ఆర్టీసీ బస్సు ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు
తెనాలి రూరల్: ఆర్టీసీ బస్సు ఢీకొని బైక్‌పై వెళుతున్న ఇరువురు వ్యక్తులు గాయపడ్డారు. సేకరించిన వివరాల ప్రకారం తెనాలి నుంచి నందివెలుగు మీదుగా ఆర్టీసీ బస్సు గుంటూరు వెళుతుండగా కాజీపేట ఏ–వన్ ఫంక్షన్ హాల్ ఎదురుగా ఓ సైకిల్, బైక్ ఢీకొని దానిపై ప్రయాణిస్తున్న వారు రోడ్డుపై పడ్డారు. ఆర్టీసీ బస్సు డ్రైవర్ రోడ్డుపై పడిన వారిని తప్పించబోయి ఎదురుగా వస్తున్న బైకును ఢీకొట్టాడు. బైక్ పై ప్రయాణిస్తున్న కొలకలూరు బాపయ్యపేటకు చెందిన పురంశెట్టి రామకృష్ణ, నీలి శ్రీనివాసరావు గాయపడ్డారు. ఇరువురిని స్థానికులు తెనాలి వైద్యశాలకు తరలించారు. రూరల్ పోలీసులకు సమాచారం ఇవ్వగా దర్యాప్తు చేస్తున్నారు.
జిల్లా వైద్యశాలలో
నాలుగు స్క్రబ్ టైఫస్ అనుమానిత కేసులు
తెనాలి అర్బన్: జిల్లాను వణికిస్తున్న స్క్రబ్ టైఫస్ కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. తెనాలి జిల్లా వైద్యశాలలో ఇప్పటికే 10 మంది చికిత్స పొందారు.మరి కొందరు వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. వీరిలో పొన్నూరుకు చెందిన ఓ వ్యక్తి పరిస్థితి విషమించడంతో సోమవారం రాత్రి గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు పంపినట్లు వైద్యులు తెలిపారు. మంగళవారం మరో నలుగురు స్క్రబ్ టైఫస్ లక్షణాలతో చేరినట్లు చెప్పారు. వీరికి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేశామని, బుధవారం రిపోర్టులు వచ్చే అవకాశం ఉందన్నారు.
బాలుడు బలవన్మరణం
మార్టూరు: ఓ విద్యార్థి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మార్టూరులో మంగళవారం ఉదయం జరిగింది. స్థానికుల సమాచారం మేరకు.. స్థానిక విద్యానగర్ కాలనీకి చెందిన దేసు ప్రసన్నకుమార్ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు భద్రి ( 14) సంతానం. భద్రి స్థానిక ప్రైవేటు పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. క్లాసులో మెరిట్ స్టూడెంట్‌గా ఉండే భద్రి.. ఇటీవల తన అమ్మమ్మ మృతి చెందినప్పటి నుంచి మానసికంగా బాధపడుతూ స్కూల్‌కు సరిగా వెళ్లడం లేదు. ఈ క్రమంలో ఉదయం 7:30 గంటల సమయంలో భద్రి తన తాతయ్యకు టీ పెట్టి ఇచ్చి.. ఇంట్లోకి వెళ్లి తిరిగి బయటికి రాలేదు. మనుమడు ఎంతకూ బయటకు రాకపోవడంతో ఇంట్లోకి వెళ్లి చూడగా.. సీలింగ్ ఫ్యాన్‌కు తల్లి చీరతో ఉరి వేసుకొని వేలాడుతూ కనిపించాడు. కేకలు వేస్తూ స్థానికులను అప్రమత్తం చేయగా వారు కింద దించి స్థానిక ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. ఎప్పుడూ చదువులో ముందుందే భద్రి అకాల మరణంతో శోకసంద్రంలో మునిగిపోయిన పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు.
మనస్తాపంతో లారీ డ్రైవర్...
బల్లికురవ: మనస్తాపంతో ఓ లారీ డ్రైవర్ మద్యంలో గడ్డి నివారణకు వాడే పురుగు మందు కలుపుకొని తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 65 గంటలపాటు మృత్యువుతో పోరాడి మంగళవారం ఉదయం చనిపోయాడు. అందిన సమాచారం ప్రకారం మండలంలోని వైదన గ్రామానికి చెందిన శాయిని వేణుగోపాల్ (52) లారీ డ్రైవర్‌గా పనిచేస్తుంటాడు. ఈయనకు భార్య రామాంజమ్మ ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఆదివారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఒంగోలు జీజీహెచ్‌కు తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం చనిపోయాడు. ఎస్సై వై. నాగరాజు కేసు నమోదుతో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.
ఆర్టీసీ బస్సు ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు
ఆర్టీసీ బస్సు ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు


