పగలు రెక్కీ.. రాత్రిళ్లు చోరీ
నరసరావుపేట టౌన్: పగలు దుప్పట్లు విక్రయిస్తూ రెక్కీ నిర్వహించి తాళ్లాలు వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకొని చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అరెస్ట్ చేసినట్లు నరసరావుపేట ఇన్‌చార్జి డీఎస్పీ ఎం.హనుమంతరావు తెలిపారు. మంగళవారం డీఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో కేసు వివరాలు వెల్లడించారు. చిలకలూరిపేట పట్టణానికి చెందిన బైరా సుజాత గృహంలో దుండగులు ఇంటి తాళాలు పగులగొట్టి గృహంలోని 21 సెవర్ల బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు, వాచీలు, రూ.లక్ష నగదును ఈ ఏడాది నవంబర్ 28న దోచుకెళ్లారు. ఈ మేరకు కేసు నమోదు చేసి చిలకలూరిపేట పట్టణ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారన్నారు. ఉత్తరాఖండ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు చెందిన ఐదుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా గుర్రాలచావిడి, పాత బాలాజీ సినిమా హాల్ దగ్గర సోమవారం సంచరిస్తుండటంతో వారిని అదుపులోకి తీసుకున్నామన్నారు. విచారణలో పైనేరాన్ని వారే చేసినట్లుగా అంగీకరించారన్నారు. నిందితులు నూర్ హసన్, నొసద్, మిన్నా యామిన్, అబ్దుల్ గప్పార్, సాహుల్ జబ్బార్‌లను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ. 1,25,800 విలువైన చోరీ సొత్తును, దొంగతనానికి ఉపయోగించిన పరికరాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచిన అనంతరం మిగిలిన సొత్తు రికవరీ కోసం పోలీస్ కస్టడీ కోరతామన్నారు. ఈ దొంగల ముఠాపై హర్యానా, రాజస్థాన్, హిమాచల్‌ప్రదేశ్, గుజరాత్, బీహార్, ఒడిశాలతోపాటు ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ జిల్లాలో కేసులు నమోదై ఉన్నాయని డీఎస్పీ తెలిపారు. కేసు దర్యాప్తులో ముఖ్యపాత్ర వహించిన చిలకలూరిపేట అర్బన్ సీఐ పి.రమేష్ , ఎస్‌ఐ హజరత్తయ్య, సిబ్బంది వై.శ్రీనివాస్, ఎస్.వణుకుమార్, వి.హరీష్, కె. శ్రీరాములు, వి.నారాయణరావు, జి.జాన్‌బాబు, కె.శివకృష్ణ, షేక్ జాన్‌బాషా సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.


