పరిహారంపై కూటమి పరిహాసం | - | Sakshi
Sakshi News home page

పరిహారంపై కూటమి పరిహాసం

Nov 6 2025 8:16 AM | Updated on Nov 6 2025 8:16 AM

పరిహారంపై కూటమి పరిహాసం

పరిహారంపై కూటమి పరిహాసం

తీవ్రంగా సిబ్బంది కొరత చిత్తశుద్ధి శూన్యం ఆన్‌లైన్‌లో నమోదు కాని వేల ఎకరాలు

గత ఏడాది పరిహారం ఎక్కడ?

అరకొర సిబ్బందితోనే అడ్డగోలుగా పంట నష్టం అంచనా

కౌలు రైతులకు తప్పని కష్టాలు

ప్రభుత్వంపై నమ్మకం లేక ఈ ఏడాది పంటల నమోదు చేయని కొందరు రైతులు

సోషల్‌ ఆడిట్‌ కోసం ఒకరోజు గడువు

రైతుల వద్ద భారీగా మిగిలిన పొగాకు నిల్వలు

గత సంవత్సరం కొనుగోళ్లకు విడుదల కాని బకాయిలు

కూటమి ప్రభుత్వం తీరుతో అన్నదాతలు కుదేలు అవుతున్నారు. పరిహారం అందించాల్సిన పాలకులు రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. ఇటీవల మోంథా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో తీవ్ర నష్టం వాటిల్లింది. ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు పర్యటనలకే పరిమితం అయ్యారు. పంట నష్టం అంచనాకు అవసరమైన చర్యలు తీసుకోవడం లేదని రైతులు, రైతు సంఘం నాయకులు ధ్వజమెత్తుతున్నారు.

మార్టూరు: ఇటీవల ఏర్పడిన మోంథా తుఫాన్‌ కారణంగా బాపట్ల జిల్లా వ్యాప్తంగా అరటి, బొప్పాయి, వరి, మొక్కజొన్న, మిర్చి, కూరగాయలు, పత్తి, మినుము, తదితర పంటలు తీవ్ర దెబ్బతిన్నాయి. ఉద్యాన, వ్యవసాయ శాఖ అధికారులు, సిబ్బంది మంగళవారం సాయంత్రం హడావుడిగా జిల్లాలోని 25 మండలాలకు చెందిన 316 రైతు సేవ కేంద్రాల ద్వారా పంట నష్టం వివరాలు నమోదు చేసి జిల్లా అధికారులకు పంపించారు. అర్హులైన రైతుల వివరాలను సోషల్‌ ఆడిట్‌ నిమిత్తం బుధవారం ఒక్కరోజు మాత్రమే రైతు సేవ కేంద్రాల్లో ప్రదర్శించనున్నట్లు అధికారులు తెలిపారు. పంట నమోదులో పేర్లు లేని రైతులు, నష్టం, విస్తీర్ణంలో తేడాలు వంటివి సరిచూసుకోవడానికి ఒకరోజు సరిపోతుందా? అని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో జనాభా ప్రాతిపదికన సచివాలయాలను ఏర్పాటు చేశారు. ఒక వీఏఓను నియమించిన సంగతి తెలిసిందే. ప్రస్తుత ప్రభుత్వం సర్దుబాటు నెపంతో రైతు సేవ కేంద్రాలను తగ్గించడమే కాకుండా సిబ్బంది నియామకంలో సమతుల్యాన్ని పాటించడం లేదు. సిబ్బంది కొరత వేధిస్తోంది. కొన్ని మండలాల్లో ఒక్కో వీఏఓ రెండు నుంచి మూడు గ్రామాల బాధ్యతలు చూడాల్సి రావటంతో తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. క్షేత్రస్థాయిలో పంటలను పరిశీలించకుండానే తమ ఇష్టారీతిన నష్టాల వివరాల నమోదు చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. మార్టూరు మండలంలోని బొల్లాపల్లిలో 150 ఎకరాల్లో కూరగాయల పంటను సాగు చేసిన రైతుల భూములను మినుము పంటగా నమోదు చేయటం ఇందుకు నిదర్శనం. ఈ పరిస్థితుల్లో తుఫాన్‌ నష్ట తీవ్రతను అంచనా వేయటం సాధ్యమయ్యే పనేనా అని రైతు సంఘం నాయకులు ప్రశ్నిస్తున్నారు.

కూటమి ప్రభుత్వ వైఖరితో ఈ ఏడాది ఈ– క్రాప్‌ బుకింగ్‌ చేసుకోవడానికి అన్నదాతలు ముందుకు రాలేదు. వెబ్‌సైట్‌ను గత నెల 25వ తేదీన కూటమి ప్రభుత్వం మూసివేసింది. గత సోమవారం సాయంత్రం ఓపెన్‌ చేసి మంగళవారం సాయంత్రం లోపు పంట నష్టం వివరాలు మండల స్థాయి అధికారులు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఇదేనా అన్నదాతలపై పాలకులకు ఉన్న చిత్తశుద్ధి అని రైతులు ప్రశ్నిస్తున్నారు.

జిల్లాలో రెవెన్యూ సమస్యలు పరిష్కారం కాక ఈనాం, మాన్యాల భూములు ఆన్‌లైన్‌లోకి ఎక్కలేదు. దీంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఇలాంటి భూములు సాగులో వేల ఎకరాలున్నాయి. మార్టూరు మండలంలోని జంగమహేశ్వరపురం రెవెన్యూ పరిధిలోనే 1,700 ఎకరాలు ఆన్‌లైన్‌ కాలేదు. ఇలాగే మండల వ్యాప్తంగా వందల ఎకరాలు ఉన్నాయి. వీరందరికీ పరిహారం ఎలా అందుతుందో, ప్రభుత్వం ఏం చేస్తుందో వేచి చూడాల్సిందే.

గత సంవత్సరం వచ్చిన తుపాను కారణంగా జిల్లాలో వేల ఎకరాల్లో పంట నష్టం సంభవించింది. అధికారిక అంచనాల ప్రకారం ఈ –క్రాప్‌ బుకింగ్‌ చేసుకున్న రైతుల్లో కూడా వేల మందిని పంట నష్టానికి అనర్హులుగా తేల్చారు. బాపట్ల జిల్లా వ్యవసాయ శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ రామకృష్ణ మార్టూరు మండలంలోని బొల్లాపల్లి, తాటివారిపాలెంలో తుఫాన్‌ కారణంగా నష్టపోయిన రైతులను పరామర్శించారు. 800 ఎకరాల్లో మినుము పంట నష్టం జరిగినట్లు నివేదికలు పంపించారు. ఇప్పటికీ గత సంవత్సరం పరిహారం రైతుల ఖాతాల్లో నమోదు కాకపోవడం గమనార్హం.

ఈ సంవత్సరం మార్టూరు మండలంలో 3,300 కౌలుదారు కార్డులు పంపిణీ చేయాలని లక్ష్యం. కానీ 800 మందికి మాత్రమే అందించారు. ఈ కారణంగా కౌలుదారులు సాగు చేసే పంటలకు సంబంధించిన పరిహారం తమకు కాకుండా భూ యజమానుల ఖాతాల్లో పడతాయని కౌలు రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇక సొసైటీల ద్వారా రైతులకు యూరియా, డీఏపీ వంటి కాంప్లెక్స్‌ ఎరువులను పంపిణీ చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం సొసైటీలకు అనుమతి మంజూరు చేయడంలో ఘోరంగా విఫలమైంది. మార్టూరు మండలంలో తొమ్మిది ప్రాథమిక సహకార సంఘాలు ఉండగా కేవలం నాలుగింటి ద్వారానే ఎరువులు పంపిణీ చేశారు. పంట నష్ట పరిహారం, సిబ్బంది కొరత, ఎరువుల పంపిణీ లోపాలపై రైతు సంఘం నాయకులు గత సోమవారం పీజీఆర్‌ఎస్‌లో జాయింట్‌ కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement