గుర్తుతెలియని మృతదేహం లభ్యం | - | Sakshi
Sakshi News home page

గుర్తుతెలియని మృతదేహం లభ్యం

May 9 2026 7:38 AM | Updated on May 9 2026 7:38 AM

గుర్తుతెలియని మృతదేహం లభ్యం గుర్తుతెలియని వాహనం ఢీకొని చిన్నారి మృతి ఎస్‌బీఐ ఉద్యోగులు సమ్మెకు సన్నద్ధం

మార్టూరు: మండల కేంద్రం మార్టూరులో శుక్రవారం సాయంత్రం గుర్తు తెలియని వ్యక్తి మతదేహాన్ని పోలీసులు గుర్తించారు. సీఐ యార్లగడ్డ శ్రీనివాసరావు అందించిన వివరాలు.. మార్టూరు నుంచి గన్నవరం వెళ్లే మార్గంలోని వాగు సమీపంలోని చెక్‌ డ్యాం వద్ద నీటిలో తేలియాడుతున్న మృతదేహాన్ని గుర్తించి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న సీఐ మృతదేహాన్ని పరిశీలించి సిబ్బంది స్థానికుల సహాయంతో వెలికి తీయించారు. మృతుడి వయసు సుమారు 35 సంవత్సరాలు ఉంటుందన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

యద్దనపూడి: గుర్తు తెలియని వాహనం ఢీకొనటంతో చిన్నారి మృతి చెందింది. ఈ ఘటన మండలంలోని పూనూరులో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికులు అందించిన వివరాలు.. గ్రామానికి చెందిన కొండా మాధవరెడ్డి వెంకటరత్నం దంపతుల కుమారుడైన కృష్ణారెడ్డి(7) రాత్రి 7 గంటల ప్రాంతంలో తన ఇంటి సమీపంలోని శివాలయం సమీపంలో ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి వెళ్లిపోయింది. ఆ తరువాత కొంతసేపటికి అటుగా వెళ్తున్న కొందరు గమనించి రక్తపు మడుగులో పడి ఉన్న చిన్నారిని గుర్తించి 108 వాహనంలో చిలకలూరిపేట ఆస్పత్రికి తరలించారు. అప్పటికే చిన్నారి కృష్ణారెడ్డి మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఒక్కగాను ఒక్క కుమారుడు మృతిచెందటంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

కొరిటెపాడు(గుంటూరు): ఆలిండియా స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా స్టాఫ్‌ ఫెడరేషన్‌ పిలుపు మేరకు ఈ నెల 25, 26 తేదీల్లో దేశవ్యాప్తంగా రెండు రోజుల సమ్మెకు ఎస్‌బీఐ ఉద్యోగులు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా స్టాఫ్‌ యూనియన్‌, అమరావతి సర్కిల్‌– గుంటూరు మాడ్యూల్‌ ఆధ్వర్యంలో శుక్రవారం నగరంపాలెంలోని మెయిన్‌ బ్రాంచ్‌ వద్ద ‘సైలెంట్‌ సిట్‌ ప్రొటెస్ట్‌‘ కార్యక్రమం నిర్వహించారు. ఎస్‌బీఐ స్టాఫ్‌ ఫెడరేషన్‌ అమరావతి సర్కిల్‌ డెప్యూటీ జనరల్‌ సెక్రటరీ కె.కోటిరెడ్డి మాట్లాడుతూ బ్యాంకుల్లో తగిన సిబ్బంది నియామకం చేపట్టాలన్నారు. శాశ్వత ఉద్యోగులను ఔట్‌సోర్సింగ్‌ చేయడాన్ని నిలిపివేయాలని డిమాండ్‌ చేశారు. పెన్షన్‌, వైద్య సదుపాయాలు మెరుగుపరచాలని కోరారు. ఇంటర్‌ సర్కిల్‌ బదిలీల సమస్యలు పరిష్కరించాలని సూచించారు. ఉద్యోగుల న్యాయమైన సమస్యలకు మద్దతు తెలపాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు కేఆర్‌వీ జయకుమార్‌, వి.నరేంద్రకుమార్‌, రంగసాయి, ఇబ్రహీం షా, సంపత్‌, యూఎఫ్‌బీయూ అడ్వైజర్‌ పి.కిషోర్‌, స్థానిక సెక్రటరీలు, పలువురు ఉద్యోగులు, అధికారులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement