‘పచ్చ’ నేత వాటాల పంచాయితీ
తాగునీటి సరఫరా పథకం ఉన్నతాధికారి వద్ద ప్రజాప్రతినిధి బేరాలు జల్‌జీవన్ మిషన్ పనులలో పర్సంటేజీ పేరుతో రూ.కోటి డిమాండ్ ఇవ్వలేక సెలవుపెట్టి వెళ్లిపోయిన బాధిత ఉన్నతాధికారి రూ. 25 లక్షలు ఇచ్చిన రోడ్లు, భవనాల శాఖ యంత్రాంగం
మరో కారణం టెండర్లు ?
బాపట్ల జిల్లాకు చెందిన టీడీపీ ముఖ్య ప్రజాప్రతినిధి వసూళ్ల పర్వం చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం మంజూరు చేసే పనుల్లో తన వాటా చెల్లించాలంటూ అధికారులను వేధిస్తున్నారు. టెండర్లు పూర్తయిన పనులకు ముందస్తుగానే వాటాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రజాప్రతినిధి ఓఎస్‌డీని అంటూ చెబుతున్న వ్యక్తి ఈ వ్యవహారాన్ని పర్యవేక్షిస్తున్నట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి. తమ ప్రాంతంలో పనులకు రూ.కోటి వాటాగా చెల్లించాలని హుకుం జారీచేయడంతో ఒంగోలు తాగునీటి సరఫరా విభాగం ఎస్‌ఈ ఏకంగా సెలవుపెట్టి వెళ్లిపోయినట్లు ఆ శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి.
సాక్షి ప్రతినిధి, బాపట్ల: బాపట్ల జిల్లా (ఉమ్మడి ప్రకాశం జిల్లా) పరిధిలోని చీరాల, పర్చూరు, అద్దంకి నియోజకవర్గాల్లో గత ప్రభుత్వంలోనే కాక తాజాగా జల్‌జీవన్ మిషన్ కింద తాగునీటి సరఫరా విభాగంలో రూ.కోట్లాది విలువైన పనులు మంజూరయ్యాయి. ఒక్క తాగునీటి సరఫరా విభాగంలో సుమారు రూ. 85 కోట్ల మేర పనులు జరిగినట్లు సమాచారం. రోడ్లు భవనాల శాఖ, పంచాయతీరాజ్, సాగునీటి వనరులు తదితర శాఖల పరిధిలోనూ వైఎస్ జగన్ ప్రభుత్వంతోపాటు తాజాగా రూ.కోట్లు మంజూరవడంతో పనులు వివిధ దశల్లో ఉన్నాయి.
నగదు కోసం హెచ్చరికలు
ఈ పనులకు సంబంధించి తమకు రూ. కోట్లలో వాటా రావాలని ఓఎస్‌డీ చెప్పడంతో ఆ ప్రజాప్రతినిధి క్రిస్మస్ సమయంలో నెల్లూరు వెళ్లొస్తూ ఒంగోలు రోడ్ల భవనాల శాఖ అతిథిగృహంలో మకాం వేశారు. ఒంగోలు తాగునీటి సరఫరా విభాగం ఉన్నతాధికారి బాలశంకరరావుతోపాటు పంచాయతీ రాజ్, రోడ్లు భవనాల శాఖ అధికారులకు వర్తమానం పంపారు. విషయం ముందే పసిగట్టిన పంచాయతీ రాజ్ విభాగం అధికారి మాత్రం కలెక్టర్‌తో సమావేశం అంటూ తప్పించుకున్నారు. తమ పరిధిలో రూ. 85 కోట్ల పనులకుగానూ రూ. కోటి వాటా రావాలని పచ్చప్రజాప్రతినిధి సమక్షంలో ఓఎస్‌డీ బేరం ఆడారు. అంత ఇచ్చుకోలేనని బాలశంకరరావు చెప్పినట్లు సమాచారం. అందరి జాతకాలు తన వద్ద ఉన్నాయని, విజిలెన్స్ ఎంక్వయిరీ పెట్టిస్తానని బెదిరింపులకు దిగినట్లు తెలిసింది. చివరకు రూ. 50 లక్షలు ఇవ్వాలని బేరానికి వచ్చారు. తర్వాత వచ్చి కలుస్తానని చెప్పిన ఎస్‌ఈ బాలశంకరరావు... అక్కడి నుంచి మెల్లగా జారుకొని విషయం ప్రకాశం జిల్లా కలెక్టర్‌కు మొర పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితిలో పనిచేయలేనని చెప్పి వారం క్రితం ఆయన సెలవులో వెళ్లిపోయారు. ప్రజాప్రతినిధి తీరుతో తీవ్ర ఇబ్బంది పడుతున్నట్లు సమాచారం.
దీంతోపాటు ప్రకాశం జిల్లాలో వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో మంజూరు చేసిన పనుల్లో అప్పటి కాంట్రాక్టర్లను తప్పించి పచ్చ పార్టీ వారికి తిరిగి టెండర్లు కట్టబెట్టాలన్న నేతల ఒత్తిళ్లు పెరగడం కూడా తాగునీటి సరఫరా విభాగం ఎస్‌ఈ సెలవులో వెళ్లడానికి కారణంగా తెలుస్తోంది. బాలశంకర రావు 2024 నవంబర్ నుంచి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పనిచేశారు.
ఇక రోడ్ల భవనాల శాఖ విభాగం అధికారులు ఆ ప్రజాప్రతినిధికి రూ. 25 లక్షలు ముట్టజెప్పినట్లు ఆ విభాగంలో గుసగుసలు వినిపిస్తున్నాయి.


