తండ్రీకొడుకుల అరాచకాలు ఎంతోకాలం సాగవు
పిన్నెల్లి సోదరులపై 16 నెలల్లో 16 అక్రమ కేసులు మాజీ మంత్రి ఆర్‌కే రోజా ధ్వజం
వెంకటాచలం (పొదలకూరు): అధికారమనే అహంకారంతో తండ్రీ కొడుకులు బరితెగించి రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ అరాచకాలు సాగిస్తున్నారని, ఇవి ఎంతో కాలం సాగవని మాజీ మంత్రి ఆర్‌కే రోజా హెచ్చరించారు. వైఎస్సార్ సీపీ నేతలను ఏ రకంగా ఇబ్బంది పెడుతున్నారో.. రేపటి రోజున వీరికి అదే గతి పడుతుందని స్పష్టం చేశారు. టీడీపీ ప్రభుత్వం 16 నెలల పాలనలో పిన్నెల్లి సోదరులపై 16 అక్రమ కేసులను నమోదు చేయించి జైలు పాలు చేసిందని ధ్వజమెత్తారు. నెల్లూరు కేంద్ర కారాగారం రిమాండ్‌లో ఉన్న వైఎస్సార్ సీపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డిలను మంగళవారం రోజా , తెనాలి మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, పొన్నూరు సమన్వయకర్త అంబటి మురళీకృష్ణతో కలిసి ములాఖత్ అయ్యారు. అనంతరం జైలు వెలుపల రోజా మీడియాతో మాట్లాడుతూ టీడీపీ నాయకుల ఆధిపత్య పోరులో భాగంగా హత్యలు జరిగితే పిన్నెల్లి సోదరులపై హత్య కేసు నమోదు చేయడం దారుణమన్నారు. ఎన్నికల్లో టీడీపీ నాయకులు రిగ్గింగ్ చేస్తే అడ్డుకున్న పిన్నెల్లిపై కేసులు నమోదు చేసి జైలు పాలు చేశారని విమర్శించారు. జైల్లో సౌకర్యాలు కల్పించాలని కోర్టు ఆదేశించినా అమలు చేయించకుండా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నట్లు పేర్కొన్నారు.
ప్రజల మన్ననలు పొందిన కుటుంబం :
అంబటి మురళీకృష్ణ
మాచర్లలో ప్రజల మన్ననలు పొందిన కుటుంబం పిన్నెల్లి కుటుంబమని వైఎస్సార్ సీపీ పొన్నూరు సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ పేర్కొన్నారు. పిన్నెల్లి సుందరామిరెడ్డి, లక్ష్మారెడ్డి, రామకృష్ణారెడ్డి వరుసగా మాచర్లలో పోటీ చేసి గెలుపొందేవారన్నారు. టీడీపీ అక్కడ బలహీనంగా ఉండడంతో ప్రతి ఎన్నికల్లో అభ్యర్థిని మార్చేవరన్నారు. మాచర్లలో ఎలాగైనా పట్టుసాధించాలని పిన్నెల్లి సోదరులపై అక్రమ కేసులు బనాయిస్తున్నట్టు మండిపడ్డారు. ఈవీఎంల మాయాజాలం, పోలీసుల దమనకాండతో మాచర్లలో టీడీపీ విజయం సాధించినట్టు ఆరోపించారు. కోర్టు పిన్నెల్లి సోదరులకు ప్రత్యేక వసతులు కల్పించాలని ఆదేశించినా 27 రోజులుగా వారికి ఎలాంటి సౌకర్యాలు కల్పించలేదన్నారు.


