అక్రమ వసూళ్లు | - | Sakshi
Sakshi News home page

అక్రమ వసూళ్లు

Jan 23 2026 6:51 AM | Updated on Jan 23 2026 6:51 AM

అక్రమ వసూళ్లు

అక్రమ వసూళ్లు

అక్రమ వసూళ్లు

సాక్షి టాస్క్‌ఫోర్స్‌: చుండూరుకు చెందిన గుదేటి బాలకోటిరెడ్డి టీడీపీలో తొలుత సాధారణ కార్యకర్త. ప్రస్తుతం బాపట్ల జిల్లా పార్టీ కార్యదర్శిగా ఎదిగాడు. పదవితోపాటే అతడి ఆగడాలు, అరాచకాలు పెరుగుతూ వచ్చాయి. ఇందుకు వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు అండదండలు ఉన్నాయని నియోజకవర్గంలో దాదాపు అందరికీ తెలుసు. టీడీపీ ప్రధాన కార్యాలయంపై 2020లో జరిగిన దాడితో బాలకోటిరెడ్డి వెలుగులోకి వచ్చాడు. వైఎస్సార్‌సీపీ అధినేత, అప్పటి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిపై బాలకోటిరెడ్డి విమర్శలు చేశాడు. పత్రికల్లో రాయలేని విధంగా దుర్భాషలాడుతూ చెలరేగిపోయాడు. ఆయన వ్యాఖ్యలను పచ్చ మీడియా ప్రముఖంగా ప్రసారం చేసింది.

ముఠా ఏర్పాటు చేసుకుని మరీ..

మండలంలోని ఒక్కో కులానికి చెందిన ఇద్దరు, ముగ్గురు చొప్పున యువకులను దగ్గరకు చేర్చుకుని తనకు తానే బాస్‌ అయ్యాడు. చిన్న చిన్న పంచాయితీలతో మొదలుపెట్టి ఆర్థిక అవసరాలను తీర్చుకోవటం మొదలుపెట్టాడు. భయానక వాతావరణం సృష్టించి, అందరినీ భయభ్రాంతులు చేయటం ద్వారా పబ్బం గడుపుకోవటం అలవరచుకున్నాడు. ఈ క్రమంలో 2023 జూన్‌లో మోదుకూరులో సొంత మేనత్త ఇంటిపైనే దాడి చేశాడు. మేనత్త కొడుకును కొట్టి, ఆ ఇంటిపై పెట్రోలు బాంబులు వేశాడు. దీనిపై కేసు నమోదైంది. మండలంలోని ఓ గ్రామంలో పుట్టిన రోజు వేడుకలను జరుపుకొన్నపుడు బాలకోటిరెడ్డి కేక్‌ కట్‌ చేయకముందే కత్తితో, మరో అనుచరుడు గొడ్డలితో సవాళ్లు చేసిన వీడియో ఇప్పటికీ సోషల్‌మీడియాలో ఉంది. చుండూరు మండలంలో టీడీపీకి అతడో కీలక వ్యక్తి అయ్యాడు. అధికార పార్టీ అవసరాలకు నాయకులు అతడిని చేరదీశారు.

అధికారమే అండగా...

చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రౌడీషీటర్‌ బాలకోటిరెడ్డి మరింత రెచ్చిపోతున్నాడు. వైఎస్సార్‌సీపీ హయాంలో చుండూరులో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి త్రీమెన్‌ కమిటీ చైర్మన్‌గా వ్యవహరించిన రామిరెడ్డి సుబ్బారెడ్డిపై కొత్తపాలెం రోడ్డులో బాలకోటిరెడ్డి, అతడి అనుచరులు దాడి చేశారు. పోలీసు కేసు పెడితే చంపుతామని బెదిరించారు. సుబ్బారెడ్డి ఫిర్యాదును పోలీసులు తీసుకోకపోగా, పోలీసులే అతడిని తీసుకెళ్లి తాడేపల్లిలోని బంధువుల ఇంటి వద్ద విడిచిపెట్టారు. మళ్లీ ఊరిలోకి రావొద్దని ఉచిత సలహా ఇచ్చారు. గత డిసెంబరు 24వ తేదీ రాత్రి అధిక లోడుతో వెళుతున్న లారీ రోడ్డు మార్జినులో ఒరిగింది. ట్రాఫిక్‌ రద్దీ ఏర్పడింది. అటుగా కారులో వెళుతున్న చుండూరు సీఐ ఆనందరావు కారు ఆపి దిగారు. ఎదురుగా వస్తున్న బాలకోటిరెడ్డి తన వాహనంలో దూసుకొచ్చాడు. ‘కారు రోడ్డు మీద ఆపిందెవర్రా’ అంటూ గద్దించాడు. ఆ సమయంలో సీఐతో వాగ్వాదం జరిగింది. ఆ క్రమంలో సీఐ కాలర్‌ను పట్టుకున్నాడని ప్రచారం జరిగింది. పైగా సీఐపైనే పోలీస్‌స్టేషనులో ఎదురు కేసు పెట్టటం గమనార్హం. దీనిపై చుండూరు మండలంలో పెద్ద చర్చ నడిచింది.

కోడి పందేల నిర్వహణ

సంక్రాంతి కోడిపందేలు బాలకోటిరెడ్డికి కలిసొచ్చాయి. కొత్తనారికేళ్లపల్లికి దగ్గర్లోనే బరులు ఏర్పాటు చేశాడు. బరి దగ్గరకు ప్రవేశం కూడా టాక్‌ ఆఫ్‌ ది మండల్‌ అయింది. ముందు ఒక వాహనంలో సెక్యూరిటీ వాళ్లు, తర్వాత వాహనంలో గన్‌మెన్‌ వచ్చాక మూడో వాహనంలో రంగప్రవేశం చేయటం చూసి, అంతా ముక్కున వేలేసుకున్నారట! కోడిపందేలకు బౌన్సర్లనూ నియమించుకున్నాడు. ఆ పందేల తర్వాతనే కొత్తనారికేళపల్లి సర్పంచ్‌పై దాడికి దిగాడు. ఆ చిన్న గ్రామంలోని యాదవ వర్గీయుల్లో పార్టీల విభేదాలను ఆసరాగా తీసుకుని, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన సర్పంచ్‌ ఇంటిపై అనుచరులతో దాడికి తెగబడ్టాడు. ఆ రోజుతో సర్పంచ్‌ వర్గమంతా గ్రామాన్ని విడిచివెళ్లింది. దాడికి ముందు, తర్వాత కూడా రేపల్లె డీఎస్పీతో ఫోనులో మాట్లాడాడు. ఆ కాల్‌ హిస్టరీని, డీఎస్పీతో ఆర్థిక లావాదేవీలను బహిర్గతం చేయటం ద్వారా తనను ఈ కేసులోంచి బయటకు తేవాలని పోలీసు అధికారులను బ్లాక్‌ మెయిల్‌ చేసినట్టేనని చెబుతున్నారు. ఇకనైనా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

మండలంలో రేషను బియ్యాన్ని కొనుగోలు చేసి రీసైక్లింగ్‌తో విక్రయిస్తుండే ఒక రైస్‌మిల్లరు నుంచి నెలకు రూ.లక్షకుపైగా మామూళ్లను బాలకోటిరెడ్డి వసూలు చేస్తారని చెబుతారు. మామూళ్లు అందటం ఆలస్యమైతే అసలు సహించడట! అలా జరిగితే మిల్లుకు వెళ్లే విద్యుత్‌ సరఫరా ఆపించిన ఘనుడని చెప్పుకొంటారు. దీంతోపాటు ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వంలో చుండూరులోని సిండికేట్‌ చేసిన నాలుగు మద్యం షాపుల్లోనూ ప్రధాన వాటాదారుడని సమాచారం. వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు ఆశీస్సులు ఉండటం, పోలీసు అధికారుల సహవాసం, కావాల్సిన ఆదాయం అందుబాటులో ఉండటంతో తన అరాచకాలను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement