తీరని ఆక్రమణల దాహం..! చీరాల అర్బన్: తీర ప్రాంతంలో పర్యాటకంగా అభివృద్ధిని అందరూ స్వాగతించాల్సిందే. అయితే ఆ పేరుతో సహజ సిద్ధమైన ప్రకృతి స్థితిని, గమనాన్ని మార్చకూడదు. కానీ కొందరు మార్చారు. విపత్తుల సమయంలో ఆ ప్రభావం కనిపిస్తోంది. గత ఏడాది వచ్చిన మొంథా తుపానుకు తీరం వెంట పలుచోట్ల రోడ్డుకు గండ్లు పడటం, కల్వర్టులు తెగిపోవటం అందుకు నిదర్శనం. సుమారు నెల రోజుల పాటు ఆ ప్రాంత పైర్లు నీట మునిగాయి. ఇది ఆందోళన కలిగించే అంశం. చర్యలు చేపట్టాల్సిన వారిలో కొందరు పైసాకి, మరి కొందరు పవర్‌కు తలొగ్గుతున్నారు. దీంతో అంతిమంగా తీరం పరాధీనం అవుతోంది.
సీఆర్‌జెడ్ (కోస్టల్ రెగ్యులేషన్ జోన్) నిబంధనలను విస్మరించి పుట్టగొడుగుల్లా రిసార్టులు, అనధికారిక లేఅవుట్లు వెలుస్తున్నాయి. వీటిపై చర్యలు చేపట్టాల్సిన అటవీ, రెవెన్యూ, పొల్యూషన్, సీజెడ్‌ఎంపీ (కోస్టల్ జోన్ మేనేజ్‌మెంట్ ప్లాన్), ఎన్‌డీజెడ్ (నో డెవలప్‌మెంట్ జోన్)లకు సంబంధించిన చర్యలు నామమాత్రంగా కూడా లేవు. భవిష్యత్‌లో సునామీ లాంటి విపత్తు సంభవిస్తే, ఇదే పరిస్థితులు కొనసాగితే అప్పుడు జరిగే ఆస్తి, ప్రాణ నష్టాన్ని ఎవరూ ఊహించలేరు. ఈ క్రమంలో తప్పటడుగులు దశలోనే నిబంధనలు పాటించే విధంగా చర్యలు చేపడితే పర్యాటకం అభివృద్ధి చెందుతుంది. ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. మంచి పేరు వస్తుంది.
సూర్యోదయ, సూర్యాస్తమయాల్లో సముద్ర తీరం శోభ వర్ణనాతీతం. చీరాల మండలం వాడరేవు నుంచి వేటపాలెం మండలం పొట్టిసుబ్బయ్యపాలెం వరకు అందమైన తీరానికి కేరాఫ్. అయితే ఇది గతం. వర్తమానంలో తీరం వెంట అందమైన వనాలు కనుమరుగవుతున్నాయి. కొండల్లా ఉండే ఇసుక తిన్నెలు చదునుగా మారాయి. సీ వ్యూ పేరుతో తీర రక్షణ చర్యలను విస్మరిస్తున్నారు. దీంతో తీరం భద్రత నామమాత్రంగా ఉంది. ఇవే పరిస్థితులు కొనసాగితే భవిష్యత్ ప్రమాదకరంగా ఉంటుంది.
గతంలో సునామీ వచ్చింది. అంతకు ముందు సీఆర్‌జెడ్ పరిధిలో ఉన్న ప్రాంతాన్ని అటవీశాఖ పర్యవేక్షించేది. ఈ క్రమంలో సునామీ తరువాత వీఎస్‌ఎస్ (వన సంరక్షణ సమితి)ల పేరుతో కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో అటవీశాఖ, వీఎస్‌ఎస్‌లు సంయుక్త భాగస్వామ్యంతో జేఎఫ్‌ఎం (జాయింట్ ఫారెస్ట్ మేనేజ్‌మెంట్)కు శ్రీకారం చుట్టారు. తీరం వెంట మొగిలి, సరిగ, జామాయిల్ లాంటి సామాజిక వనాల పెంపకం ప్రారంభించారు. ఈ క్రమంలో వీఎస్‌ఎస్‌ల ద్వారా వేట విరామ సమయంలో వారి భృతికి ఈ వనాలు దోహదపడుతూ వచ్చాయి.
తీరప్రాంతంలో నిర్మాణాలకు, ఇతరత్రా వ్యాపార కార్యకలాపాలకు సంబంధించి ఎవరైతే అనుమతులు ఇవ్వాలో ఆయా శాఖల మధ్య సమన్వయ లోపం ఉంది. దీంతో నిర్దిష్టమైన అనుమతులు లేకుండానే చేపట్టే చర్యలతో తీరం భవిష్యత్ భద్రత ఆందోళనకరంగా మారుతోంది. ఈ క్రమంలో అటవీశాఖ పరంగా ఎలాంటి చర్యలు చేపడుతున్నారని బాపట్ల డీఎఫ్‌ఓ రవిశంకర్‌ను వివరణ అడగ్గా తీరం వెంట అటవీశాఖకు సంబంధించి నోటిఫైడ్ ఫారెస్ట్ లేదన్నారు. ఈ విషయమై వేటపాలెం మండల తహసీల్దార్ గీతారాణిని ఫోన్ ద్వారా వివరణ అడిగేందుకు ప్రయత్నించగా అందుబాటులో లేరు.
గతంలో జేఎఫ్‌ఎం (జాయింట్ ఫారెస్ట్ మేనేజ్‌మెంట్)కు సంబంధించిన ప్రాంతంలో చెట్లను నరికిన వారిపై అటవీశాఖ పరంగా పీఓఆర్ (ప్రొహిబిటెడ్ అఫెన్సెస్ రిజిస్టర్)లో కేసులు నమోదు చేసిన సందర్భాలు ఉన్నాయని అటవీశాఖలో పనిచేసి రిటైర్ అయిన ఉద్యోగి తెలిపారు. లా అండ్ ఆర్డర్‌లో ఎఫ్‌ఐఆర్ ఎలానో అటవీశాఖలో పీఓఆర్ అలాంటిదని చెప్పారు. మరి అలాంటప్పుడు అది అటవీశాఖ భూమి కాకపోతే ఆ విధమైన చర్యలు ఏ విధంగా తీసుకున్నారనేది ప్రస్తుతం అందరి మదిలో మెదులుతున్న సందేహాలు. తీరం పరాధీనం కాకుండా ఉండాలంటే ప్రక్షాళనే పరిష్కార మార్గం. అందుకు ముందస్తుగా కొత్త నిర్మాణాలు ఏవైనా పూర్తి స్థాయి అనుమతులు ఉంటేనే సాగనివ్వాలి. లేదంటే ఆపాలి.
యథేచ్ఛగా సీఆర్‌జెడ్ నిబంధనల ఉల్లంఘన
అధికారుల నిర్లక్ష్యంతో
ఉనికే లేని వీఎస్‌ఎస్‌లు
తీర రక్షణకు శాఖల మధ్య సమన్వయ లోపం
డబ్బు, అధికార ప్రభావాలతో అన్యాక్రాంతం
ఇదే పంథా కొనసాగితే భవిష్యత్ ప్రమాదకరం
సునామీ వంటి విపత్తులు వస్తే ఊహించని నష్టం
అంతటా నిర్లక్ష్యమే
తీరం వెంట రవాణాకు రోడ్డు వేశారు. దీంతో తీరప్రాంత భూములకు గిరాకీ వచ్చింది. క్రమేణా ఎకరా విలువ రూ.వేల నుంచి రూ.లక్షలకు చేరింది. ప్రస్తుతం రూ.కోట్లలో పలుకుతోంది. ఈ క్రమంలో ఎవరికి వారు నిబంధనలను విస్మరిస్తూ ముందుకు సాగుతున్నారు. కొందరు ఎలాంటి అనుమతులు లేకుండానే తమ వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో అటు అటవీశాఖ, ఇటు రెవెన్యూ శాఖ, ముఖ్యంగా సీఆర్‌జెడ్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో నిబంధనలకు సంబంధించి పట్టించుకునే వారు కరువయ్యారు. ఈ క్రమంలో వీఎస్‌ఎస్‌లు పరంగా జేఎఫ్‌ఎం ఉందా లేదా అనే సందేహం ప్రస్తుతం నెలకొంది.
అసలు ఏం జరుగుతోంది...?
గతం ఘనం... భవిష్యత్ ఆందోళనకరం
సునామీ తరువాత వీఎస్‌ఎస్‌ల ఏర్పాటు
శాఖల మధ్య సమన్వయ లోపం
గతంలో పీఓఆర్‌లో కేసులు నమోదు
తీరం పరాధీనం అవుతోంది. సీఆర్‌జెడ్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. తీరం వెంట ఉండాల్సిన చెట్లు దాదాపు కనుమరుగు అవుతున్నాయి. పర్యాటకం పేరుతో హద్దులు మీరుతున్నారు. దీనిపై ప్రాథమిక చర్యలు చేపట్టాల్సిన అటవీ, రెవెన్యూ శాఖలు చోద్యం చూస్తున్నాయి. డబ్బు, అధికారం అండతో అక్రమార్కులు చెలరేగిపోతున్నారు.