మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ నిర్ణయంపై ప్రజాగ్రహం
బాపట్ల: రాష్ట్రవ్యాప్తంగా 17 మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ నిర్ణయానికి ప్రజాగ్రహానికి సోమవారం చేపట్టిన నిరసన ప్రదర్శనే నిదర్శనమని మాజీ డెప్యూటీ స్పీకర్ కోన రఘుపతి పేర్కొన్నారు. మంగళవారం స్థానిక వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కోన రఘుపతి మాట్లాడారు. చంద్రబాబునాయుడు సర్కారుపై ప్రజలలో ఏవిధమైన అసంతృప్తి ఉందో నిరసన ప్రదర్శనే చెబుతుందన్నారు. పేదల వైద్యం గురించి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆలోచించి మెడికల్ కళాశాలలను ప్రభుత్వ నిర్వహణలో ఉండే విధంగా నిర్ణయం తీసుకుంటే చంద్రబాబునాయుడు ఏకంగా ప్రైవేటుపరం చేసేందుకు పీపీపీ విధానాన్ని తీసుకువచ్చారని తెలిపారు. కోటి సంతకాల కార్యక్రమంలో భాగంగా సంతకాలు సేకరణకు వెళ్లినప్పుడు ప్రజల నుంచి వ్యతిరేకత కనిపించిందన్నారు. మెడికల్ కళాశాలలను ప్రభుత్వ నిర్వహణలోనే ఉంచాలని చేపట్టిన ప్రతి కార్యక్రమానికి విశేష స్పందన లభించిందని తెలిపారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన మెడికల్ కళాశాలలో పులివెందుల, పాడేరు కళాశాలలకు ఒక్కొక్కచోట 50 మెడికల్ సీట్లు వస్తే వాటిని తిరిగి వెనక్కి పంపిన చరిత్రహీనుడు చంద్రబాబునాయుడు అన్నారు. మెడికల్ కళాశాలల విషయంలో వెనక్కి తగ్గకపోతే కోర్టు తలుపు తట్టేందుకు వెనుకాడేది లేదని చెప్పారు. ఇండిగో సంక్షోభంలో రామోహన్‌నాయుడు, లోకేష్ ప్రమేయం ఉందని, వాటిని దాటవేసేందుకు ఆ పార్టీ తలమునకలై ఉందన్నారు. రాష్ట్రాన్ని అప్పులపాలు చేసేందుకు చంద్రబాబు కుట్ర చేస్తున్నారని ధ్వజమెత్తారు.
మాజీ ప్రధాని పీవీ గుర్తుకురాలేదా?
మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు హడావుడి చేసిన నాయకులకు మన రాష్ట్రానికి చెందిన తొలి తెలుగు ప్రధాని పీవీ నరసింహారావు గుర్తుకు రాకపోవటం బాధాకరమన్నారు. బాపట్ల పట్టణంలో నిలిచిపోయిన గుర్రం జాషువా, పొట్టి శ్రీరాములు, కోన ప్రభాకరరావు, ఎన్జీఆర్ విగ్రహాల గురించి పట్టించుకోని అధికార యంత్రాంగం ఆఘమేఘాలపై వాజ్‌పేయి విగ్రహానికి అనుమతి ఏవిధంగా ఇచ్చారు..ఇవ్వకపోతే నిర్మా ణం జరుగుతుంటే ఏమి చేశారని ప్రశ్నించారు. వాజ్‌పేయి విగ్రహం ఏర్పాటు చేసిన స్థలం జాతీయ రహదారి నిర్మాణంలో మిగిలిన సొసైటీ భూములని కోన గుర్తు చేశారు. ఈ విషయంపై సరైన సమాధానం చెప్పాల్సిన బాధ్యత అధికారులపై ఉందని తెలిపారు. సమావేశంలో పార్టీ మండల అధ్యక్షులు మరుప్రోలు ఏడుకొండల రెడ్డి, యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి నక్కా వీరారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు కోకి రాఘవరెడ్డి, ఇనగలూరి మాల్యాద్రి, ఇమ్మడిశెట్టి శ్రీనివాసరావు, చల్లా రామయ్య, జోగి రాజా, అడే చందు, మోర్ల సముద్రాలగౌడ్, రెడ్డింకయ్య, మచ్చా శ్రీనివాసరెడ్డి, అనిల్‌కుమార్ పాల్గొన్నారు.


