శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంచుకోవాలి
తాడేపల్లి రూరల్: క్రీడల ద్వారా యువత శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలని ఐఎఫ్‌ఎస్ అధికారిణి భరణి వ్యాఖ్యానించారు. మంగళవారం తాడేపల్లి రూరల్, వడ్డేశ్వరంలో మూడు రోజులుగా జరుగుతున్న సౌత్‌జోన్ ఇంటర్ యూనివర్శిటీ టోర్నమెంట్–2026 ముగింపు వేడుకలకు ఆమె ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా భరణి ప్రసంగిస్తూ క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ క్రీడల్లో కూడా సత్తా చాటాలని కోరారు. రానున్న కాలంలో కేఎల్‌యూ వేదికగా జాతీయ అంతర్జాతీయ క్రీడలు జరుగుతాయని తెలిపారు. కేఎల్‌యూ వైస్ చాన్స్‌లర్ డాక్టర్ జి.పార్ధసారధి వర్మ మాట్లాడుతూ కర్నాటకకు చెందిన జైన్ యూనివర్శిటీ ప్రథమ స్థానంలో, కేఎల్‌యూ ద్వితీయ స్థానం, చైన్నె ఎస్‌ఆర్‌ఎం యూనివర్శిటీ జట్టు తృతీయ, కేరళ కాలికట్ యూనివర్శిటీ నాల్గవ స్థానంలో నిలిచాయని పేర్కొన్నారు. అనంతరం పరిశ్రమల అథారిటీ మేనేజింగ్ డైరెక్టర్ శివజ్యోతి, ఐఎఫ్‌ఎస్ అధికారిణి భరణి విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలిండియా యూనివర్సిటీల పరిశీలకులు మనోజ్‌కుమార్, వర్శిటీ ప్రో వీసీలు డాక్టర్ ఏవీఎస్ ప్రసాద్, డాక్టర్ ఎన్.వెంకట్‌రామ్, డాక్టర్ కె.రాజశేఖరరావు, రిజిస్ట్రార్ డాక్టర్ కె.సుబ్బారావు, క్రీడల డైరెక్టర్ డాక్టర్ కె.హరికిషోర్, విద్యార్థి సంక్షేమ విభాగం ఇన్‌చార్జి డీన్ డాక్టర్ కేఆర్‌ఎస్ ప్రసాద్, సలహాదారు డాక్టర్ హబీబుల్లా ఖాన్, వ్యాయామ అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.


