జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్‌కుమార్
బాపట్ల: జిల్లాలో సాంఘిక సంక్షేమ, డీఆర్‌డీఏ శాఖల ద్వారా అమలవుతున్న సంక్షేమ జీవనోపాధి కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ సమీక్ష నిర్వహించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన ఈ సమీక్షలో ఆయా శాఖల పనితీరుపై ఆరా తీశారు. నిర్దేశిత లక్ష్యాలను సమయానికి పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఫీజులు, నిర్వహణ భత్యాలు అర్హులైన ప్రతి విద్యార్థికి నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మహిళల సాధికారత కోసం గ్రామీణ అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయాలని తెలిపారు. డీఆర్‌డీఏ వెలుగు ద్వారా సీ్త్రనిధి రుణాల పంపిణీని వేగవంతం చేయాలని సూచించారు. రూ.94.14 కోట్ల లక్ష్యానికిగాను ఇప్పటివరకు రూ.11.62 కోట్లు మాత్రమే మంజూరు కావడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కొల్లూరు, చుండూరు, ఇంకొల్లు మండలాల సిబ్బంది రుణ వసూళ్లపై ప్రత్యేక శ్రద్ధ వహించి లక్ష్యాలను పూర్తి చేయాలని ఆదేశించారు. ఉన్నతి పథకాల కింద మంజూరు చేసిన వడ్డీ లేని రుణాల వసూళ్లు తక్కువగా ఉన్న చెరుకుపల్లి మండల ఏపీఓను వివరణ కోరారు. సముద్రపు మొక్కల పెంపకంపై అవగాహన కల్పించేందుకు తమిళనాడులోని రామేశ్వరం ప్రాంతానికి స్టడీ టూర్ ఏర్పాటు చేయాలని సూచించారు. గుర్రపు డెక్క , అరటినారు ఉత్పత్తులపై శిక్షణ అందించాలని సూచించారు. సమావేశంలో డీఆర్‌డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ సింగయ్య, మండలాల ఏపీఎంలు, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి రాజ దిబోరా, బీసీ, ఎస్టీ సంక్షేమ శాఖల అధికారులు పాల్గొన్నారు.
పీజీఆర్‌ఎస్ అర్జీలు మళ్లీ రాకుండా చూడండి
జిల్లాలో మండలాలవారీగా జరుగుతున్న రెవెన్యూ క్లినిక్స్, రీ సర్వేకి సంబంధించి ప్రతిరోజు రిపోర్టు అందజేయాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్‌లోని న్యూ వీడియో కాన్ఫరెన్స్ హల్‌లో జేసీ భావన వశిష్ట, డీఆర్‌ఓ జి.గంగాధర్ గౌడ్‌లతో కలసి పీజీఆర్‌ఎస్, రెవెన్యూ క్లినిక్స్, రీ సర్వే, పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ, ప్రింటింగ్, రీసర్వే, మ్యానవల్ 1బీ తదితర అంశాలపై తహసీల్దార్లు, మండల సర్వేయర్లు, వీఆర్‌ఓలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జూలైకల్లా గ్రౌండింగ్ రీ సర్వే పూర్తి చేయాలని ఆయన అన్నారు. అర్జీలకు సంబంధించి రీ ఓపెన్ కాకుండా పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కొల్లూరు మండలానికి సంబంధించి రీ ఓపెన్ చాలా అయ్యాయని గుర్తుచేశారు. బాపట్ల ఆర్డీఓ పి.గ్లోరియా, భూ రికార్డ్స్ సర్వే శాఖ ఏడీ సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.
ఎండలపై జాగ్రత్తలు తీసుకోవాలి
జిల్లాలో ఎండ తీవ్రత అధికమవుతున్నందున విద్యాసంస్థలు, రద్దీ ప్రాంతాల్లో చలివేంద్రాలను, తాటాకు పందిళ్లను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు.


