పర్చూరు(చినగంజాం): ఓ దుకాణంలో కొనుగోలు చేసిన నెయ్యి ప్యాకెట్‌లో సరైన నాణ్యత లేకపోవడంతో ఓ వినియోగదారుడు జిల్లా ఆహార భద్రతా అధికారులను ఆశ్రయించాడు. వినియోగదారుని ఫిర్యాదుకు సత్వరం స్పందించిన అధికారులు గురువారం పర్చూరులో దుకాణంపై తనిఖీలు నిర్వహించారు. అధికారులు తెలిపిన వివరాల మేరకు.. పర్చూరు బొమ్మల సెంటర్‌లో నిర్వహిస్తున్న ఓ దుకాణంలో పర్చూరుకు చెందిన పేర్ని హరిబాబు ఓ కంపెనీకి చెందిన నెయ్యి ప్యాకెట్ కొనుగోలు చేశాడు. నెయ్యి ప్యాకెట్‌ను ఇంటికి తీసుకొని వెళ్లి వినియోగిస్తున్న క్రమంలో దానిలో నెయ్యి లక్షణాలు లేకపోగా వాసన కూడా లేకపోవడాన్ని గమనించాడు. దాంతో అనుమానం వచ్చిన హరిబాబు బాపట్ల జిల్లా ఆహార భద్రతాధికారి ప్రణీత్‌కుమార్‌కు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు అందుకున్న అధికారి సత్వరం స్పందించి ఫిర్యాదు చేసిన దుకాణంపై గురువారం తనిఖీలు నిర్వహించి ఫిర్యాదు చేసిన బ్యాచ్‌కు చెందిన నెయ్యి ప్యాకెట్‌లను స్వాధీనం చేసుకొని పరిశీలించి నమూనాలను సేకరించాడు. ఆ నమూనాలను ప్రయోగశాల పరీక్షల కోసం హైదరాబాద్ పంపుతున్నట్లు అధికారి తెలిపారు.
వినియోగదారుని ఫిర్యాదుతో స్పందించిన ఆహార భద్రతాధికారులు


