చరిత్రలో చిరస్థాయిగా అమరజీవి త్యాగం | - | Sakshi
Sakshi News home page

చరిత్రలో చిరస్థాయిగా అమరజీవి త్యాగం

Mar 17 2026 7:39 AM | Updated on Mar 17 2026 7:39 AM

వడదెబ్బ నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి

బాపట్ల: భాషా ప్రాతిపదికన ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటులో అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వి.వినోద్‌కుమార్‌ అన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి వేడుకలను కలెక్టరేట్‌లోని న్యూ వీసీ హాల్‌లో సోమవారం ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలలో జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వి.వినోద్‌కుమార్‌, బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మతోపాటు జిల్లా అధికారులు, ఆర్య వైశ్య సంఘాల నాయకులు పాల్గొన్నారు. వీరు పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్యే నరేంద్ర వర్మ మాట్లాడుతూ అమరజీవి త్యాగం ఫలితంగానే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందని, నేటి యువత ఆయన జీవితం నుంచి స్ఫూర్తి పొందాలని అన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో పి.గ్లోరియా, బీసీ సంక్షేమ శాఖ డీడీ శివ నాగేశ్వరరావు, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ సత్యనారాయణ, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి అబ్బులు, కలెక్టరేట్‌ ఏఓ మల్లికార్జునరావు, ఆర్య వైశ్య సంఘాల నాయకులు, జిల్లా కలెక్టరేట్‌ సిబ్బంది, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అమరావతిలో జరిగిన పొట్టి శ్రీరాములు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని వీక్షించారు.

విద్యా వ్యవస్థలో ప్రతి ఒక్కరూ

క్రమశిక్షణతో మెలగాలి

బాపట్ల: విద్యా వ్యవస్థలో ప్రతి ఒక్కరు క్రమశిక్షణతో మెలగాలని, అప్పుడే అభివృద్ధి మొదలవుతోందని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వి.వినోద్‌ కుమార్‌ తెలిపారు. విద్యారంగం, గ్రామ వార్డు సచివాలయాల పనితీరుపై జిల్లా, మండల విద్యాశాఖ అధికారులు, ఎండీఓలతో వీక్షణ సమావేశం సోమవారం స్థానిక కలెక్టరేట్‌ నుంచి కలెక్టర్‌ నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలన్నింటిలో నూరు శాతం విద్యార్థుల హాజరు ఉండాలని కలెక్టర్‌ స్పష్టం చేశారు. హాజరు శాతం తక్కువగా ఉండడంపై సంబంధిత ఎంఈఓలను ఆయన నిలదీశారు. చిన్నగంజాం మండలంలో గడిచిన మూడు నెలలుగా పని తీరు బాగోలేదని, పద్ధతి మార్చుకోకపోతే చర్యలు తీసుకుంటామన్నారు. సచివాలయాల పరిధిలో చేపట్టిన యూనిఫైడ్‌ ఫ్యామిలీ సర్వే పెండింగ్‌ లేకుండా చూడాలని ఆదేశించారు. 4,600 కుటుంబాల సర్వే నేటికీ పెండింగ్‌లో ఉండడంపై అధికారులను నిలదీశారు. గ్రామ వార్డు సచివాలయాల సిబ్బంది హాజరు నూరు శాతం ఉండాలన్నారు. కర్లపాలెం మండలంలో సిబ్బంది హాజరు తక్కువగా ఉండడం ఏమిటని ప్రశ్నించారు. ఏపీ సేవ నగదు తక్షణమే ప్రభుత్వ ఖజానాకు చేర్చాలని సూచించారు. ఈ సమావేశంలో డీఈ ఓ. శ్రీనివాస్‌ సింగ్‌, సచివాలయాల ఇన్‌చార్జి విజయలక్ష్మి, జిల్లా కోఆర్డినేటర్‌ పి.యశ్వంత్‌, ఎండీఓలు, ఎంఈఓలు, తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యేతో కలసి కలెక్టర్‌ నివాళులు

వడదెబ్బ నివారణకు ఆరోగ్యశాఖ ప్రత్యేక చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వి.వినోద్‌కుమార్‌ తెలిపారు. వడదెబ్బ నివారణ పోస్టర్ల ఆవిష్కరణ కార్యక్రమం సోమవారం చేపట్టారు. వేసవి కాలంలో పెరుగుతున్న ఉష్ణోగ్రత దృష్టిలో ఉంచుకొని ప్రజలకు అవగాహన కల్పించేందుకు వడదెబ్బ తగలకుండా చేయవలసిన పనులు చేయకూడని పనులు (డూస్‌ అండ్‌ డోంట్స్‌) పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారిణి డాక్టర్‌ విజయమ్మ, నోడల్‌ అధికారి డాక్టర్‌ లలిత రాజేశ్వరి, డాక్టర్‌ వి.లోకేష్‌, డాక్టర్‌ మౌనిక తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement