడి కోటి నాగులు, గ్రామస్తులు, పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఏడున్నర దశాబ్దాల తర్వాత
మధుర జ్ఞాపకాలు
వలపర్ల జెడ్పీహెచ్‌ఎస్ వజ్రోత్సవాలు
సందడిగా వేడుకలు
భారీగా హాజరైన పూర్వ విద్యార్థులు
చదువులమ్మా తన బిడ్డల ప్రేమతో తడిసిముద్దయింది.. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న అమృతోత్సవం జ్ఞాపకాల అమృతం కురిసింది. పిల్లల నుంచి పెద్దలు తరలిరావడంతో మురిసిపోయింది. కళ్లలో శుక్లపు పొరలు కంటి చూపునకు అడ్డుపడుతున్నా.. వారి కనుపాపల్లో ఆనందాల జ్యోతులు వెలిగాయి. ఆ నడకల్లో సత్తువ మందగించినా.. ఆ వేదిక తాకగానే వారి పాదాలు నాట్యమాడాయి. తాతా అని పిలుపునకు చేరువైనా.. ఆ ప్రాంగణంలోకి అడుగు పెట్టగానే ఆ హృదయాలు 70 ఏళ్లు వెనక్కి నెట్టాయి. అక్షరాలు దిద్దించిన గురువుల జ్ఞాపకాలు మదిలో మెదులుతుండగా.. బాల్యపు స్నేహ మాధుర్యాలు అక్షర కుసుమాలై పరిమళించాయి. తమ చదువుల గుడికి దాతృత్వపు హారం వేసిన అపూర్వ ఘట్టాలు వలపర్ల జెడ్పీహెచ్‌లో ఆదివారం ఆవిష్కృతమయ్యాయి.
–మార్టూరు


