పీఎఫ్ రుణాలపై ఆడిట్ అభ్యంతరాలు తొలగించాలి
గుంటూరు ఎడ్యుకేషన్: అత్యవసర ఖర్చుల కోసం ఉపాధ్యాయులు దాఖలు చేస్తున్న పీఎఫ్ రుణాల దరఖాస్తులను అసంబద్ధమైన ఆడిట్ అభ్యంతరాలతో తిరస్కరించడం మానుకోవాలని ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు కె.బసవ లింగారావు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం జిల్లా ఆడిట్ అధికారి బి.మధురిమను గుంటూరులోని ఆడిట్ కార్యాలయంలో కలిసిన ఏపీటీఎఫ్ బృందం ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆమె దృష్టికి తెచ్చారు. – బసవ లింగరావు మాట్లాడుతూ ఉమ్మడి గుంటూరు జిల్లాలోని జెడ్పీ పాఠశాలల్లో వివిధ కేడర్లలో పని చేస్తున్న ఉపాధ్యాయుల అవసరాలకు ఉపయోగపడతాయని నెల నెలా పీఎఫ్‌లో దాచుకున్న సొమ్ము అనారోగ్య పరిస్థితుల్లో వైద్య చికిత్సల కోసం దాఖలు చేసుకున్న రుణ దరఖాస్తుల్లో రూ.ఐదు లక్షలు దాటితే అసిస్టెంట్ సివిల్ సర్జన్, మెడికల్ సర్టిఫికెట్ తేవాలని లేదంటే పీఎఫ్ దరఖాస్తును తిరస్కరిస్తున్నారని అన్నారు.
● పీఎఫ్ రుణాల మంజూరులో అర్థం లేని నిబంధనలు విధించడం తగదని, లేని నిబంధనలు చూపి దరఖాస్తులను ఏ విధంగా తిరస్కరిస్తారని ప్రశ్నించారు. ఆడిట్ కార్యాలయం నుంచి లేవనెత్తుతున్న అభ్యంతరాలు పూర్తిగా విరుద్ధమన్నారు.
● ఎన్జీవోలకు వర్తించే నిబంధనలను ఉపాధ్యాయులకు అన్వయించడం సహేతుకం కాదని, కేంద్ర ప్రభుత్వం గుర్తింపు పొందిన ఏ మెడికల్ ప్రాక్టీషనర్ నుంచి అయినా సర్టిఫికెట్ సమర్పిస్తే సరిపోతుందన్నారు.
● పీఎఫ్ డబ్బులు ఎప్పుడు వస్తాయో తెలియక ఆందోళనలో ఉపాధ్యాయులు ఉన్న పరిస్థితుల్లో జెడ్పీ పీఎఫ్ విభాగం, జిల్లా ఆడిట్ కార్యాలయం ఒకరిపై ఒకరు చెప్పుకుని రుణ దరఖాస్తులను కొర్రీలు వేస్తూ, కాలయాపనతో ఉపాధ్యాయులను ఇబ్బందులకు గురిచేయడం తగదన్నారు.
● ఏపీటీఎఫ్ జిల్లా శాఖ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ ఖాలీద్ మాట్లాడుతూ పీఎఫ్ రుణాలపై జెడ్పీ కార్యాలయ సిబ్బంది వ్యవహరిస్తున్న అసంబద్ధ విధానాలపై పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా సమస్యలు పరిష్కారం కావడం లేదన్నారు.
● రుణానికి దరఖాస్తు చేసుకున్న ఉపాధ్యాయులతో పాటు, ఉద్యోగ విరమణ అనంతర తుది చెల్లింపులకు ఉపాధ్యాయులకు ఫోన్ చేసి వ్యక్తిగతంగా కలవాలని చెబుతున్నారని, ఈ విధంగా ప్రవర్తించడ సరికాదన్నారు.
● జిల్లా ఆడిట్ అధికారి బి.మధురిమ స్పందిస్తూ ఉపాధ్యాయులకు ఇబ్బంది లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు.
ఆడిట్ అధికారిని కలసిన వారిలో ఏపీటీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు పి.నాగశివన్నారాయణ, జి.దాస్, జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాసరావు, జిల్లా ఆడిట్ కమిటీ కన్వీనర్ యూ.వందనం, జిల్లా కౌన్సిలర్లు సయ్యద్ జహంగీర్, కృష్ణారావు, గురుమూర్తి, అప్పారావు, తదితరులు ఉన్నారు.
ఏపీటీఎఫ్ డిమాండ్


