జాయింట్ కలెక్టర్ భావన వశిష్ట
బాపట్ల: ప్రజల సమస్యలు పరిష్కరించడంలో అధికారులు చిత్తశుద్ధితో వ్యవహరించాలని జిల్లా సంయుక్త కలెక్టర్ భావన వశిష్ట తెలిపారు. సోమవారం స్థానిక కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్‌ఎస్) కార్యక్రమం నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ పీజీఆర్‌ఎస్‌లో నమోదైన ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని అన్నారు. తన పరిధిలో ఉన్న వాటికి అక్కడికక్కడే పరిష్కార మార్గం చూపారు. కొన్ని పరిశీలనకు, మరికొన్నింటిని విచారించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అర్జీలను క్షేత్రస్థాయిలో పరిశీలించాలన్నారు. ‘రైతన్న మీకోసం‘ కార్యక్రమాలను జిల్లాలో జయప్రదంగా నిర్వహించాలని తెలిపారు. ప్రారంభ సూచికగా వ్యవసాయ శాఖ రూపొందించిన కరపత్రాలు, పోస్టర్‌లను జేసీ విడుదల చేశారు. ఆరు రోజులపాటు గ్రామాలలో నిర్వహించే ఈ కార్యక్రమాలు రైతన్నలకు ఎంతో మేలు చేస్తాయన్నారు. నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటలు, అగ్రిటెక్, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రభుత్వం నుంచి పూర్తి మద్దతు, పెట్టుబడులు–పరిశ్రమలు, సంక్షేమ నుంచి సంపాద సృష్టించే దిశగా రైతులు అడుగులు వేయాలని ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. గ్రామ సచివాలయాల స్థాయిలో ఎనిమిది మందితో బృందాలను నియమించాలన్నారు. ప్రతిరోజు ప్రతి బృందం 30 గృహాలను లక్ష్యంగా నిర్దేశించుకుని సందర్శించేలా ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. రైతు సేవా కేంద్రాల స్థాయిలో ఈ కార్యక్రమాలు విరివిగా చేపట్టాలన్నారు. ప్రతిరోజూ జిల్లా రెవెన్యూ అధికారి జిల్లా పర్యవేక్షించాలని సూచించారు. అనంతరం జాతీయ పశు వ్యాధి నియంత్రణ టీకాలు ఏప్రిల్ 29వ తేదీ వరకు జరుగుతాయన్నారు. పశు పోషకులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో డీఆర్వో జి.గంగాధర్‌గౌడ్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారిని విజయనిర్మల, వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎస్ విజయమ్మ, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ అనంతరాజు తదితరులు పాల్గొన్నారు.


