అగ్గి రేగితే.. బుగ్గే! | - | Sakshi
Sakshi News home page

అగ్గి రేగితే.. బుగ్గే!

May 10 2026 7:52 AM | Updated on May 10 2026 7:52 AM

అగ్గి రేగితే.. బుగ్గే! ఆరు మండలాలకు ఒక్కటే అగ్నిమాపక కేంద్రం

ప్రజలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి

వసతులు తక్కువ .. విధులు ఎక్కువ వేసవిలో పెరుగుతున్న అగ్ని ప్రమాదాలు ముందస్తు జాగ్రత్తలు అనివార్యం

ఆరు మండలాలకు ఒక్కటే అగ్నిమాపక కేంద్రం

అగ్ని ప్రమాదాలకు సంబంధించి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ప్రాథమికంగా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యవసాయ ఉత్పత్తులు, మోటార్లకు సంబంధించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. బీడీ, సిగరెట్‌లను కాల్చి ఆర్పకుండా చేలల్లో వేయకూడదు. అలానే ఇళ్లలో విద్యుత్‌ సరఫరాలో హెచ్చు, తగ్గులను నియంత్రించటానికి స్టెబిలైజర్‌ పనిచేస్తుంది. అలానే ప్రమాదం జరగకుండా విద్యుత్‌ సరఫరా ఆటోమేటిక్‌గా ఆగాలంటే ఎంసీబీ(మీనియేచర్‌ సర్క్యూట్‌ బ్రేక్‌)ను ఏర్పాటు చేసుకోవాలి. ప్రధానంగా గడ్డి వాములు దూరం, దూరంగా వేసుకోవాలి. ఒకే చోట ఉంటే ఏదైనా అగ్ని ప్రమాదం జరిగినప్పుడు వెంటనే మిగిలిన వాటికి కూడా వ్యాపించకుండా ఉంటాయి. అపార్ట్‌మెంట్లు, ఆసుపత్రులు, భారీ దుకాణ సముదాయాల నిర్మాణంలోను అగ్నిమాపక నిబంధనలను తప్పకుండా పాటించాలి.

– రామకృష్ణ, ఏడీఎఫ్‌ఓ, చీరాల

చీరాల అర్బన్‌: ఒక వైపు మండే ఎండలు. మరో వైపు అగ్ని ప్రమాదాలు. దీంతో ప్రజలు భీతిల్లుతున్నారు. ఇటీవల మొక్కజొన్న పంట పొలాలు దగ్ధమయ్యాయి. తాజాగా చీరాల మండలం బోయినవారిపాలెంలో 15 ఎకరాల గడ్డి వాములు దగ్ధమయ్యాయి. ఓ అపార్ట్‌మెంట్‌లో షార్ట్‌ సర్క్యూట్‌ జరిగింది.

ఈ క్రమంలో అగ్నిమాపక సిబ్బంది ఎంత అప్రమత్తంగా ఉన్నా, ప్రజలు వేసవిలో ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే అగ్గిరేగితే.. మిగిలేది బుగ్గే. ఎందుకంటే చీరాల అగ్నిమాపక కేంద్రం ఆరు మండలాల్లో సేవలు అందించాల్సి ఉంది. విధులు ఎక్కువ. వనరులు తక్కువ. ఈ క్రమంలో చీరాల అగ్నిమాపక కేంద్రానికి ప్రస్తుతం ఉన్న వాహనాలతోపాటు మరో వాహనం అవసమనే అభిప్రాయం ప్రజల్లో ఉంది. గతంలో జరిగిన కొన్ని భారీ అగ్ని ప్రమాదాల క్రమంలో ఇతర ప్రాంతాల నుంచి ఫైర్‌ ఇంజిన్లు వచ్చే వరకు గంటల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితిని గుర్తు చేసుకుంటున్నారు.

ఆరు మండలాల పరిధిలో

చీరాల అగ్నిమాపక కేంద్రానికి సంబంధించి ఆరు మండలాల పరిధిలో సేవలు అందించాల్సి ఉంది. చీరాల, వేటపాలెం, చినగంజాం, ఇంకొల్లు, పర్చూరు, కారంచేడు మండలాలు. ఈ ఆరు మండలాల పరిధిలో ఎక్కడ అగ్ని ప్రమాదం జరిగినా చీరాల అగ్నిమాపక కేంద్రం నుంచే ఫైర్‌ ఇంజిన్‌ వెళ్లాల్సి ఉంటుంది. ఏక కాలంలో వేర్వేరు చోట్ల అగ్ని ప్రమాదాలు జరిగినా, ఒకే చోట భారీ అగ్ని ప్రమాదం జరిగినా పొరుగున్న బాపట్ల, చిలకలూరిపేటల నుంచి ఫైరింజన్లు రావాల్సిన పరిస్థితి నెలకొంది.

ఫైర్‌ ఇంజిన్‌కు నీరు నింపుకొనేందుకు ..

అగ్నిమాపక కేంద్రంలో ఫైర్‌ ఇంజిన్‌కు నీరు నింపుకునేందుకు స్టానికల్‌ ట్యాంక్‌(నీరు నిల్వ ట్యాంక్‌)ఉండాలి. ప్రస్తుతం చీరాల అగ్నిమాపక కేంద్రం నూతన భవన నిర్మాణం జరుగుతోంది. ఈ క్రమంలో అక్కడి నీరు నిల్వ ట్యాంక్‌ వినియోగంలో లేదు. నూతనంగా 25వేల లీటర్ల నిల్వ సామర్థ్యంతో ట్యాంక్‌ను నిర్మించనున్నారు. ఈ క్రమంలో ఎక్కడన్నా అగ్నిప్రమాదం జరిగితే సమీప మోటార్లు నుంచి ఫైర్‌ ఇంజిన్‌కు నీరు నింపుకోవాల్సిన పరిస్థితి ఉంది.

విధులు ఎక్కువ, వనరులు తక్కువ

ఆరు మండలాల పరిధిలో ఎక్కడ అగ్ని ప్రమాదం జరిగినా చీరాల నుంచే ఫైరింజన్‌ వెళ్లాలి. ప్రస్తుతం ఒక చిన్న వాహనం. మరో పెద్ద వాహనం, ఇరుకు గల్లీల్లోకి వెళ్లేందుకు ఓ బుల్లెట్‌ ఉన్నాయి. చిన్న వాహనం సాధారణంగా సీఎం, పీఎం, అత్యవసర ప్రొటోకాల్‌ కార్యక్రమాలు జరిగే సమయంలో అక్కడ ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా సిద్ధంగా ఉంచుతారు. పెద్ద ఫైరింజన్‌ను అగ్నిప్రమాదాల సమయంలో మంటలు ఆర్పేందుకు వినియోగిస్తారు. ఇక సిబ్బంది పరంగా ఒక ఏడీఎఫ్‌ఓ, ఒక ఎస్సై, ముగ్గురు డ్రైవర్లు, ఆరుగురు హెడ్‌ కానిస్టేబుళ్లు, ఏడుగురు కానిస్టేబుళ్లు ఉన్నారు. ఈ క్రమంలో మరో పెద్ద ఫైరింజన్‌ అవసరమని ప్రజలు భావిస్తున్నారు.

నష్టం కూడా గణనీయమే..

2025–26లో 66 అగ్ని ప్రమాదాల జరిగాయి. అందుకు గాను రూ.రూ.2,70,90,000 ఆస్తి నష్టం జరిగ్గా, రూ.4,89,25,000ను కాపాడినట్లు, 2025–26లో 55 అగ్ని ప్రమాదాలు జరగ్గా రూ.2,50,96,000 ఆస్తి నష్టం జరగ్గా, రూ.2,16,89,000 ఆస్తిని కాపాడినట్లు అగ్ని మాపక కార్యాలయ గణాంకాలు చెప్తున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement