మంతెనవారిపాలెం(కర్లపాలెం): శాంతి భద్రతల పరిరక్షణకు సీసీ కెమెరాలు దోహదపడతాయని జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ చెప్పారు. పిట్టలవానిపాలెం మండలం మంతెనవారిపాలెంలో గ్రామస్తులు రూ.2.50 లక్షలతో గ్రామంలో ఏర్పాటు చేసిన 16 సీసీ కెమెరాలను సోమవారం జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ ఎమ్మెల్యే నరేంద్రవర్మరాజుతో కలసి ప్రారంభించారు. తొలుత అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి, స్వాతంత్య్ర సమరయోధులు వెంకటరాజు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
● జిల్లా ఎస్పీ మాట్లాడుతూ గ్రామస్తులంతా కలసి తమ రక్షణ కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవటం అభినందనీయమన్నారు. ప్రస్తుత సమాజం సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని అభివృద్ధి వైపు పరుగులు తీస్తుందన్నారు. గ్రామస్తులందరూ ద్విచక్ర వాహనాలపై ప్రయాణించేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని తెలిపారు. ఎమ్మెల్యే నరేంద్రవర్మ మాట్లాడుతూ సీసీ కెమెరాల ఏర్పాటు కోసం గ్రామస్తులంతా ఐక్యంగా పనిచేయటం అభినందనీయమన్నారు.సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వెంకటపతిరాజు, తహసీల్దార్ వెంకటేశ్వరరావు, రూరల్ సీఐ హరికృష్ణ, ఎస్‌ఐ శివకుమార్ ఉన్నారు.
జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్


