నేటి నుంచి పదవ తరగతి పరీక్షలు జిల్లాలో 82 కేంద్రాలు ఏర్పాటు రాయనున్న విద్యార్థులు 15,780 మంది 800 మంది ఇన్విజిలేటర్ల నియామకం 19 సమస్యాత్మక కేంద్రాల్లో సీసీ కెమెరాలతో ప్రత్యేక నిఘా
కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు
బాపట్ల టౌన్:పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు సమయం ఆసన్నమైంది. నేటి నుంచి ప్రారంభం కానున్న పరీక్షలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నెల 16 నుంచి ఏప్రిల్ ఒకటవ తేదీ వరకు జరగనున్న పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 364 పాఠశాలల నుంచి 15,944 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. వారిలో 15,780 మంది రెగ్యులర్ విద్యార్థులు, 164 మంది సప్లమెంటరీ విద్యార్థులు ఉన్నారు. జిల్లాలో 82 పరీక్ష కేంద్రాలను సిద్ధం చేశారు. విద్యార్థులు ఆన్‌లైన్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకున్న హాల్ టిక్కెట్‌లను చూపి పరీక్షకు నేరుగా హాజరుకావచ్చు.
నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు
పరీక్షల నిర్వహణలో ఇన్విజిలేటర్లు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా విద్యాశాఖాధికారి డి. శ్రీనివాస్ అన్నారు. పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. కేంద్రంలోకి సెల్‌ఫోన్లను తీసుకెళ్లరాదని తెలిపారు. పరీక్ష ముగిసేంత వరకు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. పరీక్షలు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు జరుగుతాయని చెప్పారు. కనీసం పావుగంట ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలన్నారు. అనివార్య కారణాలతో ఆలస్యం అయితే 9.45 గంటల వరకు విద్యార్థులను హాల్‌లోకి అనుమతిస్తామని పేర్కొన్నారు. 10 గంటలు దాటిన తర్వాత ఎవరినీ కేంద్రంలోకి అనుమతించబోమని తెలిపారు. ఇన్విజిలేటర్లు, విద్యార్థులు పరీక్ష కేంద్రంలోకి సెల్‌ఫోన్లు, రాజకీయ నాయకుల ఫొటోలతో కూడిన ప్యాడ్లు తీసుకురాకూడదని చెప్పారు. పాఠశాల పేరుతో ఉన్న ఐడీ కార్డులు, యూనిఫామ్‌ను విద్యార్థులు ధరించరాదన్నారు. ఆయా కేంద్రాలకు 200 మీటర్ల దూరంలో జిరాక్స్, నెట్ సెంటర్లను తెరిచి ఉంచరాదన్నారు. 82 డిపార్ట్‌మెంటల్ అధికారులు, 82 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 19 మంది సీ కేటగిరి కస్టోడియన్లు, 6 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు, 10 మంది రూట్ ఆఫీసర్లను నియమించామన్నారు.
పరీక్షలు నిర్వహించే కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ తెలిపారు. జిల్లాలోని 82 కేంద్రాల వద్ద ఇద్దరు చొప్పున సిబ్బంది నియమించామన్నారు. అన్ని సెంటర్లలో ప్రశాంతంగా పరీక్షలు జరిగేలా చూసుకోవాల్సిందిగా ఎస్‌ఐ స్థాయి అధికారిని నియమించామన్నారు. పరీక్షలు ప్రారంభమైనప్పటి నుంచి ముగిసేంత వరకు పరీక్షా కేంద్రానికి 100 మీటర్ల దూరంలో విద్యార్థుల తల్లిదండ్రులు, సంబంధికులు ఎవరూ ఉండరాదన్నారు. ప్రశ్నపత్రాలను భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద పటిష్ట భద్రత ఏర్పాట్లు చేశామని తెలిపారు. సమాధాన పత్రాలను తరలించే సమయంలో పోలీస్ ఎస్కార్ట్ ఏర్పాటు చేశామన్నారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ముందస్తుగా మొబైల్ పెట్రోలింగ్ నిర్వహించేలా చూస్తామని తెలిపారు. సమస్య తలెత్తిన వెంటనే 112 కు డయల్ చేయాలన్నారు. మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడినా, సహకరించినా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.


