సురక్షితంగా అప్పగించిన రూరల్ పోలీసులు
చీరాల: కనబడకుండా పోయిన కొడుకు, కోడలు, ఎనిమిది నెలల బాబును ఈపూరుపాలెం పోలీసులు తిరిగి తండ్రి చెంతకు చేర్చారు. ఈ మేరకు శుక్రవారం ఈపూరుపాలెం ఎస్సై ఎ.చంద్రశేఖర్ వివరాలను వెల్లడించారు. కొడుకు, కోడలు, ఎనిమిది నెలల బాబుతో సహా కనబడటం లేదని చీరాల మండలం వాడరేవుకు చెందిన అర్జీలి నూకరాజు సోమవారం ఎస్పీకి ఫిర్యాదు చేశారన్నారు. ఈ మేరకు రూరల్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసి రెండు బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేశామన్నారు. గురువారం కాకినాడ సమీపంలోని వారి స్వగ్రామమైన దుమ్ములిపేట గ్రామంలో ఉన్నట్లు కనుగొని వారిని సురక్షితంగా చీరాల రూరల్ పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చామని తెలిపారు. కొడుకు, కోడలు బతుకుదెరువు కోసం ఇంటిలో ఎవరికి చెప్పకుండా వెళ్లిపోయారని తెలిపారు. బతుకుదెరువు కోసం తెలంగాణ రాష్ట్రానికి వెళ్లి తిరిగి స్వగ్రామానికి వచ్చారన్నారు. ఈ విషయంపై డీఎస్పీ ఎండీ మొయిన్ వారితో మాట్లాడారు. కొడుకు, కోడలు ఎనిమిది నెలల బాబుతో సహా సురక్షితంగా అప్పగించడంపై అతని తండ్రి పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.


