బాపట్ల: బాపట్ల జిల్లా రెడ్‌క్రాస్ చైర్మన్ బీఎస్ నారాయణ భట్టుకు ఉత్తమ సేవ గవర్నర్ అవార్డు లభించింది. ప్రపంచ రెడ్‌క్రాస్ దినోత్సవాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ లోక్‌భవన్‌లో నిర్వహించిన అవార్డుల ప్రదానోత్సవంలో బాపట్ల జిల్లాలో రెడ్‌క్రాస్ చైర్మన్‌గా విశిష్ట సేవలు అందించినందుకు గాను ఉత్తమ సేవా అవార్డును రాష్ట్ర గవర్నర్, రెడ్‌క్రాస్ రాష్ట్ర అధ్యక్షులు ఎస్.అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా అవార్డును గురువారం అందుకున్నారు. బాపట్ల జిల్లాలో రక్తదాన శిబిరాలు నిర్వహించడం, యూత్ రెడ్‌క్రాస్ ద్వారా యూత్ కమిటీలను, జూనియర్ రెడ్‌క్రాస్ ద్వారా పాఠశాల విద్యార్థులలో సేవాభావాన్ని పెంపొందించడం, సేవా భావం కలిగిన వ్యక్తులను అధిక సంఖ్యలో సభ్యులుగా చేయటంలోనూ, ప్రకృతి విపత్తుల సమయంలో పేదలకు సహాయ కార్యక్రమాల అమలు, ఉచిత వైద్య శిబిరాల నిర్వహణ, కలెక్టరేట్ ప్రాంగణంలో నిర్వహిస్తున్న ఫిర్యాదుల దినోత్సవంలో అర్జీదారులకు భోజన సదుపాయాలు ఏర్పాటు చేయటంతో అవార్డు దక్కింది. ప్రధానమంత్రి జన ఔషధి మందుల షాపు ద్వారా అతి తక్కువ ధరలకు పేదలకు అందించే మందుల పంపిణీ కార్యక్రమం, జిల్లా కలెక్టర్ వి.వినోద్‌కుమార్ సహకారంతో జిల్లాలోని ప్రతి మండలంలో రెడ్‌క్రాస్ శాఖలను ఏర్పాటు చేసేందుకు కార్యాచరణ రూపొందించడం వంటి కార్యక్రమాల నిర్వహణలో సేవా రంగంలో జిల్లాను బలోపేతం చేసినందుకు ఈ సేవా అవార్డు అందించారు.


