గంజాయి మత్తులో యువకుల హల్‌చల్‌ | - | Sakshi
Sakshi News home page

గంజాయి మత్తులో యువకుల హల్‌చల్‌

Apr 3 2026 7:50 AM | Updated on Apr 3 2026 7:50 AM

మద్యం మత్తులో ఉన్న యువకుడిపై కత్తితో దాడి

రెండు చోట్ల పొడవడంతో స్పృహ కోల్పోయిన యువకుడు

హడావుడిగా పరుగులు తీసిన పోలీసులు

పోలీసుల రాకతో పారిపోయిన నిందితులు

గాయపడిన వ్యక్తి ఆసుపత్రికి తరలింపు

తాడేపల్లిరూరల్‌: తాడేపల్లి పట్టణ పరిధిలోని ప్యారీ కంపెనీలో గంజాయి బ్యాచ్‌ గురువారం హల్‌చల్‌ చేసింది. మద్యం మత్తులో ఉన్న ఓ యువకుడిపై కత్తితో దాడి చేయడంతో ఆ యువకుడు స్పృహ కోల్పోయాడు. సేకరించిన వివరాల ప్రకారం.. చదల వెంకన్న అన్నయ్య కుమారుడు రెండు రోజుల నుంచి కనిపించడం లేదు. అతడ్ని వెతికే క్రమంలో వెంకన్న, మరో అన్నయ్య కుమారుడు అశోక్‌ చక్రవర్తి ఫుల్‌గా మద్యం తాగి ఇంటికి వచ్చారు. అప్పటికే గంజాయి సేవించి అక్కడ ఉన్న కొంతమంది యువకులు మీ అన్నయ్య కొడుకుని మేమేదో చేశామని మాట్లాడుతున్నారని ఘర్షణకు దిగారు. ఈ గంజాయి బ్యాచ్‌లోని ఓ యువకుడు జేబులో నుంచి కత్తి తీసి చదల వెంకన్నను ఎడమ చేతివైపు డొక్కల్లో పొడవగా స్వల్ప గాయమైంది. వెంటనే అదే కత్తితో తలపై పొడవడంతో వెంకన్నకు తీవ్ర రక్త స్రావమై అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. సమాచారం అందుకున్న తాడేపల్లి సీఐ వీరేంద్రబాబు, ఎస్‌ఐ ఖాజావలి హడావుడిగా సంఘటనా స్థలానికి వచ్చారు. పోలీసుల రాకను గమనించిన గంజాయి బ్యాచ్‌ అక్కడి నుండి పరారైంది. కత్తితో దాడిచేసిన వ్యక్తి కత్తుల పేటకు చెందిన యోహాన్‌గా పోలీసులు గుర్తించారు. గతంలో కూడా ఇదే బ్యాచ్‌ పలు ప్రాంతాల్లో కత్తులతో పలువురిని బెదిరించినట్లు విశ్వసనీయ సమాచారం. కత్తుల పేటలో నివాసముండే వారు స్థానికంగా ఉన్న అందరిపై ఇదేవిధంగా దౌర్జన్యం చేస్తున్నారని బహిరంగంగానే కత్తులు పట్టుకుని తిరుగుతున్నారని, ఈ రహదారిలో ప్రయాణించాలంటూ తీవ్ర ఇబ్బందిగా ఉన్నట్లు పలువురు తెలియజేశారు. గంజాయి బ్యాచ్‌ కోసం సీఐ వీరేంద్రబాబు సిబ్బందితో ప్యారీ కంపెనీతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. గాయపడిన చదల వెంకన్నను వైద్య నిమిత్తం 108 ద్వారా విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స నిర్వహించిన 108 సిబ్బంది ప్రాణానికి ఎటువంటి హాని లేదని, మద్యం మత్తులో ఉండడం వల్ల స్పృహ కోల్పోయాడని తెలియజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement