అర్జీలను త్వరితగతిన పరిష్కరించండి | - | Sakshi
Sakshi News home page

అర్జీలను త్వరితగతిన పరిష్కరించండి

Jan 6 2026 7:30 AM | Updated on Jan 6 2026 7:30 AM

అర్జీలను త్వరితగతిన పరిష్కరించండి

అర్జీలను త్వరితగతిన పరిష్కరించండి

● జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వి.వినోద్‌కుమార్‌ ● 166 అర్జీలు స్వీకరణ

గ్రామీణ ప్రజల అభ్యున్నతికి చట్టాలు సరళీకృతం

బాపట్ల: ప్రజా పరిష్కార వేదికలో వచ్చే అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వి.వినోద్‌కుమార్‌ పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో ప్రజాసమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్‌ఎస్‌) నిర్వహించారు. కలెక్టర్‌ ఇతర అధికారులతో కలసి 166 అర్జీలను స్వీకరించారు. శాఖాపరమైన వాటిని పరిష్కరించాలని కలెక్టర్‌ సూచించారు.

రెవెన్యూ క్లినిక్‌లు సమర్థంగా నిర్వహించాలి

రెవెన్యూ క్లినిక్‌లు సమర్థంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వినోద్‌కుమార్‌ తెలిపారు. ‘రెవెన్యూ క్లినిక్‌’ కార్యక్రమాలను జిల్లా వ్యాప్తంగా ప్రారంభించామని తెలిపారు. కలెక్టరేట్‌లో ఏర్పాటుచేసిన రెవెన్యూ క్లినిక్‌ శిబిరాలను కలెక్టర్‌ పరిశీలించారు. రెవెన్యూ సమస్యలపై ప్రజల నుంచి వస్తున్న అర్జీల ను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని ఆదేశించారు. రెవెన్యూ క్లినిక్‌లపై ఆర్డీఓలు ప్రతి సోమ వారం ఒక్కొక్క గ్రామానికి వెళ్లాలని సూచించారు. ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించాలన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంచిన రెవెన్యూ దస్త్రాలు, వాటి పరిష్కారం ప్రక్రియ పై వివరాలు అడిగి తెలుసుకున్నారు. రెవెన్యూ సమస్యలు పూర్తిగా పరిష్కరించడమే ప్రభుత్వ ముఖ్యద్దేశం అన్నారు. ప్రజలు ఈ అవకాశాల ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో డీఆర్వో జి గంగాధర్‌గౌడ్‌, ఉప కలెక్టర్‌ లవన్న, కలెక్టరేట్‌ ఏఓ మల్లికార్జునరావు పాల్గొన్నారు.

విస్తృతంగా గ్రామసభలు నిర్వహించండి

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును ‘వికసిత్‌ భారత్‌–జీ రామ్‌జీ’గా మార్పు చేసిన నేపథ్యంలో గ్రామసభలు విస్తృతంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వి.వినోద్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు. ‘వికసిత్‌ భారత్‌–జీ రామ్‌జీ’ పథకంపై రూపొందించిన పోస్టర్‌లు, కరపత్రాలను కలెక్టర్‌ విడుదల చేశారు. కలెక్టర్‌ మాట్లాడుతూ పథకం పేరు మార్చిన విషయాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. 125 రోజులు ఉపాధి కల్పించడమే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు. అర్జీలను నాణ్యతతో పరిష్కరించాలని అన్నారు. పీజీఆర్‌ఎస్‌ అర్జీలపై సక్రమంగా ఆడిట్‌ నిర్వహించాలన్నారు. ప్రజలను కార్యాలయాల చుట్టూ తిప్పించుకోరాదని సూచించారు. గత నెలలో బాపట్ల జిల్లాలో 1,009 అర్జీలు నమోదయ్యాయన్నారు. ఇప్పటివరకు రెవెన్యూ శాఖలోనే అత్యధికంగా వచ్చాయన్నారు. ఏపీఎస్‌ఆర్టీసీ, విద్యుత్‌ శాఖలో డిసెంబర్‌ నెల మొత్తం మీద ఒకటి కూడా నమోదు కాకపోవడం ఏమిటని అధికారులను నిలదీశారు. ప్రభుత్వ ఉద్యోగులంతా తప్పనిసరిగా ఐజిఓటీలో నైపుణ్య శిక్షణలు పొందాలని కలెక్టర్‌ చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగుల నైపుణ్యాలను మెరుగు దిద్దడానికే రాష్ట్ర ప్రభుత్వం ఐజిఓటి ద్వారా ఆన్‌లైన్‌ శిక్షణలు ఇస్తుందన్నారు. ఓటర్ల జాబితా తయారీలో దరఖాస్తులు పెండింగ్‌లో లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎన్నికల కమిషన్‌ మార్గదర్శకాలను అనుసరించి ఆర్వోలు పనిచేయాలని ఆదేశించారు. రెడ్‌క్రాస్‌ సభ్యత్వ నమో దు పెంచాలన్నారు. కార్యక్రమంలో జిల్లా సంయుక్త కలెక్టర్‌ భావన విశిష్ట, డీఆర్వో జి.గంగాధర్‌గౌడ్‌, ఉప కలెక్టర్‌ లవన్న, వీక్షణ సమావేశం ద్వారా ఆర్డీఓలు, తహసీల్దార్‌లు, ఎంపీడీవోలు పాల్గొన్నారు.

ఉపాధి హామీ పనులలో మొక్కలు నాట్టాలి

ఉపాధి హామీ పనులలో భాగంగా చెరువు కట్టలు, రహదారుల వెంట విరివిగా మొక్కలు నాటించాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వినోద్‌ కుమార్‌ తెలిపారు. ఉపాధి హామీ పథకం అభివృద్ధి పనుల అమలు తీరుపై అనుబంధ శాఖల జిల్లా అధికారులు, మండల స్థాయి అధికారులతో సోమవారం ఆయన వీక్షణ సమావేశం నిర్వహించారు. చెరువు కట్టలపై ఖచ్చితంగా కొబ్బరి మొక్కలు నాటాలని సూచించారు. అధిక పోషకాలు, బహుళ ప్రయోజనాలున్న 23,599 మునగ మొక్కలను 95 ఎకరాలలో నాటించడం లక్ష్యంగా నిర్దేశించామన్నారు. కచ్చితంగా లక్ష్యాలు చేరుకోవాలన్నారు. 541.69 ఎకరాలలో ఉద్యాన పంటలు వేయాలని లక్ష్యం కాగా, ప్రస్తుతం 387.49 ఎకరాలలోనే పంటల సాగయ్యాయన్నారు. మిగిలిన 154.2 ఎకరాలలో ఉద్యాన పంటలు సాగు త్వరగా పూర్తి చేయాలన్నారు. సమావేశంలో డ్వామా పీడీ విజయలక్ష్మి, గృహ నిర్మాణ శాఖ పీడీ వెంకటేశ్వర్లు, పశుసంవర్ధక శాఖ జెడీ వేణుగోపాల్‌, మండల స్థాయి అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ భవనాలకు భూమిని కేటాయించాలి

జిల్లా కేంద్రంతో పాటుగా రెవెన్యూ డివిజన్ల పరిధిలో వివిధ ప్రభుత్వ కార్యాలయ భవనాల నిర్మాణాల కోసం భూమిని త్వరగా కేటాయించాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వినోద్‌కుమార్‌.వి అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్‌లోని న్యూ వీడియో కాన్ఫరెనన్స్‌లో జాయింట్‌ కలెక్టర్‌ భావన, డీఆర్వో జి.గంగాధర్‌గౌడ్‌, బాపట్ల, చీరాల, రేపల్లె రెవెన్యూ డివిజన్ల అధికారులు, తహసీల్దార్లు, పోలీస్‌ సంబంధిత శాఖల జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. నల్లమడ కాలువ ఆధునికీకరణకు భూమి త్వరగా సేకరించాలన్నారు. భారత తీర ప్రాంత భద్రత కేంద్రానికి భూమి కేటాయింపులు వేగంగా పూర్తి చేయాలన్నారు. ప్రభుత్వ హిల్‌ పోరంబోకు భూములను గుర్తించాలని ఆర్డీఓలను ఆదేశించారు. సమావేశంలో వీడియో కాన్ఫరెనన్స్‌లో బాపట్ల, చీరాల, రేపల్లె ఆర్డీవోలు, తహసీల్దార్లు, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

గ్రామీణ ప్రాంత ప్రజల అభ్యున్నతికి ప్రభుత్వం పలు చట్టాలను సరళీకృతం చేసిందని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వి వినోద్‌ కుమార్‌ తెలిపారు. స్థానిక కలెక్టరేట్‌లోని వీక్షణ సమావేశ మందిరంలో సోమవారం గ్రామపంచాయతీలలో గ్రామసభల నిర్వహణపై కలెక్టర్‌ పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లాలోని 354 గ్రామపంచాయతీలలో రెండు గ్రామసభలు నిర్వహించినట్లు తెలిపారు. గ్రామపంచాయతీలలో ఇంటి పన్నులు, ఇతర పన్నులు కేవలం స్వర్ణ పంచాయతీ పోర్టల్‌ ద్వారా వసూలు చేస్తామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement