అలరించిన జానపద సాంస్కృతిక సంబరాలు
నగరంపాలెం (గుంటూరు వెస్ట్): భావితరాలకు భారతీయ కళల ప్రాశస్త్యాన్ని తెలియజేయాలని ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) చైర్మన్ పిన్నమనేని ప్రశాంత్ తెలిపారు. మార్కెట్ కూడలిలోని శ్రీ వెంకటేశ్వర విజ్ఙాన మందిరంలో బుధవారం రాత్రి నాట్స్ ఆధ్వర్యంలో జానపద సాంస్కృతిక సంబరాలు, ఉత్తమ ఉపాధ్యాయులు, కవులకు పురస్కారాలు ప్రదానం చేశారు. మాజీ ఎమ్మెల్సీ కేఎస్.లక్ష్మణరావు నిర్వహణలో అతిథులు జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. ఈ సందర్భంగా నాట్స్ చైర్మన్ పిన్నమనేని ప్రశాంత్ మాట్లాడుతూ భారతీయ కళలు అంతరించపోకుండా జానపద, సాంస్కృత సంబరాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరూ కళలను ప్రోత్సహించాలని చెప్పారు. జానపద కళలను చిన్నతనంలో తిలకించానని, ప్రస్తుతం నిర్వహించిన ప్రదర్శనలు అద్భుతంగా ఉన్నాయని పేర్కొన్నారు. నాట్స్ అధ్యక్షుడు మందాడి శ్రీహరి మాట్లాడుతూ సంస్థ ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల్లో సేవా, సాంస్కృతి కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆయా రాష్ట్రాలలో జానపద కళలను ప్రోత్సహించేందుకు కళాకారులకు ఆర్థికంగా చేయూత అందిస్తున్నామని పేర్కొన్నారు. సంస్కృతీ, సంప్రదాయ కళలను ప్రోత్సహించేందుకు నాట్స్ అన్నివేళల్లో ముందు వరుసలో ఉంటుందని చెప్పారు. కన్వీనర్, మాజీ ఎమ్మెల్సీ కె.ఎస్.లక్ష్మణరావు మాట్లాడుతూ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నాట్కో లక్షలాది రూపాయలతో సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. అనంతరం ప్రజా గాయకుడు పి.వి. రమణ నేతృత్వంలో కళాకారుల విన్యాసాలు అలరించాయి. శ్రీకాకుళం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాలు, అంబేడ్కర్ కోనసీమ, కృష్ణ జిల్లాలతోపాటు మలినేని ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల కోలాటం, డప్పు, కొమ్ము కోయి తదితర నృత్యాల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు మందాడి కిరణ్, వేమూరి శ్రీనివాసరావు, వైద్యులు ఏ.ఆంజనేయులు, జన చైతన్య వేదిక నిర్వాహకులు లక్ష్మణ్‌రెడ్డి, కాకుమాను నాగేశ్వరరావు పాల్గొన్నారు.


