కలెక్టర్ వి.వినోద్‌కుమార్ చీరాలలో జిల్లా స్థాయి గ్రీవెన్స్ వివిధ సమస్యలపై 296 అర్జీలు దాఖలు
కలెక్టర్‌తో వ్యక్తి అనుచిత ప్రవర్తన
చీరాల: ప్రజా సమస్యలను క్షేత్ర స్థాయిలో పరిశీలించి, పరిష్కరించేందుకు నియోజకవర్గ కేంద్రాల్లోనే గ్రీవెన్స్ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ డాక్టర్ వి.వినోద్‌కుమార్ పేర్కొన్నారు. సోమవారం చీరాల మున్సిపల్ కార్యాలయంలో జిల్లా స్థాయి గ్రీవెన్స్ నిర్వహించారు. కలెక్టర్‌తోపాటు స్థానిక ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య, జాయింట్ కలెక్టర్ భావన, డీఆర్‌ఓ జి.గంగాధర్ గౌడ్ తదితరులు పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. అర్జీదారుల ఇబ్బందుల దృష్ట్యా ప్రతి సోమవారం ఒక్కో రెవెన్యూ డివిజన్ కేంద్రం, నియోజకవర్గ కేంద్రంలో గ్రీవెన్స్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. చీరాలలో వివిధ రకాల సమస్యలపై 296 అర్జీలు అందాయని, క్షేత్ర స్థాయిలో సంబంధిత అధికారులు పరిశీలించి నెల రోజుల్లోగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. వేసవి కాలంలో జిల్లాలో తాగునీటి సమస్య లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
వైఎస్సార్ విగ్రహం చుట్టూ ఫ్లెక్సీలు తొలగించాలి..
చీరాల గడియార స్తంభం సెంటర్‌లోని డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి కాంస్య విగ్రహ ప్రాంగణం చుట్టూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు తొలగించేలా చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ సీపీ పట్టణ అధ్యక్షుడు యాతం మేరిబాబు, మాజీ వైస్ చైర్మన్ బొనిగల జైసన్‌బాబు, జిల్లా వాణిజ్య విభాం అధ్యక్షుడు చీమకుర్తి బాలకృష్ణ, జిల్లా యువజనవిభాగం ఉపాధ్యక్షులు కోడూరి ప్రసాద్‌రెడ్డి, జిల్లా విద్యార్థి విభాగం ఉపాధ్యక్షులు గోసాల అశోక్ తదితరులు కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ వెంటనే అక్కడ ఉన్న ఫ్లెక్సీలను తొలగించాలని చీరాల డీఎస్పీ ఎండీ మొయిన్‌ను ఆదేశించారు.
అర్హులకు ఆటోనగర్‌లో స్థలాలివ్వాలి
ఆటోనగర్ స్థలాల కోసం గతంలో డీడీ చెల్లించినవారిని అర్హులుగా గుర్తించి న్యాయం చేయాలని ది చీరాల తాలూకా ఆటోమోబైల్ వర్కర్స్ యూనియన్ నాయకులు కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు. కొందరు స్థానికులు ఈ భూమి తమదని కోర్టుకు వెళ్లడంతో పనులు ఆగిపోయాయన్నారు. 2017లో కోర్టులో తమకు అనుకూలంగా తీర్పు వచ్చిందన్నారు. గత రెండేళ్లుగా ఆటోమొబైల్ వర్కర్స్‌ను సంప్రదించకుండా కొందరు వ్యక్తులు ఏపీఐఐసీతో లాలూచీ పడి కొందరికి స్థలాలు అక్రమంగా కట్టబెట్టారన్నారు. ఈ విషయమై పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా న్యాయం చేయలేదని, నిరుపేదలైన కార్మికులకు ఒక్కొక్కరికి ఒక్కో ప్లాటు కేటాయించి మిగిలిన నిర్మాణాలు ఆపివేయాలని వినతిపత్రంలో కోరారు.
శీలం రవి అరాచకాలను అరికట్టాలి
చీరాల 32వ వార్డులో సామాజిక కార్యకర్త అని చెప్పుకుంటూ శీలం రవి అనే వ్యక్తి వ్యక్తిగత కక్షతో, కుట్రపూరితంగా సచివాలయం సిబ్బంది, మున్సిపల్ అధికారులకు తప్పుడు ఫిర్యాదులు చేస్తున్నాడని వార్డు ప్రజలు కలెక్టర్‌ను వేడుకున్నారు. వినతిపత్రం అందించిన వారిలో గోసాల అశోక్, ఆదిశేషు, ఉప్పు సంతమ్మ, తోటపల్లి రూతమ్మ, సుభాషిణి, అల్లడి స్వరూప ఉన్నారు.
చీరాల: స్థానిక మున్సిపల్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో కలెక్టర్ వినోద్‌కుమార్ ఎదుట అనుచితంగా ప్రవర్తించిన ఎస్.దేవరాజ్ అనే వ్యక్తిపై చీరాల ఒన్‌టౌన్ పోలీసులు బైండోవర్ కేసు నమోదు చేశారు. చీరాల ఆర్డీవో టి.చంద్రశేఖర్ నాయుడు ఎదుట నిందితుడిని హాజరుపర్చినట్లు సీఐ సుబ్బారావు తెలిపారు.


