నేరాల నియంత్రణలో బాపట్ల జిల్లా బెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

నేరాల నియంత్రణలో బాపట్ల జిల్లా బెస్ట్‌

May 9 2026 7:38 AM | Updated on May 9 2026 7:38 AM

బాపట్లటౌన్‌: ఏపీ స్మార్ట్‌ పోలీసింగ్‌ యూనిట్‌ పెర్ఫార్మెన్‌న్స్‌లో బాపట్ల జిల్లా పోలీస్‌ శాఖ రాష్ట్రవ్యాప్తంగా 2వ ర్యాంక్‌ సాధించిందని జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్‌ తెలిపారు. ముఖ్యమంత్రి అధ్యక్షతన శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి కలెక్టర్ల సదస్సులో బాపట్ల జిల్లా పనితీరును పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా ఎస్పీ వివరించారు. ఎస్పీ మాట్లాడుతూ నేరాల నియంత్రణ, గంజాయి నిర్మూలన, సాంకేతిక పోలీసింగ్‌ అంశాల్లో బాపట్ల జిల్లా రాష్ట్ర స్థాయిలో ఆదర్శవంతమైన ఫలితాలు సాధించిందన్నారు. ఏపీ పోలీస్‌ వార్షిక గణాంకాల (2025–26) ప్రకారం, బాపట్ల జిల్లా నేర నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణలో విశేషమైన ప్రగతిని సాధించిందన్నారు. జిల్లాలో మొత్తం నేరాల సంఖ్య 11.6 శాతం తగ్గగా, బాడీలీ ఆఫీసు 20.4 శాతం, అల్లర్లు 69.2శాతం మేర గణనీయంగా తగ్గుముఖం పట్టాయన్నారు. మహిళా భద్రతలో 12.1శాతం మెరుగుదల కనబరుస్తూనే, లైంగికనేరాల దర్యాప్తులో 95 శాతం పురోగతిని సాధించింది. ముఖ్యంగా, రహదారి ప్రమాదాల నివారణకుగానూ గుర్తించిన 100 శాతం బ్లాక్‌ స్పాట్స్‌ను సరిదిద్ది జిల్లా పోలీస్‌ యంత్రాంగం రికార్డు సృష్టించిందన్నారు.

ఏపీ స్మార్ట్‌ పోలీసింగ్‌ యూనిట్‌ పెర్ఫార్మెన్‌న్స్‌ డ్యాష్‌బోర్డ్‌ (30.04.2026) గణాంకాల ప్రకారం, బాపట్ల జిల్లా పోలీస్‌ శాఖ రాష్ట్ర స్థాయిలో అద్భుత ప్రదర్శన కనబరిచి 2వ ర్యాంక్‌ సాధించింది. మొత్తం 19 రకాల సాంకేతిక పారామీటర్లలో మెరుగైన పనితీరును కనపరిచింది. సీసీటీఎన్‌ఎస్‌, ఈ–సాక్ష్య, డ్రోన్ల వినియోగం, డయల్‌ 112 వంటి విభాగాల్లో జిల్లా చూపిన చొరవ ఈ ఘనత సాధించడానికి దోహదపడిందన్నారు. రాష్ట్రంలోని టాప్‌–5 జిల్లాల్లో ఒకటిగా నిలుస్తూ, స్మార్ట్‌ పోలీసింగ్‌ అమలులో బాపట్ల జిల్లా ఆదర్శంగా నిలిచిందన్నారు.

స్మార్ట్‌ పోలీసింగ్‌లో రాష్ట్రంలో

జిల్లా పోలీస్‌ శాఖకు 2వ ర్యాంక్‌

లైంగిక నేరాల దర్యాప్తులో

95 శాతం పురోగతి

రోడ్డు ప్రమాదాల నివారణలో

100 శాతం రికార్డు సొంతం

జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్‌

Advertisement
 
Advertisement
Advertisement