కొల్లూరు : అనుబంధాలు.. ఆప్యాయతలు.. కష్ట, సుఖాలలో పాలు పంచుకునే మానవ జీవనానికి సెల్ ఫోన్ శరాఘాతంగా మారింది. వ్యక్తిగత జీవనంలో సెల్ ఫోన్ అంతర్భాగంగా మారిపోయిన ప్రస్తుత పరిస్థితుల్లో సెల్‌ఫోనే సర్వస్వం అన్న తరహాలో వ్యక్తుల జీవన శైలి కొనసాగుతుంది. మానవ సంబంధాలకు గండికొడుతూ, అనుబంధాలకు ఆప్యాయతలకు సెల్లు చీటీ పలుకుతున్న సెల్ ఫోన్‌ను అవసరానికి మించి వినియోగించడానికి నేటి సమాజం ప్రాధాన్యత ఇవ్వడంతో మానవ సంబంధాలకు క్రమక్రమంగా విలువ తరగిపోయే ప్రమాదం పొంచి ఉంది. సెల్ ఫోన్ వినియోగం, సాంకేతికత పెరిగిన తరుణంలో శుభ, అశుభ కార్యాల పిలుపులు సైతం వాట్సాప్‌లకు పరిమితమైపోవడంతో, నోరారా పిలుపులు వినిపించకుండా సెల్ ఫోన్ ఆహ్వానాలతో సరిపెట్టాల్చిన పరిస్థితి దాపురించింది. మానవ జీవితంలో పాత కాలపు గురుతులు.. సెల్ ఫోన్‌కు బానిసగా మారిన నేటి యువత జీవన విధానానికి అద్దం పట్టే విధంగా ‘సాక్షి’ కెమెరా క్లిక్ మనిపించింది. ఒకే ప్రాంతంలో సెల్‌ఫోన్ పరిజ్ఞానం లేని వృద్ధ మహిళలు ఖాళీ సమయంలో ఒక చోటకు చేరి కష్ట, సుఖాల నుంచి ఓదార్పుగా అనుబంధాలు, ఆప్యాయతలకు ఆదర్శంగా సంప్రదాయ ఆటతో కాలక్షేపం చేస్తుంటే, మరో పక్క అదే ప్రాంతంలో సెల్ ఫోన్ వినియోగించే యవత మాత్రం ఈ లోకంతో పొంతన లేని విధంగా సెల్ ఫోన్‌లో మమేకమైపోయారు.


