టీడీపీ నేతల ఫ్లెక్సీల జోలికి వెళ్లని అధికారులు వ్యాపార సంస్థల ముందు అడ్డుగా ఏర్పాటు అధికారుల తీరుపై వ్యాపారులు, నేతల ఆగ్రహం
రేపల్లె: రేపల్లె పట్టణంలో అధికారుల వ్యవహారశైలి వివాదాస్పదంగా మారుతోంది. అధికారంలో ఉన్న టీడీపీ నాయకుల అడుగులకు మడుగులు ఒత్తుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వైఎస్సార్ సీపీ ఫ్లెక్సీలను తొలగించగా, టీడీపీ ఫ్లెక్సీల జోలికి మాత్రం వెళ్లకపోవడం చర్చనీయాంశమైంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త పీటా నాగమోహన్ కృష్ణకు స్వాగతం పలుకుతూ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను 24 గంటలు గడవక ముందే తొలగించారు.
ఆందోళనలో వ్యాపారులు
నూతన సంవత్సరం, సంక్రాంతి తదితర పండుగలను పురస్కరించుకుని పట్టణంలో టీడీపీ నాయకుల ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. పలు వ్యాపార దుకాణాల ఎదుట ఈ భారీ ఫ్లెక్సీలు వెలిశాయి. భారీ ఫ్లెక్సీల కారణంగా దుకాణాలు మూసుకుపోయి వ్యాపారాలు జరగటంలేదని వ్యాపారులు లబోదిబోమంటున్నారు. నెలలు గడుస్తున్నా వాటిని తొలగించకపోవటంతో ఆందోళన చెందుతున్నారు. ఆదివారం కేవలం వైఎస్సార్ సీపీ ఫ్లెక్సీలను మాత్రం తొలగించి అత్యుత్సాహం చూపటంపై పట్టణ ప్రజలు, ప్రజాసంఘాలు విమర్శలు వ్యక్తం చేస్తున్నాయి. ఓల్డ్ టౌన్ నుంచి ఇసుకపల్లి వరకు వైఎస్సార్ సీపీ అభిమానులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల తొలగింపుపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఒకే పార్టీకి చెందిన ఫ్లెక్సీలను మాత్రమే తొలగించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని విమర్శించారు. అన్ని పార్టీల విషయంలో నిబంధనలు ఒకేలా అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.


