టెన్త్ పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత సాధించాలి
డీఈఓ డి.శ్రీనివాసరావు
చీరాల: పదవ తరగతి పరీక్షల్లో విద్యార్థులందరూ మంచి ఉత్తీర్ణత సాధించి పాఠశాలకు, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని జిల్లా విద్యాశాఖాధికారి డి.శ్రీనివాసరావు అన్నారు. సోమవారం చీరాల మండలం వాడరేవులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆయన సందర్శించారు. పాఠశాల ఆవరణలో ఉన్న ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలలను ఆయన పరిశీలించారు. మొత్తం వెయ్యి మంది విద్యార్థులున్నట్లు గమనించారు. అయితే విద్యార్థుల సంఖ్యకు తగిన విధంగా మరుగుదొడ్లు లేవని అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని పాఠశాలకు అవసరమైన మరుగుదొడ్లు, వంటశాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అనంతరం పదవ తరగతి విద్యార్థుల కోసం అమలు చేస్తున్న వంద రోజుల ప్రత్యేక కార్యక్రమంపై ఆరా తీశారు. ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయులు కౌతవరపు శ్రీనివాసరావు మాట్లాడుతూ మొత్తం 73 మంది పదవ తరగతి విద్యార్థులలో ఒక విద్యార్థిని గత రెండు నెలలుగా పాఠశాలకు హాజరు కావడం లేదని, ఆంగ్ల ఉపాధ్యాయుడు పలుమార్లు ఆమె ఇంటికి వెళ్లి పాఠశాలకు రావాలని ప్రోత్సహించినట్లు తెలిపారు. స్పందించిన డీఈఓ విద్యార్థిని ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. అనంతరం విద్యార్థినిని పిలిపించి కౌన్సెలింగ్ ఇవ్వగా పాఠశాలకు క్రమం తప్పకుండా హాజరవుతానని హామీ ఇచ్చింది. పదవ తరగతి పరీక్షలు దగ్గరపడుతుండగా విద్యార్థులందరూ క్రమశిక్షణతో చదివి మంచి మార్కులతో ఉత్తీర్ణులు కావాలని సూచించారు.


