తాడేపల్లిరూరల్: అగ్ని సాక్షిగా తాళి కట్టి భార్యను చేసుకున్న భర్త తనను వదిలివేయడంతో, తనకు న్యాయం చేయాలంటూ ఆమె బంధువులతో కలసి భర్త ఇంటి ముందు సోమవారం నిరసనకు దిగిన ఘటన గుంటూరు జిల్లా తాడేపల్లి రూరల్ మండలం కుంచనపల్లి గ్రామంలోని ఎస్‌వీ అపార్ట్‌మెంట్‌లో ఈ సంఘటన చోటుచేసుకుంది. బాధితురాలు తెలిపిన వివరాలు... కృష్ణాజిల్లా పామర్రుకు చెందిన చైతన్యకు గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం మందడం గ్రామానికి చెందిన యర్రంనేని విజయ్‌తో 2017లో పెద్దల సమక్షంలో వివాహమైంది. 2019లో వీరికి కుమారుడు జన్మించాడు. తనకి ఇష్టం లేని పెళ్లి చేశారంటూ విజయ్ భార్యను వదిలివేశాడు. దీంతో ఆమె పుట్టింటికి వచ్చేసింది. ఆ తర్వాత భర్త, అత్తమామలు బాబును చూసేందుకు వచ్చారు. భార్యను కాపురానికి తీసుకు వెళ్లలేదు. తనను కాపురానికి తీసుకువెళ్లమని ఎన్నిసార్లు వేడుకున్నా అత్తమామలు, భర్త నుంచి ఎటువంటి స్పందన లేదు. ఈ క్రమంలో కృష్ణాజిల్లా పామర్రు, తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌లలో ఫిర్యాదు చేసింది. అయినా న్యాయం జరగలేదు. దీంతో 2020లో కోర్టును ఆశ్రయించింది. కాపురానికి తీసుకువెళ్లాలని కోర్టు ఆర్డర్ ఇచ్చినప్పటికీ భర్త నుంచి ఎటువంటి స్పందన లేదు. తమకు సంబంధం లేదంటూ అత్తమామలు కూడా చేతులెత్తేశారు. భర్తకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ వస్తుండడంతో తెలిసిన బంధువుల ద్వారా ఆరా తీస్తే ఆయన హైదరాబాదులో వేరే యువతితో సహజీవనం చేస్తున్నాడని, ఫారిన్ వెళ్లేందుకు సిద్ధపడుతున్నాడని తెలుసుకుంది. ఈ నేపథ్యంలో సోమవారం కుంచనపల్లిలోని అపార్ట్‌మెంట్ వద్ద కుటుంబ సభ్యులతో కలసి ఆందోళనకు దిగింది. బాధితురాలు చైతన్య తండ్రి చౌదరి మాట్లాడుతూ తమకు న్యాయం చేయాలని నిరసన చేపట్టినట్లు తెలిపారు.
భర్త ఇంటి ముందు భార్య నిరసన


