గురువులకే పెద్ద పరీక్ష | - | Sakshi
Sakshi News home page

గురువులకే పెద్ద పరీక్ష

Mar 16 2026 7:36 AM | Updated on Mar 16 2026 7:36 AM

ఉన్నతాధికారుల ఆదేశాలతో ఇన్విజిలేషన్‌ డ్యూటీలు 25 శాతం ప్రైవేటు ఉపాధ్యాయులకు కేటాయింపు.. అనంతరం రద్దు బాబు సర్కార్‌ అడ్డగోలు నిర్ణయాలతో ఉపాధ్యాయులపై పెనుభారం నేటి నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం

చీరాల: విద్యాశాఖలో వింత పోకడలు రాజ్యమేలుతున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత నుంచి ఉపాధ్యాయులపై అదనపు భారం పడుతోంది. పదో తరగతిలో నూతన సంస్కరణల పేరుతో పలు ప్రత్యేక కార్యక్రమాలను అడ్డగోలుగా చేపట్టడంతో విద్యావేత్తలు విస్తుపోతున్నారు. ఇన్విజిలేషన్‌ డ్యూటీలు, పరీక్షల్లో ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులను 25 శాతం మేర నియమించడం వంటి విధానాలను తెరపైకి తెచ్చారు. విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చామంటూ గొప్పలు చెబుతుండటంపై విమర్శలు వస్తున్నాయి.

ఆది నుంచి అదే తీరు...

విద్యార్థిగా ఉన్నత స్థాయికి ఎదిగాలంటే పదో తరగతి కీలకం. అలాంటి విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించి చంద్రబాబు ప్రభుత్వం వింత నిర్ణయాలు తీసుకుంటోందని విద్యావేత్తలు విమర్శలు చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తీర్ణతా శాతం పెంచేందుకు వంద రోజుల ప్రణాళికను తీసుకువచ్చారు. డిసెంబర్‌ నుంచి ప్రారంభమైన కార్యక్రమంలో పాఠశాలలకు ఇతర శాఖల అధికారులను నియమించారు. విద్యార్థులు ఏ విధంగా చదువుతున్నారు, ప్రణాళిక అమలు తీరుపై వారు పర్యవేక్షణ చేశారు. విద్యాశాఖపై పరాయి పెత్తనం ఏమిటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. స్కూల్‌కు రాని విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించి విద్యాశాఖ అధికారులు విద్యార్థుల ఇంటికి వెళ్లి తల్లిదండ్రులతో మాట్లాడి వారొచ్చేలా చర్యలు తీసుకున్నారు. మరో అడుగు ముందుకేసి పరీక్షల్లో, హాజరు శాతంలో తక్కువగా ఉన్న విద్యార్థులను గుర్తించారు. డివిజన్‌ వారీగా రెసిడెన్షియల్‌ శిక్షణ పేరుతో సీ, డీ గ్రేడ్‌ విద్యార్థులను ప్రత్యేకంగా హాస్టల్‌ తరహాలో ఉంచి శిక్షణ అందించారు. లోటుపాట్లు తెలుసుకోకుండా ఏర్పాటు చేయడం వలన క్రమంగా విద్యార్థుల సంఖ్య తగ్గిపోయింది. వెనుబడి ఉన్న విద్యార్థులను గుర్తించి ప్రత్యేకంగా చదివించడం, ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం వలన ఎంతో ప్రయోజనం కలుగుతుంది. పాఠశాల నుంచి దూరంగా వేరే చోట ఉంచి చదివించడం, వేర్వేరు పాఠశాలల నుంచి వచ్చిన వారందరిని ఒక చోట ఉంచడం వలన కొత్తవారితో ఇమడలేక విద్యార్థులు మానసికంగా ఒత్తిడికి గురయ్యారు. పైలట్‌ ప్రాజెక్టుగా ఒక మండలంలో అమలు చేయకుండా రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయడంపై పలు విమర్శలు వెల్లువెత్తాయి.

విజయవాడ నుంచి విధుల కేటాయింపు

దశాబ్దాలుగా పదవ తరగతి పరీక్షలకు సంబంధించి ఆయా జిల్లాల విద్యాశాఖాధికారుల పర్యవేక్షణలో సీనియార్టీ ఆధారంగా విధులు కేటాయించారు. ఈ ఏడాది డీఈఓలకు సంబంధం లేకుండా విజయవాడ కమిషనరేట్‌ నుంచే డ్యూటీల కేటాయింపునకు శ్రీకారం చుట్టారు. లీప్‌ యాప్‌ ద్వారా డిజిటల్‌ పద్ధతిలో ఉపాధ్యాయులకు డ్యూటీలు వేశారు. తమకు ఏ సెంటర్‌లో డ్యూటీలు ఇచ్చారు, సీఎస్‌గా, డీఓగా, ఏడీఓగా డ్యూటీల కేటాయింపులను యాప్‌లోనే చూసుకున్నారు. పలు తప్పిదాలు కనిపించడంతో ఉపాధ్యాయులు గగ్గోలు పెట్టారు. డ్యూటీలు పారదర్శకంగా కనిపించలేదని వాపోయారు. గతంలో డీఈఓ కార్యాలయం నుంచి డ్యూటీలు వేయగా అనారోగ్య సమస్యలున్న వారు మార్చుకునే వెసులుబాటు ఉండేది. కమిషనర్‌ ఆఫీస్‌ నుంచే డ్యూటీలు వేయడంతో మార్చుకునేందుకు వీలు లేకుండా పోయింది. పది కిలోమీటర్ల పరిధిలో సెంటర్లకు చీఫ్‌లుగా నియమించాలనే నిబంధన ఉన్నా దాదాపు 18–20 కిలోమీటర్ల దూరంలో ఉన్నవారిని కూడా పలు సెంటర్లలో చీఫ్‌లుగా వేశారు. దీంతో ఉరుకులుపరుగులు పెడుతూ డ్యూటీలు చేయాల్సి వస్తుందని వారు వాపోతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement