న్యాయమూర్తులకు శిక్షణ కార్యక్రమం
గుంటూరు లీగల్: మధ్యవర్తిత్వంపై 40 గంటల శిక్షణా కార్యక్రమం కొనసాగుతోంది. దీనిలో భాగంగా స్థానిక కోర్టుల ప్రాంగణంలో గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. సుప్రీంకోర్టు మీడియేషన్, కాన్సిలియేషన్ ప్రాజెక్ట్ కమిటీ నియమించిన శిక్షకులు శ్రీలాల్ వారియర్, మిస్ నీనా ఖరే ట్రైనీ అడ్వకేట్‌లు గుంటూరు జిల్లా న్యాయమూర్తులకు మీడియేషన్‌పై అవగాహన కల్పించారు. సుప్రీంకోర్టు మీడియేషన్, కన్సిలియేషన్ ప్రాజెక్ట్ కమిటీ, న్యూఢిల్లీ.. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ, అమరావతి ఆదేశాల మేరకు గుంటూరు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ఎంపిక చేసిన న్యాయవాదులు, న్యాయమూర్తులు పాల్గొన్నారు. మధ్యవర్తిత్వం అనేది పూర్తిగా కక్షిదారుల స్వచ్ఛంద ప్రక్రియ అన్నారు. సమస్య పరిష్కారంలో కక్షిదారులే కీలక పాత్ర దారులని, మధ్యవర్తిత్వంలో కక్షిదారుల ప్రయోజనాలకే ప్రాముఖ్యత ఉంటుందన్నారు. తమకు అనుకూలమైన రీతిలో కక్షిదారులు కేసులు పరిష్కారం చేసుకోవచ్చని తెలిపారు. మధ్యవర్తిత్వం ద్వారా కేసులు సెటిల్ అయితే కోర్టు ఫీజు రిటర్న్ ఇవ్వబడుతుందని, అగ్రిమెంట్ రాసుకుని సెటిల్ అయితే జడ్జిమెంట్ కూడా అదేవిధంగా ఇవ్వబడుతుందన్నారు. మధ్యవర్తిత్వం ద్వారా సెటిల్ అయిన కేసులపై ఎలాంటి అప్పీల్ ఉండదని మధ్యవర్తిత్వం ద్వారా కక్షిదారులు సమయాన్ని, డబ్బుని ఆదా చేసుకోవచ్చని తెలిపారు. బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వై.శివ సూర్య నారాయణ, ట్రైనర్లు, న్యాయవాదులు పాల్గొన్నారు.


