నిబంధనలకే తీరకాసు! | - | Sakshi
Sakshi News home page

నిబంధనలకే తీరకాసు!

May 8 2026 11:20 AM | Updated on May 8 2026 11:20 AM

నిబంధనలకే తీరకాసు!

ప్రభుత్వ అనుమతి కన్నా పచ్చనేత కనుసైగే మిన్న అదృశ్య శక్తిగా అంతా నడిపిస్తున్న యువనేత ప్రతిఫలం పొందుతూ ఖజానాకు అధికారుల గండి చీరాల నియోజకవర్గంలో సమాంతర ప్రభుత్వం అభివృద్ధి, ఉపాధి ముసుగులో యథేచ్ఛగా అతిక్రమణలు

బీచ్‌లో అక్రమ నిర్మాణదారుల నుంచి అడ్డగోలుగా వసూళ్లు

అక్రమ దందాలకు అడ్డాగా మారడంతో చీరాల నియోజకవర్గం పేరు రాష్ట్ర వ్యాప్తంగా మారుమోగుతోంది. తీరం పరాధీనం అవుతోంది. అక్కడ సింహభాగం ప్రభుత్వ అనుమతులు లేకుండా నిర్మాణాలు జరుగుతున్నాయి. ప్రభుత్వపరంగా సంబంధిత శాఖల అనుమతులు తీసుకోవడం లేదు. పచ్చనేత అనుమతి, యువనేత అండ ఉంటే చాలనే భావనకు వచ్చారు. అభివృద్ధి, ఉపాధి ముసుగులో అతిక్రమణలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో పర్యాటకులకు భద్రత కొరవడుతోందనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.

చీరాల అర్బన్‌: చీరాల నియోజకవర్గంలో సమాంతర ప్రభుత్వం నడుస్తోంది. యువనేత అదృశ్య శక్తిగా వ్యవహరిస్తున్నారు. అంతిమంగా పర్యాటకుల భద్రతకు భంగం కలిగే విధంగా పరిస్థితులు మారుతున్నాయి. ఈ క్రమంలో తీరంలో నిర్మాణాలకు ఆయా శాఖల పరంగా అనుమతులకు సంబంధించి, చెల్లించాల్సిన రుసుం ప్రభుత్వ ఖజానాకు జమ కాకుండా గండి పడుతోంది. ఇవన్నీ బహిరంగ రహస్యాలు. వీటిపై అంతిమంగా ఎవరూ చర్యలు చేపట్టడం లేదు. ప్రతి చిన్న విషయం కంప్యూటర్‌లో ఉంటుందంటూ గొప్పలు చెప్పుకొనే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వానికి ఈ విషయాలు తెలియదా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

అనుమతి లేకున్నా విద్యుత్‌ సరఫరా

ప్రాథమికంగా భూమి కన్వర్షన్‌ నుంచి రెవెన్యూ, పంచాయతీ, ఒడా(ఒంగోలు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌), సీఆర్‌జెడ్‌, సీజెడ్‌ఎంపీ, పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు ఇలా సంబంధిత అన్ని శాఖల అనుమతులు పొందాలి. కొందరు ఎలాంటి అనుమతులు లేకుండానే నిర్మాణాలు చేపట్టారు. పూర్తి చేశారు. వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. కొత్తవారు పలువురు ముందు వారి తరహాలో నడుస్తున్నారు. అలాంటి నిర్మాణాలకు విద్యుత్‌ శాఖ కూడా కరెంట్‌ సరఫరా ఎలా చేస్తున్నారనే ప్రశ్న ప్రజల నుంచి వస్తోంది.

అప్పుడే ఎందుకు అడ్డుకోరు?

వాస్తవానికి అనుమతులు లేని నిర్మాణాలకు సంబంధించి వారు భూమి పూజ చేసే దగ్గర నుంచి అన్ని శాఖల అధికారులకు సమాచారం ఉంటుంది. కాకుంటే ఒక రోజు అటుఇటుగా. కానీ ఎవరూ వాటిని అడ్డుకోరు. పనులు ఆపరు. తరువాత నిబంధనల పేరుతో వ్యక్తిగత ప్రయోజనాలను ఆశిస్తారు. అంతకు ముందు పచ్చనేత అనుమతి ఉందా, లేదా అనేది ఆరా తీస్తారు. ఎవరన్నా ఇదేమని అడిగితే అంతా పై వారే చూసుకుంటున్నారని చెబుతున్నారు. ఆ పై వారెవరో, ప్రభుత్వ నిబంధనలు ఎందుకు పట్టించుకోరో వారికే తెలియాలి.

భద్రత కరువు

పర్యాటకంగా తీర ప్రాంతం అభివృద్ధిని అందరూ స్వాగతిస్తున్నారు. అయితే అభివృద్ధి ముసుగులో అతిక్రమణలను ప్రశ్నిస్తున్నారు. సాధారణంగా రిసార్ట్స్‌, హోటల్స్‌కు వచ్చే వారి ఆధార్‌ లాంటి ధ్రువీకరణతో గదులు అద్దెకు ఇస్తుంటారు. కొన్నింటిలో అసాంఘిక కార్యకలాపాలకు కూడా చోటు ఉంటుందనే విమర్శలు ఉన్నాయి. ఈ క్రమంలో నిర్ణీత అనుమతులు లేని రిసార్ట్స్‌, హోటల్స్‌లో భద్రత నామమాత్రంగా మారిందని పలు సందర్భాల్లో పర్యాటకుల నుంచి వినిపించిన విమర్శ.

ప్రమదాలు జరగకుండా...

ఇప్పటికే తీరంలో ఎన్‌డీపీ (నాన్‌ డ్యూటీ పెయిడ్‌) లిక్కర్‌, కొన్ని రకాల మత్తు పదార్థాల సరఫరా జోరుగా సాగుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. సముద్రంలో స్నానాలకు వెళ్లి పలువురు మృత్యువాత పడిన సందర్భాలున్నాయి. ఈ నేపథ్యంలో రిసార్ట్స్‌, హోటల్స్‌లో బస చేసే వారితో పాటు విడిగా వచ్చే పర్యాటకులు అనేదే తేడా లేకుండా పటిష్టమైన రక్షణ చర్యలు చేపట్టాలి. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి.

పంచాయతీ అప్రూవల్‌తో సరి..

తీరంలో రిసార్ట్స్‌, హోటల్స్‌ నిర్మాణాలకు సంబంధించి కేవలం పంచాయితీ అప్రూవల్‌ ఉంటే సరిపోతుందా? మిగిలిన శాఖల అనుమతి అవసరం లేదా? దీనిపై స్పష్టత కొరవడుతోంది. ఈ క్రమంలో స్వామి కార్యం, స్వ కార్యం అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. తీరంలో అతిక్రమణలపై కోర్టులో పిల్‌ వేసేందుకు ఓ మాజీ ఎమ్మెల్యే సిద్ధమైనట్లు విశ్వసనీయ సమాచారం. ప్రాథమికంగా అందుకు సంబంధించిన వివరాలు సేకరిస్తున్నట్లు తెలిసింది.

Advertisement
 
Advertisement
Advertisement