పర్యాటకం.. పితలాటకం | - | Sakshi
Sakshi News home page

పర్యాటకం.. పితలాటకం

Mar 17 2026 7:39 AM | Updated on Mar 17 2026 7:39 AM

ఆదాయం ఘనం.. వసతులు నామమాత్రం

వాడరేవు పంచాయతీ కీర్తివారిపాలెం వద్ద చెక్‌పోస్ట్‌ తొలుత ప్రారంభించిన ఎమ్మెల్యే కొండయ్య పంచాయతీ సిబ్బందితో నిర్వహణ తరువాత వేలం ద్వారా కాంట్రాక్టర్‌కు అప్పగింత కారుకు రూ.50, పెద్ద వాహనాలకు రూ.100 రుసుం వసూలు ఏడాది కాలానికి పాట ద్వారా రూ.7 లక్షలు పంచాయతీకి జమ మెరుగైన వసతులు కల్పించాలంటున్న పర్యాటకులు

డబ్బు లేదు.. ప్రస్తుతం ఏమీ చేయలేం

ఆదాయం ఘనం.. వసతులు నామమాత్రం

చీరాల అర్బన్‌: మండల పరిధిలోని వాడరేవు పంచాయతీకి ఆదాయం ఘనంగానే వస్తున్నా సౌకర్యాలు నామమాత్రంగా ఉన్నాయి. దీంతో పర్యాటకులు ఇబ్బంది పడుతున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక వాడరేవు పంచాయతీ కీర్తివారిపాలెం వద్ద చెక్‌పోస్ట్‌ ఏర్పాటు చేశారు. తీరానికి వచ్చే పర్యాటకుల వాహనాల (కారు, ఇతర పెద్ద వాహనాలు) నుంచి రుసుం వసూలు చేసే విధంగా ఆ చెక్‌పోస్ట్‌ నెలకొల్పారు. నిర్వహణ బాధ్యతను పంచాయతీ సిబ్బందికి అప్పగించారు. వచ్చిన ఆదాయంతో గ్రామంలోను, తీరంలోను మెరుగైన వసతులు కల్పించాలనేది లక్ష్యం. అయితే నిర్వహణ తీరుపై ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో చెక్‌పోస్ట్‌ వద్ద వాహనాల నుంచి రుసుం వసూలు చేసే బాధ్యతలను వేలం ద్వారా ఓ కాంట్రాక్టర్‌కు అప్పగించారు. ఏడాది కాలానికి కాంట్రాక్టర్‌ రూ.7 లక్షలు చెల్లించాలని నిబంధన విధించారు.

స్నానానికీ ఇబ్బందే..

ప్రస్తుతం ఉన్న స్నానపు గదులు సరిపోవడం లేదని పలు సందర్భాల్లో పర్యాటకులు చెబుతున్నా కనీస స్పందన కరువైంది. సముద్ర స్నానం అనంతరం మంచినీటితో స్నానం చేసేందుకు ఏర్పాట్లు చేయడంలో ఇక్కడి యంత్రాంగం విఫలమైంది. సాధారణంగా వాడరేవు తీరానికి శని, ఆదివారాలు, ఇతర సెలవు దినాల్లో పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఆయా రోజుల్లో పర్యాటకులు స్నానమాచరించేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

రెండు వైపులా రుసుం వసూలు

వాడరేవు–పిడుగురాళ్ల రోడ్డు నిర్మాణం పూర్తయ్యాక ఆ మార్గం నుంచి, ఇటు కీర్తివారిపాలెం(పాత రోడ్డు) నుంచి పర్యాటకులు తీరానికి వస్తున్నారు. ఈ క్రమంలో పిడుగురాళ్ల రోడ్డు నుంచి వాడరేవు పంచాయతీ పరిధిలో ఉన్న తారురోడ్డు వరకు ఏ వాహనం వచ్చినా రుసుం వసూలు చేస్తున్నారు. ఈ మేరకు పర్యాటకులకు మెరుగైన వసతులు కల్పించాల్సిన అవసరం ఉంది. సముద్రంలో స్నానాలకు వెళ్లే వారిని హెచ్చరించేందుకు సైన్‌ బోర్డులు ఏర్పాటు చేయాల్సి ఉంది. అలానే గజ ఈతగాళ్లు కూడా పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని పర్యాటకులు కోరుతున్నారు.

ఎన్నికలు నిర్వహించనందున పంచాయతీకి ఆర్థిక సంఘం నిధులు రాలేదు. కాంట్రాక్టర్‌ తొలివిడతగా రూ.4.5 లక్షలు చెల్లించారు. మిగిలిన మొత్తం చెల్లించాల్సి ఉంది. జీతభత్యాలు, పారిశుధ్యానికే అంతంత మాత్రంగా నిధులు ఉన్నాయి. వాటర్‌ ట్యాంకుల్లో తాగునీరు రాని మాట వాస్తవమే. అదనంగా పనులు చేసేందుకు నిధుల కొరత ఉంది. మా వంతు బాధ్యతగా ఉన్నంతలో సౌకర్యాలు కల్పిస్తున్నాం.

– రమేష్‌, పంచాయతీ సెక్రటరీ, వాడరేవు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement