పంతుళ్లపై పరాయి పెత్తనం
పదవ తరగతిలో వంద శాతం ఉత్తీర్ణతకు ప్రణాళిక పర్యవేక్షణకు ఇతర శాఖల అధికారులు ప్రతి పాఠశాలకు ఒకరు నియామకం విద్యాశాఖకు అనధికారిక ఉత్తర్వులు అసంతృప్తిలో ఉపాధ్యాయులు
ఉపాధ్యాయుల్లో అభద్రతా భావం
నియామకం పూర్తి
నరసరావుపేట ఈస్ట్: రాష్ట్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో విద్యాశాఖలో గందరగోళ పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఇప్పటికే పలు రకాల యాప్‌లతో ఉపాధ్యాయులు తలమునకలై ఉండగా, ఈ విద్యా సంవత్సరంలో ప్రభుత్వం కొత్తగా పదవ తరగతిలో నూరు శాతం ఉత్తీర్ణత కోసం వంద రోజుల ప్రణాళికను రూపొందించింది. దీని పర్యవేక్షణకు ప్రతి ఉన్నత పాఠశాలకు ఇతర ప్రభుత్వ శాఖలకు చెందిన ఒక గెజిటెడ్ అధికారిని నియమిస్తూ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ మౌఖిక ఆదేశాలు జారీ చేయడం విద్యాశాఖ అధికారులకు మింగుడు పడటం లేదు. ప్రణాళికలో భాగంగా ప్రత్యేక తరగతుల నిర్వహణ, స్లిప్ టెస్ట్, మార్కుల నమోదు, హాజరు నమోదు తదితర అంశాలన్నీంటినీ ఇన్‌చార్జులు పర్యవేక్షించనున్నారు. జిల్లా పరిధిలో ప్రభుత్వ యాజమాన్యంలోని 273 పాఠశాలల్లో మొత్తం 14,956 మంది పదవ తరగతి విద్యార్థులున్నారు.
ఇన్‌చార్జులుగా ఇతర శాఖల అధికారులు
పదవ తరగతి పరీక్షల ప్రణాళికను పర్యవేక్షణకు రెవెన్యూ, పంచాయతీరాజ్, డ్వామా, వైద్య, వ్యవసాయ, ఇరిగేషన్, మున్సిపల్, హౌసింగ్ తదితర శాఖలకు చెందిన అధికారులను ఇన్‌చార్జులుగా నియమిస్తున్నారు. ప్రతి ఉన్నత పాఠశాలకు ఒక ఇన్‌చార్జి ఉంటారు. అధికారులు తగిన సంఖ్యలో లేనట్లయితే ఒకరికే రెండు, మూడు పాఠశాలలను పర్యవేక్షించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే జిల్లాలో అధికారుల నియామకం దాదాపు పూర్తయినట్టు తెలుస్తోంది.
టీచర్ల ఆగ్రహం
విద్యాశాఖలో ఇతర శాఖల అధికారుల పర్యవేక్షణపై ఉపాధ్యాయుల నుంచి ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఇప్పటికే వివిధ ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు తమ నిరసనను ఆయా జిల్లాల విద్యాశాఖాధికారుల ఎదుట వ్యక్తపరుస్తున్నారు. ప్రతి జిల్లాలో జిల్లా విద్యాశాఖాధికారితో పాటు డెప్యూటీ డీఈఓలు, ప్రతి మండలంలో ఇద్దరేసి చొప్పున ఎంఈఓలు ఉన్నారు. వీరితో పాటు ప్రతి ఉన్నత పాఠశాలలో అనుభవజ్ఞులైన ప్రధానోపాధ్యాయులు, సీనియర్ సబ్జెక్ట్ ఉపాధ్యాయులు ఉన్నారు. వీరందరూ ఉండగా ఇతర శాఖల నుంచి అధికారులను ఇన్‌చార్జులుగా నియమించాల్సిన అవసరమేంటని ఉపాధ్యాయ వర్గాల నుంచి వినిపిస్తున్న ప్రశ్న. ఇన్‌చార్జుల నియామకం తమను అవమానించటమేనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల నిర్వహణ, విద్యార్థుల సామర్ధ్యం, సిలబస్ వంటి అంశాలలో వారికున్న అనుభవం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. పది ఫలితాలలో ఏవైనా తేడాలు వస్తే ఇన్‌చార్జులు బాధ్యత తీసుకుంటారా ? అని ప్రశ్నిస్తున్నారు.
పర్యవేక్షణ పేరుతో ఇతర శాఖల అధికారులను విద్యాశాఖపై పెత్తనానికి నియమించటం గర్హనీయం. ఇది ఉపాధ్యాయులలో అభద్రతా భావాన్ని పెంచుతుంది. 100 రోజుల ప్రణాళికతో ఇప్పటికే ఉపాధ్యాయులపై భారం మోపారు. మళ్లీ ఇప్పుడు ఇన్‌చార్జులను నియమించి ఉపాధ్యాయుల స్థైర్యాన్ని దెబ్బతీస్తున్నారు.
– ఎం.మోహనరావు, ప్రధాన కార్యదర్శి, యుటీఎఫ్, పల్నాడు జిల్లా.
పదవ తరగతి పరీక్షల్లో నూరుశాతం ఫలితాల కోసం చేపట్టిన నూరు రోజుల ప్రణాళికను పర్యవేక్షించేందుకు ప్రతి పాఠశాలకు ఒక గెజిటెడ్ అధికారి నియామకం పూర్తయింది. సదరు అధికారి ఆయా పాఠశాలను ప్రతి వారంలో తనకు వీలున్నప్పుడు పాఠశాలను సందర్శించి విద్యార్థి సామర్థ్యం, ఇతర ప్రణాళిక అంశాలను పరిశీలిస్తారు. జిల్లాలోని 273 ప్రభుత్వ పాఠశాలలకు 273 మంది అధికారులను నియమించాం.
– పీవీజే రామారావు, డీఈఓ, పల్నాడు జిల్లా
పంతుళ్లపై పరాయి పెత్తనం


