డే నైట్..రైట్ రైట్
చీరాల టీడీపీ నేత అనుచరుల దందా ఇద్దరు పోలీసు అధికారులకు వాటాలు రోజుకు వందల ట్రాక్టర్లు, ట్రిప్పర్లతో రవాణా సొంత పొలం నుంచి తరలించినా అడ్డుకుంటున్న పోలీసులు
జిల్లాలో యథేచ్ఛగా ఇసుక అక్రమ తరలింపు
సాక్షి ప్రతినిధి, బాపట్ల: ప్రభుత్వం జనవరి నుంచి ఇసుక అమ్మకాలను ప్రైవేటు కంపెనీకి అప్పగించనుందన్న సమాచారంతో టీడీపీ నేతలు బరి తెగించారు. ఇసుకను రేయింబవళ్లు తరలించి అమ్ముకుంటున్నారు. చీరాల, బాపట్ల, వేమూరు, రేపల్లె ప్రాంతాల్లో అక్రమంగా తరలించి అమ్ముకుంటుండగా, కొందరు టీడీపీ నేతలు కప్పం వసూలు చేస్తున్నారు. చీరాల నియోజకవర్గంలో టీడీపీ నేత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తితోపాటు పోలీసు ఉద్యోగానికి సెలవు పెట్టిన మరోవ్యక్తి కలిసి అక్రమంగా అమ్ముకుంటున్నారు. వేటపాలెం మండలం పందిళ్లపల్లి ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున తవ్వి తరలిస్తున్నారు. చీరాల ప్రాంతంలో పనిచేస్తున్న ఇద్దరు పోలీసు అధికారులకు ఇందులో వాటాలున్నట్లు వినిపిస్తున్నాయి. గత వారం రోజుల నుంచి వందలాది ట్రాక్టర్లు, టిప్పర్లతో రేయింబవళ్లు తరలించి అమ్ముకుంటున్నారు. బచ్చులవారిపాలెం, ఊటుకూరు సుబ్బయ్యపాలెం మధ్యనున్న ఇసుక దిబ్బల నుంచేకాక చల్లారెడ్డిపాలెం, దేశాయిపేట, చీరాల రూరల్ పరిధిలోని పలుగ్రామాల పరిధిలో తవ్వి అమ్ముకుంటున్నారు. ప్రభుత్వ, అసైన్డ్ భూములను వదలడం లేదు. ఇసుక నేలలు ఉన్న రైతుల నుంచి ట్రాక్టర్ రూ.350లకు కొని రూ.4 వేల వరకు అమ్ముతుండగా ట్రిప్పర్ 12 నుంచి 15 వేల వరకు విక్రయిస్తూ, చీరాల, వేటపాలెం, బాపట్ల ప్రాంతాల్లో రియల్ వెంచర్లు, గృహ పునాదులకు తరలిస్తున్నారు. సొంత పొలంలో అవసరానికి ఇసుక తరలించినా దందా నిర్వాహకుల ఆదేశాలతో పోలీసులు కేసులు రాస్తున్నారు. ఇక దందా నిర్వాహకులు రేయింబవళ్లు తరలిస్తున్నా పట్టించుకోవడం లేదు. టీడీపీ నేతకు కప్పం, మైనింగ్ అధికారులకు నెల మామూళ్లు చెల్లిస్తున్నట్లు ప్రచారం ఉంది. బాపట్ల, కర్లపాలెం, పిట్టలవానిపాలెం ప్రాంతాల నుంచి, కొల్లూరులో కృష్ణా నది నుంచి తరలిస్తున్నా పోలీసులు, అధికారులు స్పందించడం లేదు.
రాత్రి వేళ ట్రాక్టర్‌ల ద్వారా అక్రమంగా ఇసుక తరలింపు
డే నైట్..రైట్ రైట్
డే నైట్..రైట్ రైట్


