బాపట్ల: అందరూ సోదర భావంతో కలిసికట్టుగా ఉండి శాంతి భద్రతలను స్థాపించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ తెలిపారు. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని ముస్లిం మైనార్టీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక షాదీఖానాలో ఇఫ్తార్ విందు జరిగింది. ముస్లిం మత పెద్ద ఖలీల్ లాఖాన్, జిల్లా కలెక్టర్ ఖురాన్ గ్రంథాన్ని బహుమతిగా అందజేశారు. ముందుగా అందరూ కలిసి నమాజ్ చేశారు. పవిత్ర రంజాన్ మాసంలో ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందుకు హాజరైన కలెక్టర్ వినోద్ కుమార్ ముస్లింలకు స్వయంగా తన చేతులతో వడ్డించారు. అనంతరం వారితో కలిసి విందులో పాల్గొన్నారు. పవిత్ర రంజాన్ మాసంలో కఠినమైన ఉపవాస దీక్షలు చేస్తూ ప్రజలందరూ బాగుండాలని దైవాన్ని కోరుకోవడం అభినందనీయమని కలెక్టర్ చెప్పారు. యుద్ధం నేపథ్యంలో మక్కా పుణ్య క్షేత్రానికి వెళ్లేవారికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేరొన్నారు. బాపట్ల జిల్లాలో ఎవరైనా మక్కాకు వెళ్లేవారు ఉంటే వారికి ఎలాంటి సమస్యలు రాకుండా వారి ప్రయాణ సౌకర్యాలకు అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటామని చెప్పారు. కార్యక్రమంలో ఆర్డీఓ పి.గ్లోరియా, ఇంటర్మీడియెట్ బోర్డ్ జిల్లా అధికారి జుబేర్, మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి, కరీముల్లా సాహెబ్ పాల్గొన్నారు.
కలెక్టర్ డాక్టర్ వి.వినోద్‌కుమార్


