దిగజారిన ధర .. మద్దతు కోసం ఎదురు చూపులు మార్కెఫెడ్ రంగంలోకి దిగేదెప్పుడో? పట్టించుకోని చంద్రబాబు సర్కార్ వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో జరిగిన మేలును గుర్తు చేసుకుంటున్న రైతులు
మబ్బులు పడుతున్నాయి..
సాగునీరు లేదు..మద్దతు ధర లేదు
చీరాల అర్బన్: అన్నదాత సుఖీభవ.. అంటూ ఎన్నికల వేళ చంద్రబాబు మాటలు కోటలు దాటాయి. ఆచరణలో ఆ పథకం కింద రైతుల్లో భారీగా కోతలు పెట్టారు. లబ్ధిదారులకు అందిన సాయం అరకొరే. కౌలు రైతులకు మొండి చెయ్యి చూపారు. గిట్టుబాటు ధర అటుంచి, కనీసం పండిన పంటలకు మద్దతు ధరకు కొనుగోలు చేసేవారు లేకుండా పోయారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలో మొక్కజొన్న రైతుల పరిస్థితి అందుకు దర్పణం పడుతోంది. దీంతో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వమే నయమని రైతులు గుర్తు చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఆకాశంలో మబ్బులు ఏర్పడుతున్నాయి. ఎప్పుడు వాతావరణం ఎలా ఉంటుందో తెలీదు. ప్రైవేటుగా అమ్ముకుంటే నష్టం. ఆగుదామంటే ఎప్పుడు మద్దతు ధరతో మార్కెఫెడ్ ద్వారా కొనుగోళ్లు జరుగుతాయో తెలియడం లేదని రైతులు తమ నిస్సహాయతను వ్యక్తం చేస్తున్నారు.
చేతికొచ్చిన పంట ... నోటికి అందేనా?
చేతికి వచ్చిన పంట, నోటికి అందుతుందో లేదోనని మొక్కజొన్న రైతుల ఆందోళన చెందుతున్నారు. రెండు రోజుల నుంచి వాతావరణం మారుతోంది. ఆకాశంలో అకస్మాత్తుగా మబ్బులు ఏర్పడుతున్నాయి. మరీ ఉదయం వేళ ఎప్పుడు వర్షం కురుస్తుందో అన్నట్లుగా వాతావరణం ఉంటోంది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం మొక్కజొన్న పైరు కోతకు వచ్చింది. కొందరు కూలీలతో కండెలను విరిపిస్తున్నారు. మరికొందరు మిషన్లతో కోపిస్తున్నారు. దిగుబడి ఆశాజనకంగా లేదు. దీనికితోడు జల్లులు పడితే కల్లాల్లో ఉన్న మొక్కజొన్న కండెలు, గింజలను తడవకుండా కాపాడుకోవటం తలకు మించిన భారం అవుతుందని రైతులు వాపోతున్నారు.
పెరిగిన పెట్టుబడులు...దిగజారిన ధరలు
మొక్కజొన్న సాగుకు గతం కంటే ఈ ఏడాది పెట్టుబడులు పెరిగాయి. ఎకరాకు సుమారు రూ.50 వేలు పైగా పెట్టుబడి ఖర్చులు అవుతున్నాయి. అన్నీ సక్రమంగా ఉంటే ఎకరాకు 40 నుంచి 45 క్వింటాళ్లు దిగుబడి రావాలి. అయితే ఈ ఏడాది దిగుబడి ఎకరా 30 నుంచి 40 క్వింటాళ్ల లోపే ఉంటుందంటున్నారు. గతేడాది క్వింటా మొక్కజొన్నకు మద్దతు ధర రూ.2,300 ప్రకటించారు. ఈ క్రమంలో క్వింటాకు రూ.2500 మద్దతు ధర ప్రకటించాలి. మార్కెఫెడ్ ద్వారా యుద్ధప్రాతిపదికన కొనుగోలు చేయించాలి. లేదంటే ప్రస్తుతం బయట మార్కెట్‌లో క్వింటా రూ.1700లకే అడుగుతున్నారు. ఆ ధరకు విక్రయిస్తే భారీగా అప్పులు మూట గట్టుకోవాల్సిన పరిస్థితి. రూ.2,500 లెక్కన కొనుగోలు చేస్తే మిగులు లేకపోయినా కనీసం పెట్టుబడి, చాకిరి అయినా వస్తుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
సాగునీరు లేదు. ఇదిగో, అదిగో అంటున్నారే కానీ మాకు సాగునీరు ఎప్పుడు వస్తుందో తెలియడం లేదు. సాగునీరు ఉంటే బంగారం పండిస్తాం. వర్షాధారంగా మొక్కజొన్న సాగుచేశాం. వ్యయప్రయాసలకోర్చి వర్షాభావ పరిస్థితులు నీటి తడులు ఇచ్చాం. అయినా దిగుబడి ఆశించిన స్థాయిలో రాలేదు. 35 నుంచి 40 క్వింటాళ్ల లోపే ఉంటుంది. ప్రైవేటు మార్కెట్‌లో క్వింటా రూ.1700గా చెప్తున్నారు. ఈ ఏడాది మద్దతు ధర క్వింటాకు రూ.2,500 ఉండాలి. వెంటనే మార్కెఫెడ్ ద్వారా కొనుగోలు చేయించాలి. లేదంటే నష్టపోతాం.
– కోరంకి వెంకటేశ్వర్లు, పాపాయిపాలెం
వాతావరణం మారుతోంది. మబ్బులు పడుతున్నాయి. జల్లులు పడితే కండెలపై పట్టాలు తేవాలంటే తలకు మించిన భారం అవుతోంది. అమ్ముదామంటే ప్రైవేటు వ్యాపారులు క్వింటా రూ.1700 అంటున్నారు. జల్లులు పడి తడిస్తే ఇంకా తక్కువకు అడుగుతారు. క్వింటా రూ.2,500 లేకుంటే నష్టపోతాం. ఒకటిన్నర ఎకరంలో మొక్కజొన్న సాగుచేశా. ఇప్పటికి రూ.90వేలు పెట్టుబడి అయ్యింది. మా చాకిరి, కౌలు కాకుండా. ఈ క్రమంలో వెంటనే మద్దతు ధర క్వింటాకు రూ.2,500లుగా ప్రకటించాలి.
–పులి వెంకటేశ్వర్లు, గవినివారిపాలెం


