అమరావతి: నదిలో స్నానానికని వెళ్లి విద్యార్థి గల్లంతయిన సంఘటన సోమవారం దిడుగులో చోటు చేసుకుంది. పోలీసులు అందించిన సమాచారం మేరకు మండల పరిధిలోని దిడుగు గ్రామానికి చెందిన శీలం నందగోపాల్ మధ్యాహ్న సమయంలో తన స్నేహితులతో కలిసి కృష్ణానదిలోకి స్నానానికి వెళ్లారు. స్నానానికి దిగిన ఏడుగురులో శీలం నందగోపాల్ లోతుకు వెళ్లటంతో ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయాడు స్థానికుల ద్వారా సమాచారం తెలుసుకున్న సీఐ అచ్చియ్య తన సిబ్బందితో సంఘటన స్థలాన్ని పరిశీలించి గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. సోమవారం రాత్రి వరకు ఎంతగా గాలించినా నందగోపాల్ జాడ తెలియలేదు. చీకటి పడి గాలింపు చర్యలు కష్టంగా ఉండటంతో మంగళవారం ఉదయాన్నే మళ్లీ గాలింపు చర్యలు చేపడతామని సీఐ తెలిపారు. నందగోపాల్ కుటుంబ సభ్యులు, బంధువులు నదిఒడ్డున గుండెలవిసేలా విలపించటం గ్రామస్తులను కలిచివేసింది.


